Thursday, November 21, 2024

Exclusive – భూకంపం కాదు.. బేకార్ ప‌నితో రోడ్డుకు గ్ర‌హ‌ణం

కాంట్రాక్ట‌ర్ లాలూచీకి రోడ్డు డ్యామేజీ
దివిసీమ గుండె బ‌ద్ద‌లైంది..
అలా రోడ్డు వేశారు.. ఇలా ప‌గిలిపోయింది
కోట్లాది రూపాయల ఖర్చు..
ఆరు నెలల శ్ర‌మంతా వృథా
ఆదమరిచి వెళ్తే పుణ్య లోకాలకే
ఇది కేవలం నేతల ఓట్లాట
కాంట్రాక్టర్‌కు కాసులాట
అధికారుల ఆమ్యామ్యాల వేట
జననానికి నరకపు బాట

ఆంధ్రప్రభ స్మార్ట్, ఘంటసాల: దివిసీమలో భూకంపం వచ్చింది… ఇది నిజమేనండి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రహదారిపగిలిపోయింది. ఆదమరిచి ప్రయాణం సాగిస్తే అనంత లోకాలకు పోవాల్సిందే.. ఈ రహదారి గురించి తెలియక ‘చీకటి’లో సాదాసీదాగా వచ్చినా.. వేగంగా పరుగులు తీసినా.. బొక్కబోర్లా పడాల్సిందే. కాళ్లు చేతులు విరగాల్సిందే. ముఖం పచ్చడి కావాల్సిందే. తక్షణమే ఆసుపత్రికో, లేక స్మశానానికి చేరుకోవాల్సిందే. అదేక్కడో కాదు.. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలంలోని ఘంటసాల వయా చిట్టూర్పు వెళ్లే మధ్యలో నిర్మించిన తారు రోడ్డు జనానికి ప్రాణసంకటంగా మారింది.

రూ .2 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో..

ఘంటసాల నుంచి జోడుగూడెం మీదుగా చిట్టూర్పు వెళ్లే తారు రోడ్డుకు, సీసీ రహదారికి కలపి రూ.2 కోట్ల వ్యయంతో గత వైసీపీ ప్రభుత్వంలో ఆరు నెలల కిందటే నిర్మించారు. సీసీ రహదారి నిర్మాణం బాగానే చేపట్టినప్పటికీ గుండేరు మురుగు కాలువను అనుకుని ఉండే ఈ రహదారికి రివిట్మెంట్ చేపట్టకుండా అధికారులు హడావిడిగా సుమారు 800 మీటర్ల పొడవునా తారురోడ్డు నిర్మాణం చేపట్టేశారు. గుండేరు కట్టను అనుకుని ఉన్న ఈ రహదారిలో అనేకసార్లు రహదారి కుంగిందని అధికారులకు తెలిసినప్పటికీ రివిట్మెంట్ చేయకుండా నిర్లక్ష్య ధోరణితో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ రహదారి మూణ్ణాళ్ల ముచ్చటగా తయారైంది. ప్రధానంగా ఒక ప్రాంతంలో రహదారి మొత్తం కుంగిపోయి భూకంపం వచ్చిన మాదిరిగా తయారయింది. లక్షలు ఖర్చుపెట్టి కుంగిపోయే రోడ్డును నిర్మించారని ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అదేకాకుండా ఒక 100 మీటర్ల రహదారి నిర్మాణం చేపట్టకపోవటంతో అది బురదకయ్యగా మారి ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

నాలుగు ప్రాంతాల్లో కుంగిన రోడ్డు

ఘంటసాల నుంచి జోడుగూడెం వెళ్లే రహదారి ఒక ప్రాంతంలో ఇప్పటికే భారీగా కుంగిపోయి రహదారి కోతకు గురైంది. మరో రెండు చోట్ల కోతకు సిద్ధంగా ఉంది. నూతనంగా నిర్మించిన సీసీ రహదారి అనుకునే మూలమలుపులో సైతం రహదారి చిన్న చిన్నగా కోతకు సిద్ధమవుతుంది. రోడ్డు వేశామని బిల్లులు చేసుకుని చేతులు దులుపుకుంటున్న కాంట్రాక్టర్ ఈ రహదారి వైపు చూస్తే ప్రజలు పడే బాధలు ఏమిటో అర్థమవుతాయని ప్రజలు వాపోతున్నారు. ప్రజా సమస్యలు తీర్చాల్సిన అధికారులు అదే సమస్యను మళ్లీ మొదటికి తీసుకొచ్చి మరిత జఠిలం చేయటం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement