Tuesday, November 19, 2024

Exclusive – మహా చింత సంహారం – తూముకుంటలో రక్కసం

రాజకీయ కక్షలకు నేలకొరిగిన భారీ వృక్షం
ట్రాఫిక్​ పేరిట చింత చెట్ల నరికివేత
పారిశ్రామికవాడలో ఇదేమి రక్కసం
పర్యావరణ ప్రియుల ఆగ్రహం

ఆంధ్రప్రభ స్మార్ట్, హిందూపురం: ఏ పిట్ట విడిచిందో… ఏ కాకి వదిలేసిందో.. గాలికి చెదిరి తూముకుంట గ్రామానికి ఎలా చేరిందో..భూమిపై పడిన ఈ చింత గింజ అంకురించింది. ఆకులు తొడిగింది. వగరు చిగురు పంచింది. శాఖోపశాఖలతో విస్తరించింది. టన్నుల కొద్దీ చింతపండుని ప్రసాదించింది. వందేళ్లు మనిషితో కాలం గడిపింది. రోజులు మారాయి. కాలినడక పోయింది. పారిశ్రామిక వాడగా ఈ ఊరు అవతరించింది. ఫ్యాక్టరీలు వెలిశాయి. జనం రాకపోకలే కాదు.. వాహనాల పొగ దుమ్మురేపినా.. సైరన్ మోత మోగినా, ఈ చెట్టు చెక్కుచెదరలేదు. బెంగళూరు రోడ్డు పక్కనే దీటుగా నిలబడింది. మరి ఏ పోయే కాలం ఎవరికి వచ్చిందో.. అకస్మాత్తుగా అధికార పార్టీ నేతల హుకూంతో ఈ మహా వృక్ష సంహారం జరిగింది. ఇందుకు కారణం.. ఒకరి రాజకీయ కక్షకు నేల కూలిన నోరులేని ఈ వృక్ష విలాపాన్ని జీర్ణించుకోలేని పర్యావరణ ప్రియులు బోరున విలపించిన సన్నివేశం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని తూముకుంట చెక్ పోస్టులో చోటు చేసుకుంది.

కరవు రక్కసితో తల్లడిల్లిపోతున్న తరుణంలో జీవనోపాధితో పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని.. హిందూపురంలో ఓ పారిశ్రామికవాడ కు పునాది వేసిన ఆనాటి సీఎం నందమూరి తారకరామారావు కల నేడు ఓ పీడ కలగా మారుతోంది. ఆయన వేసిన పునాదిలోనే పర్యావరణ సంహారంతో కాలుష్య రక్కసి తాండవం చేస్తోంది. పరిశ్రమల పొగగొట్టాల నుంచి వెదజల్లే కర్బనాలను పీల్చుకుని ప్రాణవాయువును అందించే మొక్కలనే ధ్వంసం చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ వంకతో వందల ఏళ్లనాటి చింత చెట్లను నరికి పోగులు పెట్టారు. ఇలా ఒకటి కాదు.. ఏకంగా చింత వనాన్నే మట్టుబెట్టిన వైనం తూముకుంట పారిశ్రామిక వాడలో వెలుగు చూసింది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయ వైషమ్యం, అధికారుల అక్రమార్జన అత్యాశే నని పర్యాటక ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.

కాలుష్యం పీడించినా… వీడని జనం
హిందూపురం రూరల్ మండలం తూముకుంట. ప్రస్తుతం ఈ గ్రామం పారిశ్రామిక వాడగా అవతరించింది. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి పొట్టచేత పట్టుకుని పనుల కోసం జనం పొరుగు రాష్ట్రాలకు వలస పోయేవారు. ఇక్కడ 300 ఫ్యాక్టరీలు ఏర్పాటు కావడంతో ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. కానీ కాలుష్యం పెరిగింది. అంతే అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయి. గొల్లాపురం గ్రామస్తులు ఇప్పటికీ తమను కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు. ఆ గ్రామస్తులు కాలుష్యాన్ని తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో మార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. కానీ జీవనోపాధి కోసం వేలాది మంది ఈ పారిశ్రామిక వాడపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇటువంటి ప్రాంతంలో చెట్లు పెంచి ఇంకా కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరాన్ని అధికారులు విస్మరించారు.

- Advertisement -

నిర్ధాక్షిణ్యంగా వన సంహారం

ఇక తూముకుంట గ్రామంలో దాదాపు 5 వేల మంది జీవనం సాగిస్తున్నారు. హిందూపురం నుంచి బెంగళూరు రోడ్డులో తూముకుంట చెక్ పోస్ట్ గా ఈ గ్రామం ఆవిర్భవించింది. ఈ రోడ్డులో తరచూ వేలాది వాహనాల రాకపోకలతో కాస్త రద్దీగా కనిపిస్తుంది. తూముకుంట చెక్ పోస్ట్ లో డబుల్ రోడ్డుగా విస్తరించింది. దీని కారణంగా ఆర్ అండ్ బీ రోడ్డు మార్జిన్ లో దుకాణాలు వెలిశాయి. కొన్ని కుటుంబాలు బతుకు వెళ్లదీస్తున్నాయి. ఏమైందో.. అకస్మాత్తుగా ఆర్ అండ్ బీ అధికారుల మదిలో హైడ్రా వెల్లి వెరిసింది. రోడ్డు మార్జిన్​లో ఆక్రమణలను తొలగించారు. శభాష్ అనుకుంటున్న తరుణంలో.. రోడ్డుపక్కనే వందల ఏళ్లనాటి చింత చెట్టును నిర్దాక్షిణ్యంగా తెగ నరికారు. ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండా దాదాపు 10 చింత చెట్లను నేల కూల్చటంపై జనంలో అనుమానాలు పెరిగాయి. రాజకీయ కక్షలతో దుకాణాలను తొలగిస్తే.. రోడ్డుకు అడ్డు వంకతో చెట్లను ధ్వంసం చేయటానికి అక్రమార్జనే కారణమని పర్యావరణ అభిమానులు ఆరోపిస్తున్నారు . ఈ చెక్ పోస్టు ప్రాంతంలో పాగా వేయటానికి కొందరు నాయకులు ఈ తంతంగాన్ని రచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బడ్డీ కొట్ల స్థానంలో కొత్త స్టాల్స్ కు పునాదులు వేశారని, ట్రాఫిక్ రద్దీ పేరిట ఎమ్మెల్యే బాలయ్యను ఏమార్చారని జనం చెప్పుకుంటున్నారు.

నయా హైడ్రా వెనుక అసలు కథ?

తూము కుంట రాజకీయ ఆధిపత్యానికి ఓ వేదిక. ఇప్పటి వరకూ వైసీపీ నేతల కనుసన్నల్లో ఉన్న ఈ గ్రామం.. కొత్తగా అధికార పార్టీ జమానా ప్రారంభమైంది. తూముకుంట చెక్ పోస్టుపై రాజకీయ పడగ విప్పింది. ఇక్కడి రోడ్డు పక్కన దుఖాణాల తొలగింపే ప్రధాన లక్ష్యంగా రాజకీయ వ్యూహం తెరమీదకు వచ్చింది. చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడి ఆక్రమణలను తొలగించాలనే అజెండాను తెరమీదకు తీసుకువచ్చారు. ఇంకేముంది ఆర్ అండ్ బీ అధికారులు తలూపారు. బడ్డీలను తొలగించారు. పనిలో పనిగా అక్కడ ఉన్న భారీ వృక్షాలను కూల్చివేశారు. సుమారు వందేళ్ల చింత చెట్టును నేలమట్టం చేశారు. కేవలం ట్రాఫిక్ రద్దీ పేరిట అధికారులను స్థానిక నాయకులు తప్పుదోవ పట్టించారని తూముకుంట ప్రజలు వాపోతున్నారు.

ఇంత అన్యాయమా? .. పర్యావరణ కార్యకర్త

తూముకుంట గ్రామంలో చెట్ల కూల్చివేత ఘటనపై పర్యావరణ సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పర్యావరణ సామాజిక కార్యకర్త భాస్కర్ రెడ్డి ఘటన స్థలికి వెళ్లి.. తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆర్ అండ్ బీ జేఈఈ చెట్లను నరికి సొమ్ము చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే పారిశ్రామిక వాడలోని కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతుంటే, కాపాడాల్సిన బాధ్యత వీడి చెట్లను నరికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన వాపోయారు. దాదాపు 10 చింత చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారని, ఎటువంటి యాక్షన్ ప్లాన్, ముందస్తు సమాచారం లేకుండా ఆర్ అండ్ బీ అధికారులు ఈ వృక్షాలను చంపేశారని భాస్కర రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement