Friday, November 22, 2024

Exclusive – పురుడు కోసం పుట్టినింటికి – మా ఊరి చుట్టాలు!

(శ్రీ సత్యసాయి బ్యూరో, ప్రభన్యూస్): ముచ్చట గొలిపే వన్నెలు, మిరుమిట్లు పంచె అందాలతో హొయలు పోయే సైబీరియన్ కొంగలు శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు సమీపంలోని.. వీరాపురంలో నెల రోజులుగా విడిది కోసం వ‌చ్చి సందడి చేస్తున్నాయి. తెలుపు, నలుపు, ఎరుపు త్రివర్ణాలతో అందంగా ఉండే సైబీరియన్ పక్షులు (కొంగలు) ఏటా తమ గ్రామానికి వచ్చే విదేశీ అతిథులుగా వీరాపురం గ్రామస్తులు భావిస్తుంటారు.

వంశాంకురానికే ఈ విడిది..

సహజంగా గుడ్లు పెట్టే సమయానికి ఈ గ్రామానికి వందల సంఖ్యలో వచ్చే బహుదూరపు బాటసారులైన సైబీరియన్ పక్షులు ఇక్కడ చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని, గుడ్లు పెట్టి పొదగడంతో పాటు పిల్లలు పెద్దవై స్వతహాగా ఎగిరే దశకు చేరుకోగానే స్వస్థలాలకు ఎగిరిపోవడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి సైబీరియన్ కొంగలు ఏటా ఇక్కడికి వస్తూ చెట్ల పైన ఉన్న పాతగూళ్ల‌ను తొలగించి కొత్తగా గూళ్లు కట్టుకోవడం విశేషం. సాధారణంగా కోడి పొదిగిన విధంగానే కొంగలు కూడా 21 రోజులు పాటు గుడ్లపై పొదిగి పిల్లల్ని నిద్ర లేపుతాయి. ఈ కొంగలు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఆహారం సేకరిస్తాయి.. ప్రధానంగా చెరువులు, రిజర్వాయర్ల ప్రాంతాలకు వెళ్లి చేపలను వేటాడుతుంటాయి. ఒక క్రమ పద్ధతిలో కొంగలు తమ జీవన విధానాన్ని అవలంబించడం గమనార్హం.

వీరాపురంలోనే సంరక్షణ…

ఎక్కడ సైబీరియా.. ఎక్కడ వీరాపురం.. వేల కిలోమీటర్లు దూరం. ఎందులోనూ పొంతన లేదు. కానీ, ఈ రెండు ప్రాంతాలను ఓ పక్షి జాతి కలిపింది. అతిథిగా వచ్చి ఇక్కడి ప్రజల మనసులను గెలుసుకుంది. అంతేగాక ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అందుకే ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఇక్కడ విహంగా అతిథులు చేసే సందడి అంతా ఇంతా కాదు. హిందూపురం నియోజకవర్గం పరిధిలోని చిలమత్తూరు మండలం వీరాపురం, ఓ కుగ్రామం.. జనాభా పట్టుమని పది వందలు కూడా ఉండదు. కేవలం ఒక పక్షి జాతి కారణంగా వీరాపురం ప్రపంచ చరిత్రలో చోటు దక్కించుకుంది. అందుకే ఈ వీరాపురం సంరక్షణ కేంద్రంగా మారింది. కొంగలకు ఏమాత్రం హాని తలపెట్టిన జరిమానాలు, శిక్షలు సైతం అమలుకు వెనుకాడరు.

- Advertisement -

ప్రేమంటే ఇదే…

సైబీరియన్ పక్షులను తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వేసవికి ముందే అతిథులుగా విచ్చేసే ఈ పక్షులను సైబీరియన్ కొంగలు అంటారు. వీటిని చూస్తే రైతులు, గ్రామస్తుల సంతోషం అంతా ఎంత కాదు. జీవిత భాగస్వామి విషయంలో ఈ పక్షుల గురించి ఒక గొప్ప విషయం తెలిసింది. సాధారణంగా పావురాలు తమ జీవిత కాలంలో ఒక పావురంతోనే జతకడతాయని, ఈ విషయం చాలా గొప్పగా మనం భావిస్తాం. కానీ ఈ సైబీరియన్ కొంగలు పావురాలు కంటే గొప్ప ప్రేమ కలవని తెలిసింది. సైబీరియన్ పక్షుల జంటలలో ఒక పక్షి మరణిస్తే సహా పక్షి సైతం ప్రాణ త్యాగం చేస్తుందని తెలిసింది. లేదంటే తన సహచరి పక్షిపై ప్రేమతో కొంగ ఒంటి కాలి పైనే నిలబడి ఉంటుంది. సహజంగా కొంగ వంటి కాళ్లు పై నిలబడితే ఎక్కువకాలం ప్రాణంతో ఉండక చనిపోవడం జరుగుతుంది. ఇలా ఏటా వేసవిలో విహాంగా వచ్చే సైబీరియా పక్షుల్లో ఇంతటి త్యాగ గుణం ఉందంటే పెద్ద విశేషమే కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement