ఇదే అదును అంటున్న పార్టీ శ్రేణులు
ఆరేళ్లుగా పట్టించుకోని టీడీపీ అధినేత
కార్యకర్తల వినతులకు స్పందన
పునర్నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ
పూర్వవైభవం తెస్తాన్నంటున్న బాబు
ఆ దిశగా అడుగులు
నాయకుల చేరికలకు కసరత్తు
తెలంగాణపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంతవరకు ఊహాగానాలు వచ్చినా బాబు నోట ఈ విషయం బయటపడలేదు. విభజన చట్టంపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయన తన వైఖరి స్పష్టంచేశారు. కార్యకర్తల వినతులకు స్పందించి, తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని ప్రకటించారు. తమకు ఇక్కడ కార్యకర్తలు ఉన్నారని, నాయకులు మాత్రమే లేరని అన్నారు. పార్టీని నడింపించే నాయకత్వం కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిథి – ఏపీలో నాలుగోసారి సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు తొలిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఘన స్వాగతం లభించింది. పసుపు జెండాలు రెపరెపలాడాయి. విభజన చట్టంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కూడా మంచి వాతావరణంలో జరిగింది. ఎన్టీఆర్ ట్రస్టు భవనం వద్దకు వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు చేపట్టాలని చంద్రబాబును కార్యకర్తలు కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం తీసుకు వస్తానని, అలాగే పార్టీ పునర్నిర్మాణం చేస్తానని ప్రకటించారు. ఇక.. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం పెరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీపై చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోక్‌శ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో తెలంగాణపై ఫోకస్ పెట్టడానికి సమయం చాలకపోవచ్చు. కానీ, ఇక్కడ ఫోకస్ పెట్టకపోతే తెలంగాణ మళ్లీ చేజారే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో డీలా పడింది ఇలా..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ శాసనసభలో 14 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఏకకాలంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకుంది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాలకు టీడీపీ పడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2015నుంచి 2022 వరకు తెలంగాణ టీడీపీకి ఎల్.రమణ, నరసింహులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయదని చంద్రబాబు ప్రకటించడంతో కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి నాయకుడు లేని పార్టీగా టీడీపీ మారిపోయింది.
వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ తొలి శాసనసభ (2014)లో అడుగుపెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలుగా.. మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం), మాగంటి గోపీనాథ్ ( జూబ్లీహిల్స్), ఎనుముల రేవంత్ రెడ్డి (కొడంగల్, ప్రస్తుత తెలంగాణ సీఎం), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి) ర్యాగ కృష్ణయ్య (లాల్ బహదూర్ నగర్) తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం) ,ఎస్ రాజేందర్ రెడ్డి (నారాయణపేట), ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి), చల్లా ధర్మారెడ్డి (పరకాల), కె.పి. వివేకానంద్ (కుత్బుల్లాపూర్ ) టి. ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్ ) తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్ ), జి సాయన్న (సికింద్రాబాద్ కంటోన్మెంట్), ఆరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి ) ఉన్నారు.. అయితే.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో టీడీపీ డీలా పడింది. దీంతో వీరంతా వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇందులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి ఎం. నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరాంతా ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో లేరు. ఇతర పార్టీల్లో సెటిల్ అయ్యారు.
నాయకుల రిక్రూట్మెంట్
తెలంగాణలో టీడీపీ పునర్నిర్మించాలంటే పటిష్టవంతమైన నాయకత్వమే కీలకమని అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియనది కాదు. ఇక్కడ ఓటమి చవి చూసిన బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలస కడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి వలసలు వచ్చే అవకాశాలు లేవు. అందుకే చంద్రబాబు మాట్లాడుతూ పార్టీకి నాయకత్వంలోపం ఉందని, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. అంటే.. టీడీపీలో ఉన్న వారికి నాయకత్వం బాధ్యత అప్పగించేలా చర్యలు తీసుకుంటారని పలువురు కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో సమర్థ నాయకులు లేకపోతే ఇతర పార్టీల్లో పదవులు ఆశించి భంగపడే నేతలను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.