Saturday, November 23, 2024

ఉగాది వేడుకలకు ఢిల్లీలో విస్తృత ఏర్పాట్లు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు సురభి నాటకాలు.

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఉగాది వేడుకలకు ముస్తాబైంది. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాదిని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో రెండ్రోజుల పాటు పండుగ వేడుకలు నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. వేడుకల్లో భాగంగా ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 3 షోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాయంత్రం నాదస్వరంతో మొదలై, వేదపండితులతో పంచాంగ శ్రవణం, అరకు గిరిజన కళాకారులతో ‘థింసా’ నృత్య ప్రదర్శన, ‘పుష్పాంజలి’ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాగే కనుమరుగవుతున్న నాటక సంప్రదాయ పునరుజ్జీవానికి తమవంతు చేయూతనందిస్తూ వినాయక నాట్య మండలి (సురభి) కళాకారులతో  ‘మాయా బజార్’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి పౌరాణిక నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యేవారికి ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ, కాణిపాకం దేవస్థానాల వారి ప్రసాదాలు, ఉగాది పచ్చడి, ఉచిత ఆంధ్ర సంప్రదాయ విందు భోజనం ఏర్పాటు చేసినట్టు ఏపీ భవన్ అధికారులు ప్రకటించారు.
 
ఇవేకాకుండా ఈ వేడుకల్లో భాగంగా ఏ.పీ మార్క్ ఫెడ్, ఏ.పీ సివిల్ సప్లైస్, ఆప్కోస్, డ్వాక్రా, గిరిజన్  కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జీ.సీ.సీ), లేపాక్షి సంస్థల ద్వారా నోరూరించే ఆంధ్ర రుచులు, పిండి వంటలకు సంబందించిన వివిధ రకాల అంగళ్లు, వస్తు ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శనివారం ఉదయం గం. 9.30కు భవన్ ప్రాంగణంలో సివిల్ సప్లైస్ విభాగం వారి స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు భవన్ అధికారులు వెల్లడించారు. వేడుకలకు హాజరయ్యే ఢిల్లీలోని తెలుగువారి కోసం సదరన్ ట్రావెల్స్ వారి సహాయంతో ఉచిత రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఏపీ భవన్ ప్రాంగణంలో వేద పండితులు, జ్యోతిష్యులతో భవిష్య జాతకం తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చినవారిలో ఉత్తమ దుస్తులను ఎంపికచేసి వారికి నగదు బహుమానం, ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆప్కో ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement