Saturday, November 16, 2024

AP | వైసీపీ పాల‌న‌లో తీరని అన్యాయం : ఎంపీ రమేష్

మురళీనగర్ హైవే లో ఉన్న బొచ్చా కన్వెన్షన్ హాల్ లో ఈరోజు శనివారం బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పి.విష్ణుకుమార్ రాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేసారు. ఈ సందర్భంగా బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి మాట్లాడుతూ…. అధిక సంఖ్యలో సభ్యత్వాలను నమోదు చేసే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపారు. సభ్యత్వ నమోదును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని, పార్టీ పైన ఆసక్తి ఉన్నవారిని సభ్యులుగా తీసుకోవాలని కోరారు. ప్రజలకు బీజేపీ పార్టీ ప్రయోజనాలను, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయలను వివరించి బీజేపీ పట్ల ఆకర్షితుల ఏవిధంగా నాయకుల కృషి చేయాలని అన్నారు. తాను అనకాపల్లితో పాటు విశాఖ జిల్లాలోనూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఫార్మా ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని జగన్మోహన్ రెడ్డి అనడం దుర్మార్గమని, ఈ ప్రమాదాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధితులు ఆశ్చర్యపోయే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షతగాత్రులను పరామర్శించి నష్టపరిహారం అందజేశారని అన్నారు. పరిశ్రమలలో ప్రమాదాల పురావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు.

జగన్ గత ఐదేళ్లలో అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనంతో రుషికొండలో విలాసవంతమైన భవనాన్ని నిర్మించారని, రుషికొండ భవనాల వివరాలు తెలపమని ఏపీటీడీసీకి త్వరలో లేఖ రాస్తానని చెప్పారు. కాంగ్రెస్ దేశానికి చేస్తోన్న దుర్మార్గాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. జమ్మూ& కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాశ్మీర్‌లో రెండు జెండాలు ఉండాలని కోరుకుంటోందని అన్నారు. ఇది దేశప్రజలెవ్వరూ హర్షించరని అన్నారు. వారితో రాహుల్ గాంధీ కలిసి ఎన్నికలకు వెళ్లడం దుర్మార్గమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ విశాఖలో ఊహించని పరిణామాలను చూస్తున్నామని, పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకూడదని అన్నారు. ఫార్మా ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి బాధితులను పరామర్శించారని, ఫార్మా కంపెనీలో ప్రమాదాలను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు.

- Advertisement -

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిన్న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయని తెలిపారు. గత ఐదేళ్ల పాటు అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం రూ.800 కోట్లను గ్రామపంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథ రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి M నాగేంద్ర, బీజేపీ జిల్లా ఇంచార్జి పుట్ట గంగయ్య, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి A కేశవకాంత్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధ లక్ష్మీనారాయణ, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement