Saturday, November 23, 2024

Exclusive – ప‌రిశ్ర‌మ‌ల్లో.. నో సేఫ్టీ! ఆ ఒక్కటీ అడ‌గొద్దు

కార్మికుల ప్రాణాలు కంపెనీలకు పట్టవు
తాజాగా తెరమీదకు సేఫ్టీ ఆడిట్
ఉలిక్కిపడుతున్న ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యం
లెక్కలు ఇవ్వరు.. గ‌ట్టిగా అడిగితే లాకౌట్
ఇదీ ఇండస్ట్రీస్​ బారికేడ్
తదుపరి యాక్షన్​కు రెడీగా సర్కారు
సేఫ్టీ ఆడిట్​ చేస్తాం అంటున్న ఉపముఖ్యమంత్రి పవన్
సంతోషం వ్యక్తం చేస్తున్న కార్మికులు

ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్‌వర్క్: ఏపీలో అతి పెద్ద విదేశీ పరిశ్రమ ఎసెన్షీయా ఫార్మా కంపెనీ 17 మంది కార్మికుల ప్రాణాలను సాల్వెంట్ రియాక్టర్​కు బలి ఇచ్చింది. అయినా దీనిపై ఉలుకులేదు. పలుకూ లేదు. ఆ మర్నాడే పరవాడ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో ప్రమాదంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ఘటనలతో సర్కారు గాబరాపడుతోంది. బాధితులకు భారీ పరిహారం పేరిట ప్రధాన ప్రతిపక్షం వీధి పోరాటానికి రెడీ అయ్యింది. ఇంతకీ ఫార్మా కంపెనీల్లో ఈ ప్రమాదాలకు కారణమేంటీ? ప్రమాదాల నివారణ బాధ్యత ఎవరిది? రెడ్ కేటగిరీ కంపెనీల్లో కార్మికుల ప్రాణాలకు విలువ లేదా? ఉద్యోగుల ప్రాణాలకు కంపెనీలు రక్షణ ఇవ్వలేవా? కార్మికులకు భద్రతను కల్పించలేవా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడం లేదు. కంపెనీల్లో భద్రతా? ఆ ఒక్కటీ అడక్కూడదు. ఇదీ పరిశ్రమల యాజమాన్యాల నుంచి వినిపిస్తున్న సమాధానం.

రెడ్ కేట‌గిరీలో ప‌లు కంపెనీలు..

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు కలవరం సృష్టిస్తున్నాయి. రియాక్టర్ల పేలుళ్లు ఏకంగా కార్మికుల ప్రాణాలను మింగేస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లో 208 పరిశ్రమలుంటే.. పరవాడ జేఎన్ ఫార్మా సిటీలో సుమారు 90 సంస్థలున్నాయి. ఇక్కడి పరిశ్రమల్లో 130 వరకు రెడ్ కేటగిరీవే. 2009లో ఏర్పడిన అచ్యుతాపురం సెజ్‌లో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో ఎసెన్షియా ఫార్మా దుర్ఘటన రెండవది. అంతకుముందు.. అంటే 1997లో హెచ్ పీ సీఎల్ లో రిఫైనరీ పేలింది. ఆ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కంపెనీ.. భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంస్థ దుర్ఘటనే నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. రెడ్ క్యాటగిరీ కంపెనీలు పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అయిదేళ్లలో 119 ప్రమాదాలు జరిగాయి.. అందులో 120 మంది చనిపోయారు.

- Advertisement -

క‌నిపించ‌ని సేఫ్టీ ఆడిట్

నిజానికి ఫార్మా కంపెనీల నిర్వహణ, భద్రత.. సవాల్ తో కూడుకున్నది. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వీటిలో రియాక్టర్ల వద్ద టెంపరేచర్, ప్రెషర్ గేజ్ ల పని తీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ప్రెజర్ ఎక్కువైతే.. వెంటనే అలారం మోగాలి. దీని కోసం సెన్సర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిజానికి రియాక్టర్ కు ఉండే రప్చర్‌ డిస్క్‌.. ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఊడిపోతుంది. ఇలా జరిగినప్పుడు అక్కడుండే ఆవిరి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. దీనిని బట్టి ఇది ఎంత కీలకమైన వ్యవస్థో అర్థమై ఉంటుంది. మరి అలాంటప్పుడు దీని బాధ్యతలు ఎవరికి అప్పగించాలి… అనుభవం ఉన్న నిపుణులకు ఇవ్వాలి. కానీ ఇది సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కిందటి ఏడాది.. ఓ ఫార్మా సంస్థలో రియాక్టర్ లో సాల్వెంట్ నింపే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఎక్కడ?

సాధారణంగా పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే.. దాని తీవ్రతను తగ్గించడానికి దశలవారీగా సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేస్తారు. అంటే.. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండి.. అది పరిశ్రమను దాటి బయటకు వచ్చినట్లయితే.. వెంటనే.. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ను అమల్లో పెట్టాలి. మామూలుగా అయితే జిల్లాలో ఉండే పరిశ్రమల శాఖ దీనిని పర్యవేక్షించాలి. కానీ గత 15 ఏళ్లుగా ఈ ప్లాన్ ను అప్ డేట్ చేయలేదని తెలుస్తోంది. తరువాత జిల్లాల విభజన జరిగింది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాటిలో రెడ్ కేటగిరీలో ఉన్నవాటి విషయంలోనూ ప్లాన్ అప్ డేట్ విషయంలో చొరవ తీసుకోలేదని తెలుస్తోంది. అయినా పరిస్థితి మాత్రం మారలేదు.

రెడ్ కేటగిరీల్లోనే డేంజర్ డేంజర్

రెడ్ కేటగిరీలోని పరిశ్రమల్లో కెమికల్ గోడౌన్స్, కెమికల్ పైప్ లైన్స్, ట్యాంక్స్, బాయిలర్లు, రియాక్టర్లు, ఎలక్ట్రికల్ బోర్డ్స్ పై కచ్చితంగా నిరంతరం పర్యవేక్షణ ఉండాల్సిందే. ఇక కార్మికులంతా.. అనుభవ కెమిస్టులు, సేఫ్టీ మేనేజర్లు, షిఫ్ట్ ఇన్ ఛార్జ్ ల పర్యవేక్షణలో పని జరగాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు అవగాహనా సదస్సులతోపాటు మాక్ డ్రిల్ ను ఏర్పాటు చేయాలి. సంబంధిత శాఖల అధికారులు కూడా తనిఖీలను నిర్వహించాలి. ఇలాంటి కంపెనీల్లో మరికొన్ని చర్యలను కూడా చేపట్టాలి. బాయిలర్ల దగ్గర వాటర్ లెవెల్ తో పాటు టెంపరేచర్ కూడా చెక్ చేయాలి. సరైన సేఫ్టీ మెజర్స్ లేకుండా రియాక్టర్ల లోపల శుభ్రం చేయకూడదు. కెమికల్స్ ఉన్న డ్రమ్ములను దగ్గర దగ్గరగా నిల్వ చేస్తే.. ప్రమాదం తీవ్రత పెరుగుతుంది. అలాగే రియాక్టర్లలో కెమికల్స్ ఛార్జ్ చేసినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎక్స్ పైరీ డేట్ దాటిన రియాక్టర్లతో పాటు ఎక్విప్ మెంట్ ను ఉపయోగించినా సమస్యలు తప్పవు.

ఆసుపత్రి ఊసే లేదు

అచ్యుతాపురం – పరవాడ పరిధిలో అధునాతన సదుపాయాలతో ఓ ఆసుపత్రిని నిర్మించడానికి ప్లాన్ చేశారు. దీని కోసం అక్కడి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్నీ చూశారు. హాస్పటల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడానికి కొన్ని కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి. కానీ ఆ ప్రతిపాదన ఎందుకో ముందుకు కదలలేదు. బర్న్స్ వార్డ్ ఉన్న ఆసుపత్రిని నిర్మించినా.. లేదా దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో బర్న్స్ వార్డ్ ని ఏర్పాటు చేసినా ఫలితం ఉంటుంది. కానీ ఈ విషయంలోనూ శ్రద్ధ లేకపోవటంతోనే భారీ మూల్యం తప్పటం లేదు. ప్రమాదకర పరిశ్రమల్లో చెకింగ్స్ కోసం గతంలో రెండు జీవోలను తీసుకువచ్చారు. 2020లో 156 జీవో, 2022లో 79 జీవోను తీసుకువచ్చారు. థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్స్ నిర్వహణకు సంబంధించిన అంశం కూడా ఉంది. అయితే.. పరిశ్రమలు వీటి విషయంలో అలసత్వం వహిస్తున్నాయి. దీంతో ఇలాంటి భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగుల ప్రాణాలను బలిగొంటున్నాయి.

ప్రమాదాల నివారణపై అశ్రద్ధ

ఇక్కడ మరో సమస్య గురించి కూడా ప్రస్తావించాలి. అచ్యుతాపురం సెజ్ లో ఫార్మా కంపెనీలే అత్యధికం. అందులోనూ కెమికల్స్ తయారీతోపాటు వాటిని నిల్వ చేసే సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రమాదం జరగడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే.. ఇక్కడ ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు , అగ్నిప్రమాదాల నియంత్రణకు .. ఒకే ఒక్క ఫైరింజన్ ఉంది. ఏమైనా ప్రమాదాలు జరిగితే.. దగ్గరలోని ఫైరింజన్లను రప్పిస్తారు. దీనివల్ల సకాలంలో మంటలు ఆర్పే పరిస్థితి కూడా ఉండడం లేదు. మామూలుగా అయితే.. ఇలాంటి పరిశ్రమల్లో బాయిలర్లు పేలడం, రియాక్టర్లు పేలడం సర్వసాధారణం. కానీ ప్రస్తుత ప్రమాద ఘటనలో వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజివ్ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటిఘటనల్లో గ్యాస్ లీకయ్యాక అది గాలిలో కలిస్తే డేంజర్ ఉండదు. ఒకవేళ క్లోజ్డ్ రూమ్ లో ఆ గ్యాస్ ఉండిపోతే.. అది మేఘంలా మార్పు చెందుతుంది. ఆ సమయంలో చిన్న స్పార్క్ తో కూడా భారీ పేలుడు తప్పదు. ఎసెన్షియా ప్రమాద ఘటనను పరిశీలిస్తే.. బిల్డింగ్ మొత్తం క్లోజ్డ్ గా ఉంది. దీంతో అక్కడ ఆ గ్యాస్ పొగలా అలముకుంది. అక్కడున్న ఎలక్ట్రికల్ ప్యానళ్ల ద్వారా.. బిల్డింగ్ లోని మూలమూలలకూ వ్యాపించింది. తరువాత మంటలు చెలరేగాక.. అప్పటికే పైపుల్లో ఉన్న ఆవిరి మేఘం విచ్ఛిన్నమై.. రియాక్టర్ పేలిందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement