Friday, September 6, 2024

Exclusive – అదిగో బ్రాందీ బుడ్డీ …. పల్లె, పట్నం హుషారు!


ఏపీ ఎన్నికల ప్రక్రియ.. జాతరలో మొక్కుబడుల దశలా ఫైనల్​ స్టేజీకి చేరింది. ప్రధాన ప్రతిపక్షాల యక్ష గానాలకు ఇక తాళం పడినట్టే. ఇప్పటి వరకూ తాము నొక్కిన బటన్లు.. చేసిన మంచి.. చేయబోయే అద్భుతాలను అధికార పక్షం వల్లెవేసింది. ప్రతిపక్షంపై చీదరింపులు, చీత్కారాలతో విరుచుకుప‌డింది. ఇక.. అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై ప్రతిపక్షం కూడా అంతకు రెట్టింపు స్థాయిలోనే దుమ్మెత్తి పోసింది. వారు అందించ‌బోయే సూప‌ర్ సిక్స్ లాంటి తాయిలాల ఊరింతలు జనాలను ఉక్కిరి బిక్కిరిచేశాయి. కాగా, రాజకీయ పార్టీల ప్రచార ఆర్భాటాన్ని ఎన్నికల కమిషన్ లాక్ చేసింది. ష్‌.. గ‌ప్‌చుప్ అంటూ చూపుడువేలు చూపించింది. కానీ.. అసలు సిసలు జాతర ఇప్పుడే షురువ‌య్యింది. ఇప్పటికే పల్లె, పట్నం తేడాలేకుండా కేసుల కొద్దీ కేసుల బ్రాందీ సీసాల మూతలను ఓపెన్​ అవుతున్నాయి. నాలుగు రోజుల కిందటే కరెన్‌సీ కట్టల్లోని నోట్లు ఇంటింటికీ చేరాయి. కొన్నిచోట్ల అసెంబ్లీ, లోక్‌స‌భ‌ అభ్యర్థుల మధ్య నోట్ల రగడ, మరికొన్ని నోట్ల బస్తాల దిగుమతిలో నేతలంతా బిజీగా ఉన్నారు. ఇటు బ్రాందీ బుడ్డీ.. అటు నోటు పాటతో శని, ఆదివారాల్లో ఎన్నికల పండుగ మ‌రింత రంజుగా మార‌నుంది.

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ ఏప్రిల్ 18కి నెల రోజుల ముందే ఏపీలో ఎన్నికల సమర భేరీ మోగింది. అటు పొత్తుల సన్నాహాలు, ఇటు జన సమీకరణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నిమగ్నం కాగా.. ఒంటరి పోరుకు అధికార పార్టీ వైసీపీ శంఖారావం పూరించింది. యుద్ధానికి సిద్ధం అంటూ సన్నద్ధం కాగా.. యువగళం, ప్రజాగళం పేరిట తెలుగుదేశం పార్టీ జనంలో పరుగులు పెట్టింది. ఇక విజయభేరి నినాదంతో జనసేనాని పవన్కళ్యాణ్ .. విజయ సంకల్పంతో బీజేపీ జెండాలు ఎగురవేశాయి. ఆంధ్రులకు ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్పార్టీసై అంది. ఏపీలో ఉత్తరాంధ్ర ఎచ్చెర్ల నుంచి అనంతపురం జిల్లా రాప్తాడు వరకూ .. రాజకీయ పార్టీల ప్రచార జైత్రయాత్ర సాగింది. సీఎం జగన్ తన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకు పోయారు.

- Advertisement -

ఎక్కడా తగ్గేదేలే..

45 రోజుల్లో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాల్లో తన వాణి వినిపించారు. తాను పంచిన రూ.2.70లక్షల నవరత్నాలను గుర్తు చేశారు. మళ్లీ గెలిస్తే ఈ పథకాలను మరింత పెంచుతానని హామీ ఇచ్చారు. ఇక టీడీపీ ఎక్కడ తగ్గలేదు. ఇటు లోకేష్, అటు చంద్రబాబు ఏపీ చుట్టూ సుడిగాలిలా తిరిగారు. 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో తమ ప్రచారం నిర్వహించారు ఎన్డీయే కూటమిలో చేరారు. పవన్కళ్యాణ్బలం, తమ బలగంతో బీజేపీ వ్యూహాన్ని అమలు జరుపుతూ ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోయారు. ఇక బీజేపీ అగ్రనాయకత్వం ఏపీపైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకూ సీఎం జగన్పైపల్లెత్తు మాట అనని ప్రధాని మోదీ, అమిత్షాసైతం ఈ ప్రచారంలో ఏకి పారేశారు.

డబ్బు పంపిణీపై నేతల ప్రచారం

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2,03,39,851మంది పురుషలు 2,10, 58,615మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 46, 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా జరిగిన అంశాల్లో 864 కేసులు నమోదు చేశారు. ఎన్నికల ఏర్పాట్లల్లో అధికారులు బిజీ బిజీ కాగా.. ఇక పోల్ మేనేజ్ మెంట్లో ప్రధాన రాజకీయ పార్టీలు క్షణం వృధా కాకుండా మద్యం, నగదు పంపిణీలో మునిగి తేలుతున్నాయి. టప్ ