Sunday, November 24, 2024

Exclusive – ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బ‌స్సు ఎప్పుడో?

ఆర్టీసీలో స‌మ‌స్య‌ల తిష్ట‌
కూట‌మి సూప‌ర్ సిక్స్ లో ఉచిత బ‌స్సు కీల‌కం
ఉన్నవన్నీ డొక్కు బస్సులే
వెంటాడుతున్న డ్రైవర్ల కొర‌త‌..
అద‌నంగా కొనాల్సిన బస్సులు 2000
కావాల్సిన డ్రైవర్లు 3500 మంది
నెలకు రూ.250 కోట్లు భారం
ఆర్టీసీ అధికారుల‌తో నేడు సీఎం సమీక్ష
స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు
డ్రైవ‌ర్ల నియామ‌కం, బ‌స్సుల కొనుగోళ్ల‌పై ఫోక‌స్‌
అమ‌లుకు ముహూర్తి ఫిక్స్ చేసే చాన్స్
ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మ‌హిళ‌లు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం స్కీమ్ స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నారు. అదే బాట‌లో ఏపీలోని కూట‌మి సైతం మహిళశక్తి పేరిట ఉచిత బ‌స్సును క‌ల్పిస్తామ‌ని సూప‌ర్ సిక్స్ లో జోడించింది. ఆ పార్టీకి భారీ విజ‌యం వ‌రించింది.. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. అమ‌లు విష‌యంలో కొన్ని స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఎట్టి వరిస్థితిలోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమ‌లు చేసేందుకు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు. బస్సులు, డ్రైవర్ల కొరత పై ఏపీ స‌ర్కార్ ఫోక‌స్ పెట్టింది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు.

- Advertisement -

ముందు డ్రైవర్ల నియామకం, బస్సుల కొనుగోళ్లుపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్టీసీపై ప‌డే అద‌న‌పు భారంపై కూడా దృష్టి పెట్ట‌నున్నారు. ఎప్పటి లోపు ఉచిత ప్రయాణం చేపట్టాలి? త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోపు ప్రారంభిస్తారా? లేక త్వరలోనే డిక్లేర్ చేస్తారా? అనే అంశాలు ప్రస్తుతం ప్రశ్నర్థకంగా మారాయి. మరో వైపు ఏపీలో మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లోనే కీలక తెలంగాణ, కర్ణాటకలో మహిళల ముఖాల్లో ఆనందాన్ని.. ఓటు బ్యాంకును కైవశం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాల బాటలో మహిళశక్తి పేరిట… ఏపీలోనూ అతివలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వరాన్ని ప్రసాదించిన కూటమి ప్రభుత్వం తన సూపర్ సిక్స్ లోని ప్రధాన అంశంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎట్టి వరిస్థితిలోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పని సరి చేయటానికి ఇప్పటికే అనేక కసరత్తులు జరుపుతున్నారు. బస్సులు, డ్రైవర్ల కొరత ప్రధాన బారికేడ్లుగా సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ స్థితిలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ముందు డ్రైవర్ల నియామకం, బస్సుల కొనుగోళ్లు చేపట్టాలి. ఇందుకు ఆర్థిక భారం యథాతథం. మరో వైపు ఏపీలో మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వీరందరిని సంతృప్త పర్చటం ఎలా? ఎప్పటి లోపు ఉచిత ప్రయాణం చేపట్టాలి? అనే అంశంపై సీఎం చర్చిస్తారు. అంటే ఈ ఏడాదిలోపు ప్రారంభిస్తారా? లేక త్వరలోనే డిక్లేర్ చేస్తారా? అనే అంశాలు ప్రస్తుతం ప్రశ్నర్థకంగా మారాయి.

ఆర్టీసీ నివేదిక సిద్ధం..
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కమిటీ నివేదిక సిద్ధమైంది. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దాని అనుగుణంగా అదనంగా బస్సులు కొనాని సూచించింది. డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అన్నీ సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని లేకపోతే చాలీచాలని బస్సులతో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఎలా అనే విషయాలపై అధ్యయనం చేశారు.

ఏపీఎస్‌ ఆర్టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇందులో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాలి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, హైదరాబాద్‌ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు.

ఇక ఏపీ పరిస్థితి… ?
రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో పాటు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు జీరో టికెట్‌ జారీ చేస్తున్నారని, ఆ టికెట్‌పై ఛార్జీ సున్నా అనే ఉన్నా, టికెట్లిచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది. మహిళలకు జారీ చేసిన సున్నా టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి, రీయింబర్స్‌ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. తెలంగాణ, కర్ణాటకల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 70 శాతం ఉండగా, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాక 95 శాతానికి చేరిందన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఓఆర్‌ 69 నుంచి 70 శాతం మధ్య ఉందని.. ఉచిత ప్రయాణం అమలైతే అది 95 శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నెలకు రూ.250 కోట్ల భారం
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఏపీలో అమలుచేస్తే, ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. టికెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, సీజనల్‌ పాస్‌లు వంటి రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రాబడి తగ్గుతుంది. ఆర్టీసీకి టికెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్లు వస్తుండగా, ఇందులో 220 కోట్ల వరకు డీజిల్‌కే ఖర్చు అవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తున్నందున రాబడిలో నెలకు సగటున 125 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే.. ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతి నెలా 25 శాతం సొమ్ము తీసుకోకుండా వదులుకోవాలి. మరో రూ. 125 కోట్ల వరకు ఆర్టీసీకే ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలి.

2000 బస్సులు కొనాలి
ఏపీ ఆర్టీసీలో 10,000ల బస్సులు ఉన్నాయి. వీటిలో సొంత బస్సులు 8,220 కాగా మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1480 కొత్త బస్సులు కొనగా వీటిలో ప్రతి నెలా కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతున్నాయి.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు లేక, పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు.

ఏ విధానం అమలు చేయాలో..?
ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జీరో టికెట్ విధానంపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఏ విధానం అమలుకు అవకాశం ఉంటుందో ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోనూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డీనరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తుండగా కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? లేదా ఉమ్మడి జిల్లాల పరిధిలో అనుమతిస్తారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో మాదిరిగా రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణానికి అవకాశం ఉంటుందా? అనేది క్యాబినెట్ సమావేశంలో చర్చ ప్రధానంగా చర్చ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement