Thursday, December 19, 2024

Exclusive – ఆపరేషన్ రెడ్​! ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్‌ చర్యలు సక్సెస్​

ఏపీలో భారీగా ఎర్రచందనం నిల్వలు
సర్కారుకు ఇక మీదట సిరులు పంట
గ్లోబల్​ వేలానికి ప్రభుత్వం అడుగులు
గోదాముల్లో భద్రంగా ఉన్న ఎర్ర దుంగలు
రకాలు, గ్రేడ్లుగా విభిజించిన సిబ్బంది
చైనా, జపాన్​, జర్మనీ దేశాలకు ఎగుమతి
త్వరలోనే వెయ్యి టన్నులకు టెండర్లు
పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​:

శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనానికి దేశ విదేశాల్లో భారీగా డిమాండ్‌ ఉంది. స్మగ్లర్లు మాత్రం దొంగచాటుగా అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం అధికారిక విక్రయాల ద్వారా అంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి గతంలోని టీడీపీ ప్రభుత్వం 2014లో పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో కేంద్రీయ ఎర్రచందనం గోడౌన్లను నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను ఇక్కడికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి, ఇక్కడ గోడౌన్లలో భద్రపరిచింది.

- Advertisement -

గ్లోబల్​ టెండర్లకు ఆహ్వానం..

ఎర్రచందనానికి భారీగా డిమాండ్‌ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్‌ చేయించింది. గ్లోబల్‌ టెండర్లను నిర్వహించింది. 2018 సెప్టెంబరులో అత్యధికంగా 5 వేల టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైఎస్సార్సీపీ సర్కారు 4, 343 టన్నుల్లో 300 టన్నులు, తర్వాత మూడు సంవత్సరాల్లో మరో 450 టన్నులు మాత్రమే విక్రయించగలిగింది.

త్వరలో 1000 టన్నులకు టెండర్లు

ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న బఫర్‌ స్టాక్‌తో కలిపి 7 వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి. ఎర్రచందనం విక్రయాల్లో భాగంగా 20వ సారి గ్లోబల్‌ టెండర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో సుమారు వెయ్యి టన్నుల ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టన్నుకు 65 లక్షల నుంచి ఆపైనే..

ధర నిర్ణయించేందుకు అక్టోబరులో పీసీసీఎఫ్‌ ఆర్కే సుమన్‌ నేతృత్వంలోని కమిటీ గోడౌన్లలోని 50 లాట్లలో ఉన్న దుంగలను పరిశీలించి గ్రేడ్ల వారీగా విభజించారు. ఎర్రచందనం దుంగల రంగును నమోదు చేశారు. ఏ గ్రేడు టన్ను ధర 65 లక్షల రూపాయల నుంచి 75లక్షల రూపాయలు, బీ గ్రేడు 36 లక్షల రూపాయలు, సీ గ్రేడు 20 లక్షల రూపాయలు, ఎన్‌ గ్రేడు 7లక్షల రూపాయలు, పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు 60 వేల రూపాయలుగా ధరలు నిర్ణయించారు. ఇక ఈ ఎర్రచందనం దుంగలకు టెండర్లు నిర్వహించడమే మిగిలి ఉంది.

అంతరించిపోతున్న జాతుల జాబితాలో..

రెండు సంవత్సరాల క్రితం వరకు ఎర్రచందనం వృక్షం అంతరించిపోతున్న జాతుల జాబితా లో ఉండేది. ఈ జాబితాలో ఉన్న వృక్ష, జంతు జాతుల మనుగడను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఎర్రచందనం వ్యాపారంపై ఆంక్షలు ఉండేవి. విలువ ఆధారిత వస్తువులకు మాత్రమే ఎటువంటి ఆంక్షలు లేకుండా వ్యాపారం జరిగేది. ఎర్రచందనం దుంగల వేలంపై కూడా ఇటీవలి వరకూ చాలా ఆంక్షలుండేవి. ఇప్పుడు ఆ సమస్య లేనందున వేలం వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది.

స్మగ్లింగ్‌ను ఉపేక్షించం..

ఎర్ర చందనం అక్రమ రవాణాను ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్య‌మంత్ర ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకునేందుకు యత్నించేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్ని అరికట్టడానికి తిరుపతి రెడ్‌ శాండర్స్‌ యాంటీ టాస్క్‌ఫోర్సు చేస్తున్న కృషిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement