Thursday, December 12, 2024

Exclusive – మేఘాల‌లో తేలిపోదాం! అందాల అర‌కు పిలుస్తోంది

పచ్చంద‌నాల‌ వలెసపూల పడతి సోయగం
కొంటె చూపులతో క‌వ్వించే కటికి జలధార
అదృశ్య అమరశిల్పి బొర్రాగుహల కళాతోరణం
పాదాక్రాంత పాల కడలి కెరటంలో సంబురాలు
మేఘాల కొండలో చిందేసేలా థింసా నృత్యాలు
గాలికొండ నుంచి లోయలోకి తొంగిచేస్తే ఆ మ‌జానే వేరు
చక్కటి చిక్కటి వేడి వేడి అర‌కు కాఫీ సిప్పులు
చాపరాయిలో జలవిహారం.. అదో థ్రిల్లింగ్‌
బొంగులో చికెన్.. ఇక్క‌డిదే ఫేమ‌ప్‌..
ఒంపుసొంపుల‌ అరకు సుందరిని హగ్ చేద్దామా?
చ‌లో చ‌లో అంటూ త‌ర‌లివ‌స్తున్న కుర్ర‌కారు

ఆంధ్రప్రభ స్మార్ట్, అరకు రూరల్ – అల్లూరి సీతారామరాజు జిల్లా మణిహారం ప్రముఖ పర్యాటక కేంద్రం ఆంధ్రా ఊటీ అరకు వ్యాలీలో పర్యాటకం సందడి చేస్తోంది. ఈ వ్యాలీ అద్భుత అంద చందాలను తనివితీరా ఆస్వాదించేదుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రేమికులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ సీజన్లో కనులకు కనువిందు చేసే వలిసె పూల తోటల సొగసులు, వేకువ జామునే మైమరపించే దట్టమైన మంచు సోయగాలు.. ప్రకృతి రమణీయ సుందర అపురూప దృశ్యాలతో ఆకట్టుకుని ఆనంద భరితులను చేసే సుంకరమెట్ట కాపీ తోటల సౌందర్యాలు.. గాలికొండ వ్యూ పాయింట్ నుంచి లోయల సుందర దృశ్యమాలికలు సిద్ధమవుతున్నాయి. ఘాట్ రోడ్డులో బొంగులో చికెన్ ఘుమ ఘుమలాడుతోంది. పలకరింపులకు చిట్టిపొట్టి మిరియాల తోటలు దోబూచులాట ప్రారంభమైంది. కార్తీక మాసం ముగిసినా.. సంక్రాంతి సంబురాల హోరు .. శివరాత్రి జాగారం వరకు అరకు లోయలో పర్యాటక జనజాతర జరుగుతుంది. అరకులోయలో ఇక ఉరుకులు పరుగులే .. మరి ఇక్కడ అద్భుతాలేంటీ? అక్కడకు చేరటం ఎలా? అరకు అందచందాలను కనులారా వీక్షించి.. అపురూప జ్ఞపకాలతో ఇంటికి చేరటం ఎలా? అరకులోయకు చేరాలంటే రోడ్డు, రైలు మార్గం కాకుండా ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి.

- Advertisement -

విశాఖలో బస్సెక్కి.. ఆ త‌ర్వాత రైలెక్కి..

సాగరతీరం విశాఖపట్టణం నుంచి 112 కిలోమీటర్ల దూరం అరకులోయ ఉంది. విశాఖ బస్ స్టేషన్ లో ఉదయం అయిదు గంటల నుంచి డీలక్స్, పల్లె వెలుగు బస్సులు హారన్ మోగుతుంది. గంట గంటకూ ఓ బస్పు ప్లాట్ఫారం మీద ప్రత్యక్షమవుతుంది. ఇక రైలు మార్గంలో ప్రయాణం మహాద్భుతం. వాల్తేరు రైల్వే స్టేషన్ (విశాఖపట్టణం రైల్వే స్టేషన్ ) లో ఉదయం 6.50 గంటలకు కిరండోల్ ప్యాసింజర్ ఉంటుంది.ఈ రైలులో ప్రయాణించే పర్యాటకుల్ని బొర్రా గుహలు స్వాగతం పలుకుతాయి. అక్కడ నుంచి సమీప దూరంలోని బొర్రా గృహాలు, గోస్తనీ నదీ ప్రాంతంలోని కమనీయ రమణీయ దృశ్యాలను తిలకించి మైమరిచిపోక తప్పదు. ఒకప్పుడు బొర్రా గృహాలకు చేరాలంటే పర్యాటక జనం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం రోజులు మారాయి. అరచేతిలో అన్ని సదుపాయాలు పలకరిస్తున్నాయి, రైలు సదుపాయం సరే. రోడ్డు మార్గంలో బస్సులు, కార్లు, జీపులు, ఆటోలు, బైకుల్లో బొర్రా గృహాలకు చేరిపోవచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా వెలసిన ఈ అద్భుత అందాలతో బొర్రా గృహాలు పర్యాటకులను మారో మరో ప్రపంచానికి తీసుకువెళ్తుంది. నిటారు కొండలు.. కళ్లుతిరిగే లోయల నుంచి గలగల జలజల పారే ప్రవాహం.. అద్భుత శిలల సౌందర్యం బొర్రా గృహాల సొంతం. అద్భుత అదృశ్య శిల్పి చెక్కాడేమో ? అన్నట్టు ఈ స్వయం సహజ సిద్ధ అద్భుత అలంకరణలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి

కొంటె చూపుల కటికి జలధార

బొర్రా గుహలకు ఆరు కిలోమీటర్ల దూరంలోని కటికి జలపాతం అత్యంత అద్భుత సందర్శనీయ ప్రాంతం. తలెత్తి చూస్తేగానీ కనిపించని కొండ శిఖరం నుంచి గలగల జాలువారే ఈ కటికి జలపాతం సుందర దృశ్యమాలిక అనిర్వచనీయం. చల్లని చిరుగాలి.. నీటి తుంపరల జల్లుల్లో జలకాలాట అద్భుతం. అమోఘం. ఇక ఘాట్ రోడ్డలోకి రాగానే సుంకరమెట్ట కాఫీతోటలు సిగ్గుమొగ్గలేస్తాయి. అంతే ఘాట్ రోడ్ లో కాపీ స్టాల్స్ పలకరిస్తాయి. వేడివేడి చిక్కటి కాఫీ రుచితో ఔరా.. ఇందుకేనా కమ్మటి అరకు కాఫీ అని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పొగుడ్తోంది. అని పర్యాటకులు సంబరపడిపోతారు. గర్వంగా ఫీల్ అవుతారు. ఆ తరువాత అరకు ఘాట్ రోడ్ లో గాలికొండ వ్యూ పాయింట్ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ నుంచి బాక్సైట్ కొండల్ని తిలకించి మురిసి పోవచ్చు. వందల అడుగుల లోయలు మలుపులు తిరిగే రైల్వే ట్రాక్ దృశ్యాలను చూసి ఆశ్చర్యపడాల్సిందే. ఎందుకంటే.. ఈ రైలు ట్రాక్ పనులు ఎలా జరిగాయి?. ఎంత మంది పని చేశారు?. ఈ పనిలో కూలీలు ఎంతమంది చనిపోయారు.? వామ్మో వాళ్లు సామాన్యులు కాదు అనుకుని బుగ్గలు నొక్కుకోవాల్సిందే. ఇది సరే లోయ కొండల నడుమ గిరిజన గ్రామాలూ పలకరిస్తాయి.

కాళ్లకింద పాల కడలి… కళ్లల్లో మెరిసే క్షీర సాగర హేళి

ఇక అరకు లోయకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని మాడగడ మేఘాలకొండ అపురూప దృశ్యాలు పర్యాటకుల మదిని దోచేస్తుంది. వేకువజామునే భానోదయ అద్భుత కిరణాలు.. పాలకడలిని తలపించే మంచు పరవళ్లు .. ఒక్కసారిగా మేఘాలే తాకింది హైహైలెస్స, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా, ఈ గాలి రేపింది నాలో నిష, చేలరేగాలి రమ్మంది హల్లో అంటు ఒళ్లోవాలే అందాల ఈ అప్సరస మేఘాలే తాకింది హైహైలెస్స అని పల్లవి అందుకుని థింసా స్టెప్పును దంచక తప్పదు. ఆకాశంలో కనిపించే మబ్బులు తమ పాదాలను తాకాయని పర్యాటకులు సంబురం చేస్తారు. అంతే కాదు అరకు గిరిజనం సాంప్రదాయ దుస్తులను ధరించి థింసా నృత్యాలో చెలరేగిపోతారు. గిరిజనంతో తమ ఆనందానుభూతిని పంచుకొంటారు. మళ్లీ వస్తాం అంటూ టాటా వీడ్కోలు అంటూ బై బై చెబుతారు.. మాడగడ మేఘాల కొండను చేరటానికి రెండు దారులు ఉన్నాయి. అరకులోయ ప్రధాన రహదారిలో బోస్ బేడ గ్రామం నుంచి నేరుగా మేఘాల కొండకు వెళ్ళవచ్చు ఇది అయిదు కిలోమీటర్ల మార్గంలోని ఉంది. ఇక అరకులోయ పట్టణంలో బస చేసే పర్యాటకులు కొత్తవలస.. చొంపై బస్కి రహదారి మార్గంలో కూడా మేఘాలకొండకు చేరవచ్చు. ఇక్కడ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే పాల సముద్రం పలకరిస్తుంది. మాడగడ పాలసముద్రం అద్భుత అపురూప అందాలను తిలకించాలంటే వేకువ జామున అయిదు గంటలకు మేఘాల కొండకు చేరుకోవాలి.

ఎన్నెన్నో అందాలు.. హద్దే లేని ఆనందం

ఇక అరకు సుందరిని కనులారా చూస్తే చాలు ఎన్నెన్నో అందాలు .. ఏవేవో రాగాలు వేసే పూల బాణం.. కూసే గాలి గంధం,, పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం.. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు పాట పాడేస్తారు. ఈ లోయలో కనువిందు చేసే చూడచక్కని ప్రాంతాలకు కొదువ లేదు. గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే మ్యూజియం, ఎన్నో అద్భుత వనమూలికలు, ఔషధ మొక్కలు, పురాతన ప్రసిద్ధి గాంచిన వన వృక్షాలు, పుష్పజాతుల సమాహారాన్ని తిలకించి పులకరించాలంటే పద్మాపురం ఉద్యానవన కేంద్రానికి వెళ్లాల్సిందే. అరకులోయ పట్టణ కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పద్మాపురం పలకరిస్తుంది. ఈ గార్డెన్ నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోని రణ జల్లాడ జలపాతం, 14 కిలోమీటర్ల దూరంలోని చాపరాయి జలవిహారిలో ఈ అందాలను వీక్షించాలంటే అద్భుత రాదారి అందుబాటులో ఉంది. అరకు లోయ .. పాడేరు ప్రధాన రహదారిలో ఈ చాపరాయి జలపాతం అద్భుత సుందర కావ్యం. ఇక్కడి అందాల దృశ్యాలను తిలకించడమే కాదు.. బొంగులో చికెన్ ఘుమ ఘుమ జిహ్వలూరిస్తుంది. బ్యాంబో చికెన్ స్టాల్స్ కిటకటలాడుతుంటాయి. ఇక ఎందుకు ఆలస్యం అరకు లోయలో విహరించి.. అద్భుత అరకు అందాలరాశిని పలకరించి..మధురానుభూతితో రండి వెళ్లొద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement