గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో: ఎండు మిర్చికి ఎగుమతుల పంట పండుతోంది. సీజన్ పూర్తయిన తర్వాత శీతలగిడ్డంగుల్లో నిల్వ ఉన్న సరుకు యార్డుకు చేరుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగుచేసే తేజ రకం తాజాగా చైనా, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి అవుతోంది. దీంతో క్వింటా రూ. 24వేల నుంచి రూ. 25 వేల ధర లభిస్తోంది. తేజ రకానికి డిమాండ్ పెరగడంతో శీతలగిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరుకును వియ్రాల కోసం తీసుకువస్తున్నారు. తేజతో పాటు మిగిలిన రకాలు క్వింటా రూ.20వేల నుంచి రూ.24వేల వరకు ధరలు పలుకుతున్నాయి.
ఏడాదిగా మిర్చికి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల్రైన పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో జనవరి నెలలో మిర్చి సాగు చేశారు. మే, జూన్ నెలల్లో అక్కడి మిర్చి దిగుబడులు మార్కెటుకు వచ్చాయి. దీంతో గుంటూరు యార్డు నుంచి ఉత్తర భారతదేశానికి సరకు రవాణా తగ్గింది. రెండు నెలల పాటు స్థానికంగా ఉన్న మిర్చిని అక్కడి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ పండే మిర్చి దేశీయ అవసరాలకు మినహా విదేశాలకు ఎగుమతి చేసే అంత నాణ్యత ఉండదు. ఈ ప్రభావంతో గుంటూరు నుంచి ఉత్తరాదికి రవాణా అయ్యే మిర్చి పరిమాణం తగ్గింది. ఇక్కడి మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు నిలకడగా ఉన్నాయి.
అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం
గత నెలలోనూ మార్కెటుకు నాన్‌ఏసీ మిర్చి రావడంతో క్రయవిక్రయాలు జరిగాయి. దీంతో మే, జూన్ నెలల్లోనూ శీతలగోదాముల్లో మిర్చి నిల్వలు తీయాల్సిన అవసరం రాలేదు. గుంటూరు నగర పరిసరాల్లోని గోదాముల్లో సుమారు 50లక్షల టిక్కీలు నిల్వ ఉండగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 70లక్షల టిక్కీల వరకు నిల్వలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి 15లక్షల నుంచి 20లక్షల టిక్కీల నిల్వలు అధికంగా ఉన్నాయి. మరోవైపు దేశీయంగా మిర్చికి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంది.
ఉత్తరాదిన కొత్తగా సరకు రావడం కూడా మార్కె-ట్‌పైప్రభావం చూపింది. ప్రస్తుతం గుంటూరు యార్డుకు సగటున 40వేల టిక్కీలు వస్తుండగా అంతేస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో అమ్మకాలు మరింత పుంజుకుంటాయన్న అంచనాలు ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్తో పాటు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతులు పెరగడానికి మరింత సమయం పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నందున ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తేజ రకం ఎగుమతులు బాగున్నందున డిమాండ్ ఉందని, మిగిలిన రకాల ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.