Friday, November 22, 2024

Exclusive గన్ను పట్టని “గబ్బర్​సింగ్” – ​దుంగల దొంగలతో ఇక అంత్యాక్షరే!

ఎల్లలు లేని సామ్రాజ్యంలా ఎర్ర సీమ
రెడ్​ కార్పెట్​ పరిచిన లోకల్​ లీడర్లు
స్మగ్లర్ల అవతారమెత్తిన ప్రజాప్రతినిధులు
పాలిటిక్స్​లో కూడా ఎర్రచందనమే ఇంధనం
చైనా, జపాన్, జర్మనీ, నేపాల్ కీలక కేంద్రాలు
ఇక్కడి నేతలకు ఇవే ఇన్​పుట్​ సెంటర్స్​
గబ్బర్ సింగ్​ని గస్తీకి పెట్టిన సీఎం చంద్రబాబు
ఏపీ సర్కారుకు ఇదే అతిపెద్ద టాస్క్​
సీరియస్​ ఫోకస్​ పెట్టిన ఉపముఖ్యమంత్రి పవన్​
ఇంటర్నేషనల్​ మాఫియాకు బ్రేక్ తప్పదా?
రెడ్​ శాండిల్​ మాఫియా ఆటలకు చెక్​ పడేనా

ఆంధ్రప్రభ స్మార్ట్, కడప బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలోనే దొరుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో టన్ను ఎర్రచందనం దుంగల ధర దాదాపు ₹కోటికి పైగా పలుకుతుండటంతో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ రోజురోజుకు శృతిమించుతోంది. రాయలసీమ ప్రాంతంలోని గల్లీ లీడర్లు మొదలు రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన నేతల కూడా స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కూలీలతో ఎర్రచందనం దొంగలను నరికించి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. సూట్‌కేసుల నిండా నోట్ల కట్టలు.. గోల్డెన్ వాచ్‌లు.. బీఎండబ్ల్యూ కార్లు.. పెద్ద పెద్ద బంగళాలు.. విలాసవంతమైన జీవితం.. పొలిటీషియన్లతో సత్సంబంధాలు.. సినీ స్టార్స్‌తో చెట్టపట్టాలు.. ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి.. ఇదీ పుష్ప వన్ సినిమా కాదు.. ఇదే ఏపీలో జరుగుతున్న వాస్తవం.. ఇదంతా నిజ జీవితం.

ఇక పుష్ప‌‌2 లోకి వెళ్తే…

- Advertisement -

ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడ తగ్గట్లే. వెనుకాడట్లే. దొరికితేనే దొంగ. లేకుంటే దొరలాగా జీవితాన్ని గడిపేస్తున్నారు. పది మందిలో ఒక్కరు మాత్రమే చిక్కుతుంటే.. 9మంది మంది దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రముఖుల పేర్లు స్మగ్లింగ్ సిండికేట్​లో ఎక్కువగా వినిపిస్తుంటాయి. వీరందరి ప్రధాన ఆర్థిక వనరులు కూడా ఎర్రచందనం స్మగ్లింగే. ఆ సొమ్ములతోనే తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు యత్నిస్తుంటారు. గతంలో జరిగిన ఎన్నో ఘటనలు ఇందుకు తార్కానంగా చెప్పవచ్చు. కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ ప్రాంతాలతో పాటు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో స్మగ్లర్ల అవతారం ఎత్తిన రాజకీయ నేతలు స్టాక్ పాయింట్లు నిర్వహిస్తున్నట్లు గతంలోనే పోలీసు అధికారులు ధ్రువీకరించారు. వీటి వెనక బడా నేతలున్నారు. అడవుల నుంచి తెచ్చిన ఎర్రచందనం దొంగలను ఇక్కడ నిల్వచేసి తర్వాత తమ పలుకుబడిని ఉపయోగించి అడ్డదారుల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. చెక్ పోస్టుల్లోని సిబ్బంది సైతం వీరికి సహకరిస్తుండటంతో కోట్ల విలువైన ఎర్రచందనం నిత్యం తరలిపోతూనే ఉంది.

ఇలలోనే.. ఇది సంపన్న సీమ గురూ

వాస్తవానికి.. రాయలసీమలోని కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలతో పాటు కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరు లక్షల హెక్టార్ల (15.6 లక్షల ఎకరాలు) లో ఎర్రచందనం అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిలో 80 శాతం ఎర్ర అడవులు, కడప, చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. చైనా, జపాన్, జర్మనీ, నేపాల్ లాంటి దేశాల్లో ఈ సంపదకు డిమాండ్ ఉండడంతో ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తూ స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. క్రమక్రమంగా ఈ స్మగ్లింగ్ పెరుగుతూ వస్తోంది. 2007 నుంచి తమిళ స్మగ్లర్లు, తమిళ కూలీలు అడవుల్లో చొరబడడంతో అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల విలువచేసే సంపదను కూలీలతో కొట్టించి వారికి టన్నుకు లక్షో, రెండు లక్షలో ఇస్తూ ఒక్కోటన్ను కోటి రూపాయలు వరకు సొమ్ము చేసుకుంటూ విదేశాలకు విక్రయిస్తున్నారు. అనామకులు సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరులు అన్నట్టుగా ఎర్ర స్మగ్లర్లు ఎదిగిపోయారు. కూలీలు కూడా టన్ను చందనం నరికిస్తే ₹2 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉండడంతో అడవుల్లోకి చొరబడడం బాగా పెరిగింది. దీంతో చిత్తూరు, కడప జిల్లాలోని శేషాచలం, పాలకొండలు, లంకమల, నల్లమల అడవుల్లో ఎర్ర దొంగలు చొరబడతూ ఇష్టారాజ్యంగా చెట్లను నరికి తరలిస్తూ ప్రభుత్వం, పోలీసులకు, అటవీశాఖలకు సవాల్ గా మారారు.

తొమ్మిదేళ్లుగా సర్కారు శ్రమ వృథా..

ఏపీ ప్రభుత్వం 2015లో పోలీసులు, అటవీశాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. తిరుపతిలో ఈ టాస్క్ ఫోర్స్‌ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ టాస్క్ ఫోర్సులో దాదాపు 400 మంది ఏపీఎస్పీ, అటవీశాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. వీటితోపాటూ స్టైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ డ్యూటీ ఫోర్స్ కూడా క్రియేట్ చేశారు. ఈ బృందాలన్నీ కలిసి అడవుల్లోకి వెళ్లి ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ ఉంటాయి. కానీ, అటవీశాఖలో సిబ్బంది కొరత తాండవిస్తోంది. సుమారు 50 శాతం మంది సిబ్బంది కొరత ఉంది. వీరిలో కూడా 45 నుంచి 50 ఏళ్లు దాటిన వారు 50 శాతం కంటే ఎక్కువ మంది ఉండడంతో స్మగ్లర్లను ఎదుర్కోవడం, కూంబింగ్ నిర్వహించడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లను పట్టుకునేందుకు అడవుల్లోకి వెళ్లినప్పుడు సరైన ఆయుధాలు అవసరం అవుతాయి, అవి కూడా అంతంత మాత్రమే ఉన్నట్లు సమాచారం. అంతే కాదు ప్రతి బీటు మూడు వేల హెక్టార్లు ఉంటుంది. ఇంత పెద్ద విస్తీర్ణానికి ఒకే ఒక బీటా ఆఫీసు ఉండడం రక్షణకు సరిపోవడం లేదు.

వయా చింతామణి… పులివెందుల..

ఎర్రచందనం స్మగ్లింగ్ రకరకాల మార్గాల్లో వెళ్తున్నా ఎక్కువ శాతం మూడు ప్రధాన మార్గాల్లో వెళ్తున్నట్లు అటవీ, పోలీసులు అధికారులు గుర్తించారు. కడప, చిత్తూరు అడవుల్లో నరికిన దుంగలను ఒక చోటికి పోగుచేసుకుని డంపు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాయచోటి- చింతామణి మీదుగా, పులివెందుల – గోరంట్ల మీదుగా కర్నాటకకు తీసుకెళ్లి ఇక్కడి నుండి పోర్టులకు తరలించి దేశం సరిహద్దులు దాటిస్తున్నారు. అదేవిధంగా కడప, నెల్లూరు, తిరుపతి మీదుగా చెన్నై ప్రాంతానికి తరలించి అక్కడి పోర్టు ద్వారా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. లంకమల, నల్లమల ప్రాంతాల్లో ఎర్రచందనాన్ని కడప, కర్నూలు మీదుగా హైదరాబాద్ తరలించి అక్కడి నుంచి వివిధ రకాల వాహనాల్లో ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా దక్షిణాది రాష్ట్రాలు దాటి ఎర్రచందనం ఇతర దేశాలకు దర్జాగా తరలిపోతోంది. ఈ స్మగ్లింగ్​లో రాయలసీమలో పేరు మోసిన బడా నేతలు మొదలు.. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ల ప్రమేయం ఉన్నట్టు స్పష్టమవుతోంది.

ప్రాణాలు పణంగా పెట్టినా..

స్మగ్లింగ్ ను నియంత్రించడంలో అటవీ, పోలీస్ శాఖ అధికారులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. 2013 డిసెంబర్‌లో కూడా స్మగ్లర్ల దాడిలో ఇద్దరు అటవీ శాఖ అధికారులైన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్, అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్‌ చనిపోయారు. కడప, చిత్తూరు జిల్లాలో విస్తరించిన శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో కూడా అనేకసార్లు ఈ స్మగ్లర్లు దాడులకు పాల్పడడం, అధికారులు చంపేయడం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. రేంజర్ స్థాయి అధికారులు చనిపోయారు. ఫిబ్రవరి 5న అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్లను అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన గణేశ్ ఘటన ఇంకా మన కళ్లు ముందు మెదడుతూనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అధికారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

చంద్రబాబు హయాంలోనూ స్మగ్లర్ల ఊచకోత..

అయితే.. 2015 ఏప్రిల్​లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 20 మందిని ప్రత్యేక పోలీసు, అటవీ సిబ్బంది సంయుక్త బృందం హతమార్చింది. మొత్తం 20 మంది తమిళనాడుకు చెందిన వారేనని అప్పటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. వీరిలో ఇద్దరు స్మగ్లర్లు కాగా, మిగిలిన అందరూ కూలీలే. కాగా.. ఎర్ర స్మగ్లర్ లపై కఠిన చర్యలు కనిపించడం లేదనే వాదనలు లేకపోలేదు. పిడి యాక్ట్ లు కూడా నమోదు కావడంలేదు. నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు కాకపోవడంతో మళ్లీ వచ్చి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. గతంలో పీడి యాక్ట్ కేసులు పెట్టేవారు. కానీ ఇటీవల పీడి యాక్ట్ నమోదు మందగించింది. అదేవిధంగా ఎర్రచందనం కేసుల్లో అధికారులు చార్జిషీట్లు వేయకపోవడం, అరెస్ట్ చేయకపోవడంతో వారు మళ్లీ అదే పనికి వస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మరింత కఠినమైన చర్యలు ఎర్రచందనం స్మగ్గర్లపై తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పవర్ స్టార్ ప్లాన్ పైనే చర్చ..
ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ బాధ్యతలు చేపట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ మేరకు అడ్డుకుంటారనేది ప్రస్తుతం చర్చినీయాంశంగా మారింది. స్మగ్లింగ్ ను ఆపేయండి.. లేకుంటే తాటతీస్తా.. అంటూ ఆయన తనదైన శైలిలో స్మగ్లర్లకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే అటవీ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే సిబ్బంది నియామకం పెంచాల్సి ఉంది. స్మగ్లర్లను అడ్డుకునేందుకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాల్సి ఉంది. టాస్క్ ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను మరింత పటిష్ట పరచాల్సి ఉంది. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎర్రచందనం స్మగ్లర్ల పై పీడీ యాక్ట్ తో పాటు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అటవీ శాఖను ప్రక్షాళన చేసి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం పవన్ కళ్యాణ్ ముందున్న తక్షణ కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement