అవును.. నిజంగా అవి కార్పొరేట్ జైళ్లే. ఈ విషయం చెప్పింది అల్లాటప్పా వ్యక్తి కాదు. ఏపీలో కార్పొరేట్ కాలేజీల దాష్టీకాలు, దారుణాలపై ప్రభుత్వం నియమించిన ఓ ఎంక్వైరీ కమిటీనే ఈ విషయం తేల్చి చెప్పింది. నారాయణ, చైతన్య కాలేజీల్లో విద్యార్థులపై జరిగే ఆగడాలను, స్టూడెంట్స్ మరణాలపై మహిళ కమిషన్ చైర్పర్సన్ నిర్మల విచారణ కమిటీ వేశారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపిన అప్పటి సబ్ కలెక్టర్ రిజ్వీ తన నివేదికలో ఈ విషయాన్నే స్పష్టంగా చెప్పారు. అందులో అక్షరాలా ఈ వ్యాఖ్యాలే ఉన్నాయి. ఇక.. నారాయణ, చైతన్య కాలేజీల పేరు ఎత్తితే ఉరి కొయ్యలకు వేలాడిన విద్యార్థుల నగ్న దేహాలే కళ్లముందు కదలాడుతాయి. తమ భవిష్యత్తు తరాలు లేరని.. వారి తీపి గుర్తులను తలుచుకుని కన్నీళ్లతో తల్లడిల్లే తల్లిండ్రులెందరో మన కండ్ల ముందు కనిపిస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలోనూ నారాయణ కాలేజీల్లో దాదాపు 100 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలున్నాయి. అయితే.. రిజ్వీ కమిటీ ఇచ్చిన నివేదికను ఏపీ ప్రభుత్వం కావాలనే బుట్టదాఖలు చేసినట్టు తెలుస్తోంది.
చదువు.. వారికి అతిపెద్ద వ్యాపారం
ఒకటి రెండు కాలేజీలదే గుత్తాధిపత్యం
ఒక్క నారాయణకే అధికారికంగా 117 కాలేజీలు
ఇంకా.. బినామీల పేరుతో 200కు పైగానే
ఏపీలో ఏటా పదివేల కోట్ల టర్నోవర్
మార్కులు.. ర్యాంకుల ఘోషలో విద్యార్థులు విలవిల
ఇదేమీ పట్టించుకోని ప్రభుత్వం
బ్రీఫ్ కేసుల్లో దూరి.. గమ్మునుంటున్న బ్యూరోక్రాట్లు
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో అనేక మాఫియాలున్నాయి. లిక్కర్, ల్యాండ్, శ్యాండ్, మట్టి.. ఇలాంటి మాఫియాలూ అందరికీ తెలుసు.. కానీ, ఎడ్యుకేషన్ మాఫియా మాత్రం చిన్నారుల ప్రాణాలు తోడేస్తోంది. విద్య పేరిట దోపిడీ జరుగుతున్నా. జనం పంటిబిగువున భరిస్తున్నారు. కేవలం రెండే రెండు విద్యాసంస్థలు.. సమాజ హితం పేరిట నిలువునా దోచేస్తున్నాయి. ఒకప్పుడు సంపన్న వర్గాల పిల్లలే కార్పొరేట్ కాలేజీల్లో జీవితాలు వెలగబెడితే.. ఈ సంస్థలు మధ్యతరగతి వర్గాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. హవ్వా.. నారాయణ… నారాయణ.. వీళ్లది చదువు వ్యాపారమా? అని నోరు నొక్కుకోవద్దు. ఒకప్పుడు అరకొర కాలేజీలతో అత్యుత్తమ ఫౌరులను తీర్చిదిద్దిన బెజవాడ ఓ విద్యలవాడగా మారింది. అందుకు విద్యావేత్తలు ఎంతో సంతోషించారు. అదే చదువులవాడ.. నేడు ఎడ్యుకేషన్ మాఫియా కేంద్రంగా మారిపోయింది. విజయవాడ, గుంటూరు నగరాలు కమర్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ల సెంటర్స్‌గా మారితే… కేవలం ఈ రెండు జిల్లాల్లో వార్షిక టర్నోవరు ₹2000 కోట్లు అంటే అతిశయోక్తి కాదు. ఇక.. ఈ దోపిడీ వెనుక ఉన్న అసలు కథ ఏంటో చదివి తెలుసుకుందాం.
నారాయణ గుత్తాధిపత్యం..
