Tuesday, November 19, 2024

Exclusive – ఏపీలో త్రీ ఫేస్ ప‌వ‌ర్ పాలిటిక్స్‌


వైసీపీ వైనాట్ స్లోగన్
ఉమ్మడి బలమే కూటమికి దిక్కు
కింగ్ మేకర్​గా కాంగిరేస్
నవరత్నాలే జగన్ ఆయుధం
ప్రభుత్వ వ్యతిరేకతపై ఎన్డీఏ కూట‌మి గంపెడాశలు
పాత తరం వ్యూహంతో చక్రం తిప్పుతున్న ష‌ర్మిల‌
కొత్త వ్యూహాలు ర‌చిస్తున్న రాజ‌కీయ చాణ‌క్యుడు చంద్ర‌బాబు
యువ‌తీ, యువ‌కులు.. మ‌ధ్య త‌రం వారిలో ప‌వ‌న్ జోష్‌
మండువేస‌విలో మ‌రింత హీట్ పుట్టిస్తున్న ఏపీ రాజ‌కీయాలు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో వైసీపీ సింగిల్ సింహం పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది. 25 లోక్‌స‌భ‌, 175 అసెంబ్లీ స్థా నాల్లో పోటీ చేస్తోంది. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టింది. సామాజిక వర్గ సమీకరణను పరిశీలిస్తే 29 మంది ఎస్సీలు, ఏడుగురు ఎస్టీ, 48 మంది బీసీలకు సీట్లు కేటాయించింది. 19 మంది మహిళలు, ఏడుగురు మైనార్టీలకు సీట్లు ఇచ్చింది. వైనాట్ 175 నినాదంతో రంగంలోకి దిగిన వైసీపీకి నవరత్నాలే బలం. సామాన్యులే స్టార్‌లు. 2014 ఎన్నికల్లో 1,28,40,033 (44.60 శాతం) ఓట్లతో 67స్థానాలను కైవశం చేసుకుంది. ప్రత్యర్థి టీడీపీ 44.90 శాతం ఓట్లతో 102 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. కేవలం 0.30 శాతం ఓట్ల తరుగుతో టీడీపీ అధికారాన్ని అందుకోలేక పోయింది. ఇక 2019 ఎన్నికల్లో ఒక్కచాన్స్ నినాదంతో 1,56,88,569 ( 49.95 శాతం) ఓట్లతో 151 స్థానాల్లో గెలిచింది. అధికారాన్ని అందుకుంది. అయిదేళ్ల పాలనలో నవరత్నాలతో ప్రజలను ఆకట్టుకుంది. ఏకంగా ₹2,70,000 కోట్లు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిష‌ర్ ట్రాన్స్‌ఫ‌ర్‌)లో అందజేసింది. ఒక రకంగా మహిళలు, రైతుల్ని వశం చేసుకునే యత్నం చేసింది. నిజమే ఈ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ ఫలాలు చేజారినట్టే అనే భావనను వైసీపీ సృష్టించింది. అందుకే ధీమాగా ఒంటరి పోరుకు దిగింది.

- Advertisement -

గెలవాల్సిందే.. కూటమి ధ్యేయం

ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా బరిలోకి దిగాయి. 144 ఎమ్మెల్యే, 17 లోక్‌స‌భ‌ స్థానాల్లో టీడీపీ, 10 ఎమ్మెల్యే, 6 లోక్‌స‌భ స్థానాల్లో బీజేపీ, 21 ఎమ్మెల్యే, 2 లోక్‌స‌భ‌ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాల్సిందేనని కూటమి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. 2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జత కలిసింది. జనసేన ఎలాంటి ప్రయోజనం కోరకుండా ఈ కూటమికి మద్దతు పలికింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి 1,35,48,599 (47.10 శాతం) ఓట్లతో 106 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్నాయి. ఇందులో బీజేపీకి వచ్చిన ఓట్లు 6,32,599 (2.20 శాతం) ఓట్లతో నాలుగు స్థానాల్లో గెలిచింది. ఇక 2019 ఎన్నికలను పరిశీలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేశాయి. తమ సొంత బలాన్ని పరీక్షించుకున్నాయి. ఫలితంగా టీడీపీకి 1,23,04.668 (39.17 శాతం) ఓట్లతో 23 స్థానాలకు పడిపోయింది. ఏకంగా 79 స్థానాల్లో ఓడిపోయింది. ఇక ఉభయ కమ్యూనిస్టులు , బీఎస్పీతో కలిసి పోటీ చేస్తే జనసేనకు 17,36,811 (5.53 శాతం) ఓట్లు రాగా.. కేవలం ఒక స్థానంలో గెలిచింది. సహచర పార్టీల జాడే లేదు. బీజేపీ 173 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 2,63,849 (0.84 శాతం) ఓట్లు రాగా.. అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ బలాన్ని గమనిస్తే 45.04 శాతం ఓట్లు లభించాయి. అంటే కేవలం 4.91 శాతం తేడాతో ఈ కూటమి అధికారాన్ని కోల్పోయినట్టు అంచనా. ఎందుకంటే అవి విడివిడిగా పోటీ చేయటంతోనే ఈ స్థితి.

మనుగడే కాంగ్రెస్ లక్ష్యం

జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాథంతో ఏపీలో ఉనికినే కోల్పోయింది. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీ గుర్తించలేదు. రాష్టం విభజిస్తే తెలంగాణలో సీట్లు ఖాయమనే ఊరింతతో ఏపీ విభజనకు తలూపింది. అంతే.. 2014 ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తే 8,02,452 (2.80 శాతం) ఓట్లు రా గా.. ఒక్క సీటునూ గెలవలేదు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. దొరికినోళ్లకు దొరికినట్టు సీట్లు ఇచ్చి 174 స్థానాల్లో పోటీ చేస్తే 3,68,810 (1.17 శాతం) ఓట్లు వచ్చాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంపశయ్య మీద ఎక్కింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనంతో ఏపీలో కాంగ్రెస్ వర్గాల్లో ఆశలు పెరిగాయి. ఇప్పటికే వైసీపీలో తమకు ప్రాధాన్యం దక్కటం లేదనే వ్యథలో ఉన్న పాత కాంగ్రెస్ వర్గాలు.. షర్మిల రాకతో తిరిగి పాత గూటికి క్యూకట్టారు. అధికారంలోకి ఎలాగూ రాలేం. కానీ తమ పార్టీ ఉనికిని కాపాడితే.. భవిష్యత్తులో తెలంగాణ, కర్నాటకలో మాదిరిగా ఏపీలోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని పాత తరం నేత‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కింగ్ ఎవ‌రు? కింగ్ మేకర్లు ఎవరు?

58 నెలలుగా నవరత్నాలు వెదజల్లి జనాన్ని మచ్చిక చేసుకున్న తరుణంలో తిరిగి అధికారాన్ని అందుకుంటుమని వైసీపీ ఆశిస్తోంది. కానీ.. ఇదే తరుణంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీరని అసంతృప్తి పెరిగింది. సహజంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకోవటం ఖాయం. 2014లో రాష్ట్ర విభజనను తట్టుకోలేక.. ఉద్యోగులు, ఉపాధ్యాయు టీడీపీకి మద్దతు పలికారు. ఇప్పుడూ ఇదే స్థితి నెలకొంటుందని టీడీపీ ఆశపడుతోంది. సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. టీచర్లూ అదే ఫీలింగ్ లో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అని ఊరించి.. ఎన్నికల సమయంలో డీఎస్సీ ప్రకటనతో ఆగ్రహంగా ఉన్నారు. ఈ స్థితిలో టీడీపీ, జనసేన, బీజేపీ బలంలో మార్పు ఉండదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో తమ కూటమికి మరో నాలుగు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని కూటమి అంచనా. అధికారం కోసం వైసీపీ, ఎన్డీయే నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ కావటం తథ్యం అని ఎన్డీఏ కూటమి అంచనా వేస్తోంది. ఎందుకంటే.. 2019లో 1.14 శాతం బలం కాస్త ఈ ఎన్నికల్లో కనీసం ఐదు శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితిలోనూ ఎన్డీఏ కూటమికి పడవు. ఇప్పటి వరకూ నమ్మిన వైసీపీలో తమకు ప్రాధాన్యం లేకపోవటంతో షర్మిల వెంటే నడుస్తున్నారు. ఫలితంగా వైసీపీ సొంత బలం 49.95 శాతంలో ఏ మాత్రం చీలిక వచ్చిందో… ఫ్యాన్ రెక్కలు విరిగినట్టే. ఇదీ రాజకీయ పరిశీలకుల అంచనా. ఇదే జరిగితే షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ గా అవతరించినా ఆశ్చర్య పోనక్కరలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement