రెండు జాతీయ పార్టీలకు మహిళా అధినేతలు
రాజకీయ వారసులుగా అలుపెరుగని పోరాటం
అటు ఎన్టీఆర్ తనయ.. ఇటు వైఎస్సార్ బిడ్డ
వారి నాన్నలిద్దరూ ప్రజల గుండెల్లో భద్రం
రాజకీయాల్లో తిరుగులేని ముఖ్యమంత్రులు ముద్ర
వారి వారసులుగా రాజకీయ రణరంగంలోకి అతివలు
ఒకరు కమల దండులో.. మరొకరు కాంగ్రెస్ సైన్యంలో
చరిత్ర సృష్టించేందుకు సన్నద్ధం
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలే గీటురాయి
ఏపీ రాజకీయాల్లో అధినాయకులుగా చరిత్ర సృష్టించిన ఇద్దరు మహానేతల కుమార్తెలకు రాజకీయ వారసత్వం లభించింది. వీరిద్దరూ తండ్రిని మించిన కూతుళ్లుగా చరిత్ర సృష్టించనున్నారు. రాజకీయ సాధికారితను సాధించిన మహిళ నాయకులుగా జనం గుండెల్లో నిలచిపోనున్నారు. రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల్లో సత్తా చాటనున్నారు. ఇద్దరు ఆడబిడ్డలను చేరదీసి.. బృహత్తర రాజకీయ సమరంలో మహిళాసేనానులుగా రంగంలోకి దించిన ఏ జాతీయ పార్టీ విజయ కంకణం అందుకుంటుందో? త్వరలో జరగనున్న ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే..
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్ష పదవిని 2023 జూన్‌లో దగ్గుబాటి పురందేశ్వరి స్వీకరించింది. అప్పటి వరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరికి నాయకత్వ బాధ్యతలను ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది. బాధ్యతలు స్వీకరించినంతనే పార్టీలో కేడర్‌ని పురందేశ్వరీ ఆకట్టుకున్నారు. వైసీపీపై తిరుగులేని యుద్ధాన్ని ప్రకటించారు. మట్టి మాఫియా, మద్యం మాఫియాపై చెలరేగిపోయారు. సమాధానం ఇవ్వలేని అనేక ప్రశ్నలను వైసీపీపై సంధించారు. వైన్ షాప్‌లకు వ్యతిరేక ఆందోళనలతో బీజేపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. ఏపీలో బీజేపీ బలానికి పునాదులను పటిష్టపరిచే యత్నాల్లో ఎక్కడా తగ్గటం లేదు. బీజేపీ పునర్వైభవానికి తన వంతు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన చరిత్ర నందమూరి తారక రామారావుది. అలాంటి మహా నేత తనయ పురంధేశ్వరి రాజకీయ రంగంలోనూ దీటుగా రాణిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కీలక పదవుల బాధ్యతలు నిర్వహించి.. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆరితేరారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనూ చక్రం తిప్పుతున్నారు.
వైఎస్సార్ బిడ్డ.. కాంగ్రెస్ బాణం
ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌లో తెలుగు దేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించిన కీలక నేత వైఎస్సార్ కూతురు షర్మిల. అనూహ్య రీతిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు..పదేళ్లుగా జీవశ్చవ స్థితిలో.. ఆంధ్రులకు దూరమైన కాంగ్రెస్ పగ్గాలను షర్మిలకు ఆ పార్టీ అధిష్టానం అప్పగించింది. మళ్లీ ఏపీలో పునర్జీవనం పొందాలన్నది పార్టీ ఆశ. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శ్రమించిన వైఎస్సార్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని గౌరవం. ఏపీలో తమ మనుగడకు మళ్లీ ఊపిరి పోయాలంటే.. ఆయన తనయకే ఆ శక్తి, సామర్థ్యం ఉందని నమ్మిన పార్టీ .. షర్మిలను తమ గూటిలో చేర్చుకుంది. ఫలితంగా వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీనం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మేధోమథనంతో.. 15న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీంతో 16న పార్టీ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు చేపట్టారు.
రాజకీయ రంగంలో ఇద్దరూ ఇద్దరే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన ఇద్దరు మాజీ సీఎంల కూతుళ్లు రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. 1983 వరకూ ఉమ్మడి ఏపీలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు అడ్డుకట్ట వేశారు. పెత్తందారుల రాజకీయ చరిత్రకు చరమగీతం పాడారు. కొంగ్రొత్త రాజకీయ వారసులను సృష్టించారు. మహిళలకూ పెద్ద పీట వేశారు. జాతీయ రాజకీయాల్లోనూ తెలుగు జాతి ఆత్మగౌరవం చాటారు. అలాంటి నాయకుడి పుత్రిక పురందేశ్వరీ ఇప్పుడు జాతీయ పార్టీలో తన చరిత్రను లిఖిస్తున్నారు.
కాంగ్రెస్‌కు చుక్కానిగా వైఎస్సార్..
ఇక 1994 తరువాత ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నీరుగారి పోయింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కలేదు. ఇలాంటి స్థితిలో తన సుధీర్ఘ పాదయాత్రతో జనంలోకి వెళ్లి, జనంతో మమేకమై, 2004లో కాంగ్రెస్ పార్టీకి దివంగత వైఎస్సార్ అధికార పీఠాన్ని అప్పగించారు. 2009లోనూ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ నేతృత్వంలోనే అధికారంలోకి వచ్చింది. ఆయన హఠాత్ మరణం.. ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. మళ్లీ జీవం పోసుకోవటానికి ఈ ఎన్నికల్లో కనీసం 15 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంతో పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశను నెరవేర్చేందుకు షర్మిల కృషి చేయనున్నట్టు స్పష్టం అవుతోంది.