ప్రస్తుతం ఏపీలో 3307 జూనియర్ కాలేజీలుంటే… ఇందులో 2000కు పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో కనీసం 1400 జూనియర్ కాలేజీలో ఒక విద్యావ్యాపారి గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. ఉదాహరణకు నారాయణ జూనియర్ కాలేజీల వ్యాపారం గమనిస్తే.. ఏపీలో అధికారికంగా 117 నారాయణ జూనియర్ కాలేజీలున్నాయి. ఇటీవలే శ్రీచైతన్య విద్యాసంస్థలు నారాయణలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం .. విశాఖపట్నంలోని నారాయణ శ్రీ చైతన్య జూనియర్ (కోడ్ 2049), విజయవాడలో శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజీ (కోడ్ 5017)… పేరుకే ఈ రెండు అధికారిక కాలేజీలు కనిపిస్తే.. కనిపించని బినామీ కాలేజీలెన్నో అనేది అంతుచిక్కడం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకూ ప్రతి పట్టణంలోనూ నారాయణ జూనియర్ కాలేజీ బోర్డు కనబడుతుంది. కానీ.. పరీక్షలప్పుడే ఈ గుట్టు బయటపడుతుంది. హాల్ టిక్కెట్ అసలు చరిత్ర చెబుతుంది. ఎక్కడో రామలింగేశ్వర నగర్ లోని పిల్లలు లేని జూనియర్ కాలేజీ విద్యార్థులుగా పరీక్ష కేంద్రంలో నారాయణ బ్యాచ్ ప్రత్యక్షమవుతారు.
విద్యారంభంలోనే దోపిడీకి పునాది ..
పదో తరగతి పరీక్షలకు ముందే నారాయణ బ్యాచ్ విద్యార్థుల ఇళ్ల ముందు కందిరీగళ్లా వాలిపోతారు. 90పర్సంట్ మార్కులు వస్తే… ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు. 80 పర్సంట్ వస్తే సగం ఫీజు అంటారు. ఇక టెన్త్ పరీక్షలు పూర్తికాగానే తమ స్పెషల్ క్లాసులు జరుగుతామని, ఇప్పటి వరకూ ఇబ్బంది ఉన్న సబ్జెక్టుల్లో తీర్చిదిద్దుతామని, దీంతో ఇంటర్మీడియెట్‌లో చురకుగా తయారవుతారని తల్లిదండ్రులకు వల వేస్తారు. పిల్లలేమో.. ఇదేం ఖర్మరా బాబు అంటూ ఏడుపు ముఖంతో ఆ కాలేజీకి వెళ్తారు. అక్కడే అసలు మార్కులు, ర్యాంకుల జంజాటం మొదలవుతుంది. ఇంటర్ కోర్సుతో పాటు ఎంసెట్, ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో విద్యార్థులు కనిపిస్తారు. ఏపీలో ఏటా 5 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరైతే… సెకండియర్ మరో ఐదు లక్షల మంది పరీక్ష రాస్తారు. ఇక్కడే.. మార్కులు, ర్యాంకుల హోరుతో ఈ సంస్థలు రెచ్చిపోతున్నాయి.
వెలుగు చూడని ఆత్మహత్యలెన్నో..
ఈ నారాయణ కాలేజీ పేరు ఎత్తితే… ఉరికి వేలాడే విద్యార్థులెందరో? కన్నీళ్లతో తల్లడిల్లే తల్లిండ్రులెందరో? ఈ లెక్కలేవి వెలుగు చూడవు. 2000లో ఏపీలో కార్పొరేట్ కాలేజీల దారుణాలు, దాష్టీకాలపై అప్పటి మహిళ కమిషన్ చైర్ పర్సన్ నిర్మల తీవ్రంగా స్పందించారు. విచారణ జరిపించారు. అప్పటికి సబ్ కలెక్టర్ రిజ్వీ అద్భుత నివేదిక సమర్పించారు. కార్పొరేట్ కాలేజీలన్నీ జైళ్లని వివరించారు. కానీ.. ఆ నివేదికను ప్రభుత్వమే బుట్టదాఖలా చేసింది. ప్రతి విద్యాసంవత్సరంలోనూ నారాయణ కాలేజీలో కనీసం 100 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి.
పట్టచుకోని అధికారులు.. సర్కారు నిర్లిప్తత!
ఏపీలో విద్యావ్యాపారం పరిఢవిల్లితే.. ప్రభుత్వాలకు అంత లాభం. ఏపీలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా… కార్పొరేట్ విద్యాసంస్థలకే కొమ్ము కాస్తుంది. నిన్నా మొన్నటి వరకూ జగన్ ప్రభుత్వం కాస్త కట్టడి చేసినా… బ్యూరో క్రాట్లు మాత్రం ఒప్పందం ప్రకారం తమకు బ్రీఫ్ కేసులు అందాయా? లేదా? ఇదే స్థితి కొనసాగిందనే ఆరోపణలున్నాయి. 24 ఏళ్లుగా ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే… ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలే అగ్రస్థానంలో ఉంటాయి. ఈ సారి ఏకంగా 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా టాప్ లో నిలిచింది. అసలు జంబ్లింగ్‌తో కాపీయింగ్ జరగలేదు. పిల్లలు బ్రహ్మండంగా చదివేశారు. అధ్యాపకులు చాలా చక్కగా దిద్దారు. అందుకే ఉత్తీర్ణత శాతం విపరీతంగా పెరిగిందని అధికారులు చెబుతుంటారు.