ఏపీ, తెలంగాణలో అభిమానులు, టీడీపీ నేతల పుష్పాంజలి
హైదరాబాద్లో కుటుంబ ఆధిపత్యపోరు బహిర్గతం
జూనియర్ ఫ్లెక్సీల ఏర్పాటుపై బాలకృష్ణ ఆగ్రహావేశం
గుడివాడలో హైటెన్షన్ ఇటు కొడాలి నాని వర్గం
అటు టీడీపీ తముళ్ల గోల గోల
అడుగడుగునా పోలీసుల మొహరింపు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ / విజయవాడ ప్రతినిధి – తెలుగునాట నవ రాజకీయాలకు పునాది వేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్థంతి వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులు బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంజలి ఘటించి నివాళి అర్పించారు. ఇక ఏపీలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం నాయకులు నివాళి అర్పించారు. అభిమానులు సైతం విగ్రహాల చెంతకు చేరి పుష్పాంజలి ఘటించారు.
కుటుంబలో వైరుధ్యాలు..
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కుటుంబంలోని అంతర్గత వైరుధ్యాలు గురువారం బట్టబయలయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎన్టీఆర్ అందించిన రాజకీయ అక్షరాలతో.. ఎదిగిన నేతలే.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని పెను రాజకీయ క్రీడగా మార్చాయంటే అతిశయోక్తి కాదు.. తెలంగాణాలో ఎన్టీఆర్ ఘాట్ లో.. ఏపీ గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ఇటు కుటుంబ సభ్యులు, అటు టీడీపీనేతలు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఢీ అంటే ఢీ అన్నారు. ఇక కృష్ణాజిల్లా గుడివాడలో ఇరువర్గాలు నువ్వా…నేనా అనే రీతిలో చెలరేగిపోయాయి.
కాబోయే సీఎం అంటూ జూనియర్‌కు నినాదాలు..
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా . గురువారం వేకువ జామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పించారు. దివంగత ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులకు అక్కడకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా, కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా స్పందించలేదు. అప్పటికే ఘాట్ వద్ద భారీ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకుచేరుకున్నారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించటంతో బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫెక్సీలు తొలగించాలని ఆదేశించారు. బాలకృష్ణ వెళ్లగానే ఈ ప్లెక్సీలను తొలగించారు.
గుడివాడలో ఉద్రిక్తం
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ, -జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు.. టీడీపీ, -జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ వెనిగండ్ల రాము, సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చి.. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ -జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఆ వైఖరిని నిరసిస్తూ వెనిగండ్ల రాము రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని తేల్చిచెప్పారు. ఎన్నికల కోసం కొడాలి నాని పన్నే కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ”ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనే తిట్టిన కొడాలి నానికి ఆయన పేరు తలచే అర్హత కూడా లేదు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం పాకులాడే వ్యక్తిగా నాని మారారు. గుడివాడలో వైసీపీ పనైపోయింది. సాయంత్రం నిర్వహించే ‘రా.. కదలి రా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించడం తగదు. ఈ ప్రభుత్వం మరో రెండు నెలలు మాత్రమే ఉంటుందని గుర్తించి పోలీసులు పనిచేయాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా సభను విజయవంతం చేసి తీరుతాం” అని వెనిగండ్ల రాము చెప్పారు. అనంతరం టీడీపీ -జనసేన నేతలు బారికేడ్లను తోసుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లారు. ర్యాలీగా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికినివాళులర్పించారు.
లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ బలి: కొడాలి నాని తీవ్ర స్వరం
టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అంటూ వ్యాఖ్యానించారు. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరని తేల్చి చెప్పారు.. . జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరని అంటూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్లే ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?” అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు..
పేదల సంక్షేమం కోసం శ్రమించారు: ఎమ్మెల్యే బాల కృష్ణ
పేదల సంక్షేమం కోసం దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. వీరిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.
సంక్షేమ పాలనకు ఆద్యుడు : టీడీపీ అధినేత చంద్రబాబు
దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని టీడీపీ అధినేత చంద్రబాబుట్వీట్ చేశారు. “ఒకే ఒక జీవితం… రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు, తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది… తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. .బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతున్న ఈ వేళ… తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలి. అందుకే ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా… కదలిరా!’ అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా… నేను ‘రా… కదలిరా!’ అని పిలుపునిచ్చాను. తెలుగు ప్రజలరా! రండి… ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం. ఎన్టీఆర్ కు అసలైన నివాళి అర్పించుదాం. అని చంద్రబాబు పిలుపునిచ్చారు.