Tuesday, November 26, 2024

ఏపీలో జర్నలిస్టుల హెల్త్‌ స్కీం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్‌ జర్నలిస్టుల హెల్త్‌ స్కీం పథకాన్ని(2023-24) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ టీ.విజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ కొత్త అక్రిడిటేషన్‌ కార్డు మంజూరుకు గత నెల 31న జీవో 38 జారీ చేశామన్నారు. కొత్తగా అక్రిడిటేషన్‌ పొందిన వర్కింగ్‌ జర్నలిస్టులు ప్రీమియం కింద రూ.1,250 (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఎఫ్‌ఎంఎస్‌.ఏపీ.జీవోవీ.ఉయ) వెబ్‌సైటు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్‌ చలానా, రెన్యూవల్‌ చేయించుకున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌ జిరాక్సు కాపీలను రాష్ట్ర సమాచార కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు అయితే సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలని కమిషనర్‌ సూచించారు.

- Advertisement -

వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం వాటా రూ.1,250గా తెలిపారు. భార్యాభర్తలతో పాటు పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్‌ వర్తిస్తుందన్నారు. ఈ స్కీమ్‌ లో భాగంగా ప్రభుత్వం కార్పస్‌ ఫండ్‌ ను నిర్వహిస్తూ జర్నలిస్టులు చేసిన వైద్య ఖర్చులను రీయింబర్స్‌ చేస్తుందని పేర్కొన్నారు. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్ధేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు.

ఈ పథకానికి వైఎస్సార్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీగాను, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్రిడిటేషన్‌ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్‌ టి. విజయ్‌ కుమార్‌ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement