Sunday, November 17, 2024

Exclusive – అందాల రాక్షసి! వ‌న్నె చిన్నెల‌ విష‌పు మొక్క‌

జనం ప్రాణాలతో చెలగాటం
డెవిల్ ట్రీ అంటే సుగంధం
అదే జనాల‌ ఊపిరికి కళ్లెం
ఈ చెట్లను తొలగించాల్సిందే
డిప్యూటీ సీఎం పవన్​ ఆదేశాలు
అయినా కదలని అధికార గణం
ప్రజల్లో అవగాహన పెంచాలి
ఈ చెట్లు ఎంత అనర్థమో తెలియ‌జేయాలి
పర్యావరణ హితుడు డాక్టర్ యారాడ కృష్ణమూర్తి

ఆంధ్రప్రభ స్మార్ట్, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) – ఇప్పటి వరకూ ప్రాణం నిలిపే చెట్లను చూశాం. ఇళ్లల్లో పెంచుతున్నాం. కానీ మన ఊళ్లోనే.. మన పక్కనే తన అంద చందాలతో మాటు వేసిన డెవిల్ ట్రీని గమనించలేదు. కనీసం తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ అరుదైన జాతి వృక్షం శ్రీకాకుళం ఏరియాలో జనంతో పరిహాసం ఆడుతోంది. ప్రతి గ్రామంలోనూ ఈ ఏడాకుల చెట్టు దర్శనం ఇస్తుంది. చీకటి పడితే చక్కటి సువాసనతో పిలుస్తుంది. ఆదమరచి వాసన పీలిస్తే .. తలనొప్పి మొదలవుతుంది. ఊపిరి సన్నగిల్లుతుంది. మరి ఇంత హాని కర వృక్షాలను ఈ జనం ఎలా భరిస్తున్నారంటే.. అసలు విషయం తెలియకే. ఇది పచ్చని పొలాల్లో మకాం వేసిన విష వృక్షమని గ్రహించక పోవటమే.

అసలీ ఏడాకుల చెట్టు సంగతేంటీ?

ఏడాకుల చెట్టు ఇది, భారత దేశంలోనే సొగసు తీరిన సతతహరిత వృక్షం. దక్షిణ భారతంలో విస్తరించిన ఈ మొక్క శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపల్లెలోనూ కనిపిస్తుంది. శాస్త్రీయ నామం ఆల్ స్టోనియా స్కాలరీస్. ఎడిన్ బర్గ్ కు చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ సి. ఆల్ స్టో న్ (1685-..1760) జ్ఞాపకార్ధం ఈ వృక్షానికి ఈ పేరు పెట్టారు. ఈ జాతి పేరు స్కాలరీస్. స్కాలరీస్ అంటే పండితుడు. అప్పట్లో బడికి వెళ్లే చిన్నారులకు చెక్క ఈ చెట్టు కలపను ఉపయోగించారు. ఆంగ్లంలో దీనిని ముద్దుగా డెవిల్ ట్రీ అని పిలుస్తారు. డెవిల్ ట్రీ అనగా దయ్యం చెట్టు. ఈ చెట్లపై దయ్యాలు ఉంటాయని పుకార్లతో ఈ చెట్టుకు దయ్యం చెట్టుగా ప్రాచుర్యం పొందింది. అక్టోబరులో ఈ చెట్టు చిన్న చిన్న పచ్చటి ఆకులతో తెల్లటి సువాసన పూలు పూస్తాయి. ఈ చెట్టు ఎంత అందమైందో.. అంతటి విషపూరితమైంది. ఈ పొడవైన సొగసైన వృక్షం కఠినమైన బూడిద రంగు బెరడును కలిగి ఉంటుంది.

- Advertisement -

ఈ చెట్టు కొమ్మలు వలయంగా,, అలాగే ఆకులు ఒకే చోట అనేకం కనిపిస్తాయి. ఈ ఆకులు గుండ్రంగా, మందంగా ముదురు ఆకుపచ్చగా ఒక్కొక్క గుచ్ఛానికి 4 నుంచి 7 ఉంటాయి, దాదాపుగా ఒక్కొక్కొక గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి, అందుకే ఈ చెట్టును ఏడాకుల చెట్టు అని, హిందీలో సప్తపర్ణి అని పిలుస్తారు. ఈ చెట్టు చెక్క చాలా మృదువైంది. ఈ చెక్కను సాధారణంగా ప్యాకింగ్ బాక్సుల, స్యూళ్లల్లో బ్లాక్ బోర్డుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడును డీటా బార్క్ అంటారు, ఈ బెరడును అతిసారం, జ్వరం చికిత్సకు సంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు. దయ్యం చెట్టుగా పేరు పొందిన ఈ చెట్టు కింద కూర్చునేందుకు లేదా సేదతీరేందుకు పశ్చిమ కనుమల్లోని గిరిజనులు అసలు ఇష్టపడరు. ఇక ఈ చెట్టును రెండవ జైన తీర్థంకార అజిత్ నాథ్ పూజించారు. సప్తపర్ణి అనే పేరుతో గౌరవం ఇచ్చారు. ఇది సరే..

ఈ చెట్టు ఎంత సొగసో .. అంత ప్రాణహాని

ఈ చెట్టు బెరడును అతిసార, జర్వం రుగ్మతలకు నాటు వైద్యంలో వినియోగిస్తారు. కానీ ఈ చెట్టు అనుణవణువూ విష పూరితమే. పూలను వాసన చూస్తే ఊపిరి ఆగిపోతుంది. ఉబ్బసం ఉన్న రోగులు చనిపోతారు. ఇక చర్మవ్యాధి గ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బ్రిటీషర్లు ఈ చెట్లపై ఎక్కువ మక్కువ చూపించేవారు. ఇక ఈ చెట్టుతో మరణం సంభవిస్తే .. దెయ్యాల పీడనతో చనిపోయినట్టు ప్రజలను నమ్మటంతో.. ఈ చెట్లతో అసలు హాని బయటపడలేదు. ఏ పల్లెలో చూసిన పట్టణాల్లో చూసిన తెల్లని పువ్వులతో సుగంధం వెదజల్లుతూ ప్రజల మనసును దోస్తున్న ఈ అందాల రాక్షసి( డెవిల్ ట్రీ) జనం ప్రాణాలను తీసేస్తోంది. ఇక ఈ చెట్లు చైనా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలో ఎక్కువగా ఉంటాయి. వీటిని ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో నిషేధించారు. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో జనం ఇబ్పంది పడటాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఏడాకుల చెట్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారుల్లో ఎటువంటి చలనం రాలేదు.

ఆ చెట్లను మనమే తొలగిద్దాం: డాక్టర్ యారాడ కృష్ణమూర్తి

ఈ అందాల రాక్షసిని తొలగించకపోతే ఆరోగ్యపరంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి హెచ్చరించారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా స్థానికులే ఈ డెవిల్ ట్రీస్ ను తొలగించి వాటి స్థానంలో మరో మొక్కను నాటాలి, ఆ మొక్కను ఆరోగ్యకరంగా పెంచాలని డాక్టర్ కృష్ణమూర్తి సూచించారు. విదేశాల్లో ఈ డెవిల్ ట్రీస్ ని పూర్తిగా నిషేధించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. సామాజిక బాధ్యతతో ఈ చెట్లను తొలగించాలి లేకుంటే ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రామ పట్టణ పొలిమేరలో మొక్కల నాటి అది ఆరోగ్యవంతంగా పెరిగేటట్లు చర్యలు చేపట్టాలని ముఖ్యంగా గ్రామస్థాయి అధికారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వీలైనంత తొందరగా అందాల రాక్షసిగా కనిపించే ఈ ఏడాకుల చెట్లను తొలగించే ఏర్పాట్లు ప్రజా ప్రతినిధులు అధికారులు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement