Thursday, November 21, 2024

Exclusive – ఎగ్జిట్ పోల్స్‌ ఎగ్జైట్‌మెంట్‌ – అంద‌రిలోనూ అదే ఉత్కంఠ‌

ప్రతిసారి తార్ మార్ ..త‌క్కడ్‌ మార్
ఇదంతా అధినేతలకు ముందే తెలుసా
ఎవరి మీడియా ముచ్చ‌ట్లు వారివే
ఏపీలో తొండి.. జగడాలన్నీ ఇందుకేనా
ఇప్పటికే ప్ర‌చారంలో ఫేక్ ఎగ్జిట్ పోల్స్
సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్‌
గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు చెప్పేదేంటి
అప్ప‌ట్లో అంచ‌నాలన్నీ తారుమారు
ఎగ్జిట్ పోల్స్‌కి విశ్వ‌స‌నీయ‌త ఎంత‌?

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ: ఎగ్జిట్ పోల్ ఏం చెబుతుంది.. అంద‌రిలోనూ ఇదే ఎగ్జైట్‌మెంట్‌. ఇంకా మూడు రోజుల్లో అస‌లు రిజ‌ల్టు రానుంది. కానీ, ఈ లోపే ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఫేక్ ప్రచారం జ‌ర‌గ‌నుంది. ఇందులో మీడియా సంస్థలు పూనకాలతో చెలరేగిపోయేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పోస్ట్ పోల్ పేరుతో యూ టూబర్స్ లక్షలకు లక్షల వ్యూస్ కొల్లగొట్టేశారు. టీఆర్పీ కోసం శాటిలైట్ చానల్స్ కర్చీఫ్ వేశాయి. మోదీ హ‌వా ఏంటో తెలియ‌జేసేందుకు జాతీయ మీడియా సంస్థ‌లు రెడీ అయితే.. వాటి కథలు వినేందుకు ఎన్డీఏ, ఇండియా కూటమి చెవులు రిక్కించాయి. ఇక‌.. ఏపీలో జగన్ మోదం.. ఖేదం వినేందుకు ఏపీలో కూటమి దిగ్గజ్జాలు ఉవ్వీళ్లూరుతున్నాయి. అటు ఢిల్లీలో, ఇటు ఏపీ గల్లీలో నాయకులకు ఎగ్జిట్ పోల్స్ సమాచారం తెలీదా? ఇప్పటికే సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీల పేటీఎం బ్యాచ్‌లు ఎగ్జిట్ పోల్స్‌ని ఊదర గొట్టేశాయి… మే 14వ తేదీన‌ ఆయా రాజకీయ పార్టీల అధినేతలకు పంచాంగ శ్రవణం చేశాయి. ఏపార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంద‌నే విష‌యంలో ఇప్ప‌టికే ఓ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే.. అప్పుడే తొండి జగడాలు తెరమీదకు వచ్చాయ‌నే వాద‌న‌లున్నాయి. ఓట్లను మురగబెట్టే వ్యూహం గొడవకు దారితీసిందన్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఎగ్జిట్ పోల్ కాస్త‌.. ఎగ్జాక్ట్‌ పోల్‌కు అద్దం పడుతుందా? తార్ మార్ తక్కడ మార్ అవుతుందా? అనేది తెలియ‌డానికి వెయిట్ చేయాల్సిందే..

- Advertisement -

నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓట్ల లెక్కింపు యజ్ఞానికి ముందే ఈ రోజు సాయంత్రం 6:30తర్వాత ఎగ్జిట్ పోల్స్ పలకరించనున్నాయి. ఇక.. ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్‌ పోల్స్ మధ్య వ్యత్యాసం ఏంటీ? ఎగ్జిట్ పోల్స్ క‌చ్చితత్వం ఎంత? గత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్.. వాస్తవానికి అద్దం పట్టాయా? తారుమారు అవుతాయా ? ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో నిజమెంత? 2019, 2014ఎన్నికల్లో రియల్ పోల్స్ ఫలితాలను ఒకసారి ప‌రిశీలిస్తే అస‌లు విష‌యాలు తేట‌తెల్లం అవుతాయి.

పెరిగిన పోలింగ్ ప‌ర్సంటేజీ..

ఈ సారి 2019లో జ‌రిగిన దానికంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో.. 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయమై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇండియా టుడే-యాక్సిస్, సీఎన్ఎన్ న్యూస్ 18, – ఐపీఎస్ఓఎస్, టైమ్స్ నౌ – వీఎంఆర్, రిపబ్లిక్ – జన్ కీ బాత్, రిపబ్లిక్ -సీఓటర్, న్యూస్ ఎక్స్ – నేత, టుడేస్ చాణక్య పేరిట సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్ అని ఎదురుదాడి కూడా జరుగుతోంది.

ఎగ్జిట్ పోల్స్… ఎగ్జాక్ట్‌ పోల్స్…

గత ఎన్నికల్లో ఎన్నికల ఫలితాల జాతకాలను చెప్పే చిలక జోస్యం చెప్పే ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు ఎన్డీయే గెలుపును అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ సఫలమయ్యాయి. అలాగే 2014లో ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి గెలుస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2019లో వైసీపీ విజయం సాధిస్తుందన్న దాంట్లో వాస్త‌వం ఉంది. కానీ, సీట్ల లెక్కల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. 2014ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 8 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 283 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 105 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి. అయితే అప్పుడు మోడీ వేవ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి.

అంచ‌నాల‌న్నీ తారుమారు..

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఎన్డీయే 336 స్థానాలతో విజయకేతనం ఎగురవేయగా, యూపీఏ కేవలం 60 స్థానాలతో సరిపెట్టుకొంది. 2014లో ఎన్డీయే కూటమిలోని బీజేపీ 282 స్థానాలను, యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి.2019లో 13 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి 306 సీట్లను సాధిస్తుందని, యూపీఏ కూటమి స్థానాలను సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఇక్కడ కూడా ఎన్డీయే పనితీరుపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయి. మొత్తం 353 సీట్లు ఎన్డీయే గెలుచుకోగా, యూపీఏకు 93 స్థానాలు వచ్చాయి. ఇక ఎన్డీయే కూటమిలోని బీజేపీ 2019లో 303 స్థానాలను, కూటమిలోని కాంగ్రెస్‌, 2019లో 52 సీట్లను గెలుచుకున్నాయి.

ఏపీలోనూ అదే తీరు..

ఎన్డీటీవీ హంస సర్వేలో వైసీపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని, టీడీపికి 75 నుంచి 95 సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. లోక్‌సభలో టీడీపీకి 13, వైసీపీకి 12 స్థానాలు వస్తాయని పేర్కొంది.మహా న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లోటీడీపీ-బీజేపీ కూటమికి 129, వైసీపీకి 42 సీట్లు వస్తాయని పేర్కొంది. లోక్‌సభలో టీడీపీకి 18, బీజేపీకి 3, వైసీపీకి 4 స్థానాలు వస్తాయని తెలిపింది . 2014 ఎన్నికల ఫలితాల్లో లగడపాటి, మహా న్యూస్ సర్వే అంచనాలు దాదాపు నిజమయ్యాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 107 సీట్లు, వైసీపీకి 66 సీట్లు లభించాయి. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ ..-బీజేపీలకు 16, వైఎస్సార్ సీపీకి 9 స్థానాలు దక్కాయి.

= 2019 ఎన్నికల్లో …ఇండియా టుడే, టైమ్స్ నౌ, సీపీఎస్, ఆరా, కేకే సూర్య, మిషన్ చాణుక్య, ఐ పల్స్.. సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్లో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ ఈ అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఏకంగా 151 సీట్లల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఇవే సంస్థలు.. అదనంగా, సీఎన్ ఎన్, ఎక్స్ నేత సంస్థలు కూడా జతకలిశాయి. వైసీపీకి 153 నుంచి 158 వరకూ సీట్లు వస్తాయని సోషల్ మీడియాలో దంచికొట్టాయి.

ఇక్కడే అసలు డౌటనుమానాలు

అయితే… వైనాట్ 175లో 1 తీస్తే.. మిగలేది 75 . అంటే ఏ పార్టీకి 175 రావు. అంతే కాదు.. 151 రావు. 153 కుదరదు. ఏ పార్టీ గెలిచినా.. 110.. 65… లేదా 120… 55 ఇదీ సంఖ్య. ఎందుకంటే..55 శాతం అక్కా చెల్లెమ్మలు, 60 శాతం అవ్వాతాతలు తమ బిడ్డ జగనయ్యకు ఓటేస్తే..66 శాతం మగ మందుబాబులు సైకిల్ ఎక్కి గ్లాజు గ్లాసులో గుటకేశారు. ఇక పనిపాటలేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో అద్దె కొంపల్లో అల్లాడిన నిరుద్యోగుల్లో ,,, 40 శాతం మంది ఊళ్లో అమ్మ కొంగులో నవరత్నాలకు ఓటు వేస్తే.. మిగిలినోళ్లందరూ నిరుద్యోగభృతికి ఒక్క చాన్స్ ఇచ్చారు. ఇక మిగిలింది ఉద్యోగులే. ఈ అయిదేళ్లు.. తాము అనుభవించిన వ్యథకు శిక్ష వేస్తున్నారు. 4.44 లక్షల ఉద్యోగుల ఓట్లల్లో మెజారిటీ ఓట్లే .. కీలకం కానున్నాయి. ఈ తీర్పుపైనే.. అధికార పక్షం ఆందోళనతో అల్లాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement