Friday, September 13, 2024

Exclusive – ఆపరేషన్‌ నైజీరియన్‌ – డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి స్పెష‌ల్ టాస్క్‌

హైదరాబాద్‌లో య‌థేచ్ఛ‌గా డ్రగ్స్‌ దందా
విక్రయాల్లో నైజీరియన్ల‌ హస్తం
నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు
కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైన పోలీసులు
వీసా గడువు ముగిసిన వారిపై నిఘా
వారి దేశాలకు పంపించేందుకు రెడీ
ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం
సీరియ‌స్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
నార్కొటిక్‌, టీ న్యాబ్ బృందాల ఏర్పాటు

ఆంధ్రప్రభ స్మార్ట్‌, హైదరాబాద్: మహా నగరంలో డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అక్రమ దందాలో నైజీరియన్‌ల పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నారు. అంతేకాకుండా పలు నేరాలకు పాల్పడుతూన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నైజీరియన్లపై పోలీసులు నిఘా పెంచారు. వీసాల గడువు ముగిసిన వారిని తిరిగి వారి దేశాలకు పంపించాలని హైదరాబాద్‌ పోలీసులు సమాలోచనలు సాగిస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్‌ కేసుల్లో వారి పేర్లే అధికంగా వినిపిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ జాన్‌పాల్‌ అరెస్టుతో నగరంలోని నైజీరియన్ల కదలికలపై పోలీసులు ఆరా తీయడంతో పాటు వారు ఉంటున్న ప్రాంతాలలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రహస్య విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ వంటి నేరాలను అరికట్టేందుకు ఇక నుంచి నైజీరియన్‌్రపై కేసులు నమోదు చేయకుండా వారి దేశాలకు అప్పగించాలని హైదరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. అలాగే విద్యార్థి వీసా ముసుగులో హైదరాబాద్‌లో తిష్టవేసి డ్రగ్స్‌ దందా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

వీసా గడువు ముగిసినా..

హైదరాబాద్‌ నగరంలో దాదాపు 2500 మంది నైజీరియన్స్‌ ఉండగా వీరిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకొని వారి దేశాలకు పంపించడం వల్ల నేరాల సంఖ్యతగ్గే అవకాశం ఉందని పోలీసులు యోచిస్తున్నారు. ఇటీవల కాలంలో కొకైన్‌, హెరాయిన్‌, ఎండీఎంఎ పిల్స్‌, గంజాయి తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్‌లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం విదితమే. నైజీరియన్లతో పాటు- కొందరు ఆఫ్రికన్లు వీసా కాలం ముగిసినప్పటికి నగరంలోనే ఉంటూ గోవా, బెంగళూరు, మహారాష్ట్రల నుంచి మత్తు సరఫరా చేస్తున్నట్లు పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది. నైజీరియన్‌లు బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని హైదరాబాద్‌ నుంచి పంపేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు.

ప్రమాదకర డ్రగ్స్‌..

ప్రమాదకర డ్రగ్స్‌ను తరలిస్తున్న నైజీరియన్‌ను ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించాలని చూస్తున్న కుష్‌, ఓజీ డ్రగ్స్‌ను లాలాగూడలో ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుబడిన డ్రగ్స్‌ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కుష్‌, ఓజీ డ్రగ్‌ ఆఫ్రికా, అమెరికాలో ఎక్కువగా లభిస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రగ్‌ కారణంగా లివర్‌, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. డ్రగ్స్‌ తో పట్టు- బడిని వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇంతకాలం కొకైన్‌, చరాస్‌, గంజాయి, ఎండీఎంఎ తదితర డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌లు తాజాగా ప్రమాదకర డ్రగ్స్‌ను విక్రయిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు.

విద్యార్థులే టార్గెట్‌..

హైదరాబాద్‌ నగరంలోని కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా నైజీరియన్‌లు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదివరలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి డ్రగ్స్‌ పరఫరా చేసి వందలాది మంది నైజీరియన్‌లు పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే. ఈక్రమంలో రాష్ట్రంలో డ్రగ్స్‌, మత్తు పదార్థాల సరఫరా చేస్తున్న నైజీరియన్‌లపై ఎన్డీపిఎస్‌ 1985 ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు వారిని హైదరాబాద్‌ నుంచి పంపేలా చర్యలు తీసుకోనున్నారు. గడువు ముగిసినప్పటికీ ఇక్కడ డ్రగ్స్‌ విక్రయాలకు పాల్పడుతున్న నైజీరియన్‌లను తిరిగి వారి దేశాలకు పంపాలని పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త వ్యూహాలకు తెరతీస్తుండటం గమనార్హం.

నార్కొటిక్‌, టి న్యాబ్‌ బృందాలు..

డ్రగ్స్‌ నిర్మూలనపై నార్కొటిక్‌, టిఎస్‌ న్యాబ్‌ పోలీసులు సైతం నైజీరియన్‌ల కదలికలపై నిఘా సారిస్తున్నారు. గోవా,బెంగళూరుతో పాటు ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి డ్రగ్స్‌ తరలిస్తున్న నైజీరియన్‌ వివరాలు సేకరిస్తున్నారు. గతంలో డ్రగ్స్‌ కేసులలో పట్టుబడిన నైజీరియన్‌లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. నైజీరియన్‌లు డ్రగ్స్‌ను చైన్‌లింక్‌ సిస్టమ్‌లో సరఫరా చేస్తున్నారని, ఒకరి నుంచి మరొకరు అందజేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో విద్య కోసం ఎంతమంది నైజీరియన్‌లు వచ్చారు, వారు ఎక్కడెక్కడ విద్యనభ్యసిస్తున్నారన్న వివరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక పోలీసులతో నార్కొటిక్‌, టిఎస్‌ న్యాబ్‌ పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్‌ దందా చేస్తున్న నైజీరియన్‌లపై నిఘా సారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement