Saturday, November 23, 2024

విస్తరిస్తున్న ఫార్మా మాఫియా.. పట్టించుకోని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు..

కర్నూలు, ప్రభ న్యూస్‌ బ్యూరో : ఓవైపు లైసెన్స్‌ లేని దుకాణాలు.. మరోవైపు నకిలీ టాబ్లెట్లు.. ఇంకోవైపు బ్రాండెడ్‌ ముసుగులో అధిక ధరలు.. వెరసి కర్నూలు, నంద్యాలలో ఫార్మా మందుల దందా సాగుతోంది. తక్కువకు లభించే జనరిక్‌ మందులను బ్రాండెడ్‌ పేరుతో రోగులకు అంటగడుతున్నారు. అంతేకాదు.. అధిక ధరలకు విక్రయిస్తూ మందుల షాపుల యజమానులు డబ్బు వెనకేసుకుంటున్నారు. బ్రాండెడ్‌ మందులు అమ్మితే 200 శాతం వరకు లాభాలు తక్కువని, వాటి పేరుతో జనరిక్‌ మందులమ్మితే అధిక లాభాలు గడించవచ్చనే దురాశతో ప్రజలకు కావాలనే అంటగడుతున్నారు. ఇవేమీ తెలియని అమాయకలు ఏ మందులిస్తే వాటినే మింగేస్తున్నారు. ఇలా చాలామంది ఏది బ్రాండెడో, ఏది జనరికో తెలియక ఆర్థికంగా మోసపోతున్నారు. ప్రజలు జనరిక్‌ మందులకు అలవాటు పడితే ఫార్మా కంపెనీలు, ఏజెన్సీలు, షాపులకు నష్టం వస్తుంది. ఇదే ఆలోచనతో జనరిక్‌ మందులు బ్రాండెడ్‌ మందుల అంత ప్రభావశీలంగా పనిచేయవని పుకార్లు పుట్టిస్తున్నారు. కాగా, బ్రాండెడ్‌ మందులు అమ్మే దుకాణాలకు ఫార్మా కంపెనీలు ఆఫర్లు ఇస్తుండటం కూడా ఓ కారణం. ఈ వ్యవహారంలో జిల్లాలోని పలు మెడికల్‌ అసోసియేషన్‌ నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్న సమాచారం. ఈ విషయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల జోక్యం లేకుండా మెడికల్‌ షాపుల అసోసియేషన్‌ నాయకులు ఒక్కో ఔషధ దుకాణం నుంచి నెలకు రూ.2,500 నుంచి రూ.3 వేల వసూలు చేస్తున్నారు. అందులో సగం ఔషధ తనిఖీ అధికారులకు ఇచ్చి, మిగతా సగం పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో ఈ దందాపై జిల్లాస్థాయి ఔషధ నియంత్రణ శాఖ ఉన్నత అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

నియంత్రించాల్సిన నిఘా విభాగం మామూళ్ల మత్తులో జోగుతుండటంతో ఔషధ దుకాణదారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 2500 నుంచి మూడు వేల వరకు మెడికల్‌ దుకాణాలు ఉన్నట్టు అంచనా. ఇందులో లైసెన్స్‌ లేకుండా నడిచే దుకాణాలు మరో 50 వరకు ఉండొచ్చని అనధికార సమాచారం. ముఖ్యంగా కర్నూల్‌ నగరంలోని మెజారిటీ మందుల దుకాణాల్లో ఫార్మసిస్టుల జాడ లేదు. ఇక్కడ పనిచేసిన వారే నిర్వాహకుల అవతారమెత్తుతున్నారు. ఫార్మసిస్టుల ధ్రువీకరణ పత్రాలు లీజుకు తీసుకుని ఏడాదికి కొంత మొత్తం చెల్లిస్తూ పబ్బం గడిపేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement