దేశంలో ఒకే ఒక రామాలయం
అది నిజంగా ఏకశిలానగరమే
అతిపెద్ద రాజ గోపురం సొంతం
రాముడిని కలవడానికి ముందే గుడి నిర్మాణం
సీతారాముల కళ్యాణం కమనీయం
ఏప్రిల్ 16 నుంచి వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధం
అంతా రామ మయం.. ఈ జగమంతా రామమయం.. అంతా రామమయం.. ఈ జపం వినిపిస్తుంటే.. కళ్ల ఎదుట శ్రీ సీతారాములే కాదు.. లక్ష్మణుడితో పాటు ఆంజనేయుడూ మదిలో సాక్షత్కిరించటం సాధారణం. ముకుళిత హస్తాలతో నమస్కరించే గధ ధారి రూపం గుండెల్లో కనిపించాల్సిందే. కానీ … శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో సహా ఆంజనేయుడు లేని గర్భాలయం ఉంటుందా? ఊహించగలమా? కానీ.. ఇది నిజం. అయోధ్యలో రామాలయం ఎంత ప్రాశస్త్యమైందో? దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం రామాలయం ఎంత గొప్పదో? ఆంధ్రప్రదేశ్లోనూ మహాత్తర రామాలయం ఉంది. అదే ఒంటిమిట్ట రామాలయం. భారత దేశంలోనే ఎక్కడా లేని రీతిలో.. ఆంజనేయుడు కనిపించని మహత్తర రామాలయం ఇది. ఔనా అంటే.. ఔను. ఈ కథాకమామిషు తెల్సుకుందాం.
కడప – ప్రభ న్యూస్ బ్యూరో – శ్రీరాముడి దేవాలయాల్లోని మూల విగ్రహాల్లో రాముడి పక్కన ఆంజనేయుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. విశిష్టమైనఈ రామాలయం వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం. ప్రఖ్యాత ఈ రామాలయంలో శ్రీ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి మూలమూర్తులు. కడప నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో కడపకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. సీత, రాముడు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉండటంవల్ల దీన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భద్రాచలంగా పేరుపొందింది. శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమలు నిర్వహిస్తోంది. ఆరోజు దేవస్థానానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రికానీ, దేవాదాయశాఖ మంత్రి కానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.
అంజనీ పుత్రుడి లేని చరిత్ర ఆధారంగా..
విశ్వామిత్రుడు తన యాగరక్షణకు బాల్యదశలోని రామ లక్ష్మణులను అడవికి తీసుకువెళ్లారు. సీతారాముల కల్యాణం జరిగిన తర్వాత కూడా ఇలాంటి సందర్భం ఎదురైంది. మృకండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముణ్ని దుష్టశిక్షణ కోసం ప్రార్థిస్తారు. సీతా లక్ష్మణ సమేతుడై అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని యాగరక్షణకు శ్రీరాముడు తరలివస్తాడు. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ దేవస్థానంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థలపురాణం చెబుతోంది.
దేశంలోనే అతి పెద్ద గోపురం
భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో కీర్తించాడు. తాను ఏకశిలాపురి వాసినని మహా కవి పోతన చెప్పిన మాట విధితమే. తాను రచించిన భాగవతాన్ని ఈ కోదండ రాముడికి అంకితం చేశాడు. హనుమంతుడు శ్రీరాముణ్ని కలవడానికి ముందే ఒంటిమిట్టలోని సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహాన్ని స్థాపించినట్లు కథనం ఉంది.
చంద్రుడి వెన్నెలలో సీతారాముల కళ్యాణం
చంద్రుడి వెన్నెల వెలుగులో స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకత. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరంచిన తర్వాత పగలు జరిగే స్వామి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామికి విన్నవించుకున్నాడు. ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని అప్పుడు నారాయణుడు చంద్రుడికి వరమిస్తాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా చేస్తారు.
ఏప్రిల్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు..
ఏకశిలా నగరం ఒంటిమిట్టలో ఏప్రిల్ 16 నుంచి 26 వరకు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 22 న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటలకు కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు..
ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్పణ
17న ఉదయం – ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ
18న ఉదయం – వేణుగానాలంకారం, సాయంత్రం – హంస వాహన సేవ
19న ఉదయం – వటపత్రశాయి అలంకారం, సాయంత్రం – సింహ వాహన సేవ
20న ఉదయం – నవనీత కృష్ణాలంకారం, సాయంత్రం – హనుమత్సేవ
21న ఉదయం – మోహినీ అలంకారం, సాయంత్రం – గరుడసేవ
22న ఉదయం – శివధనుర్భంగాలంకారం, సాయంత్రం – కళ్యాణోత్సవం (సా.6.30- రా.8.30) / గజవాహనం
23న ఉదయం – రథోత్సవం
24న ఉదయం – కాళీయమర్ధనాలంకారం, సాయంత్రం – అశ్వవాహన సేవ
25న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం.
26న సాయంత్రం – పుష్పయాగం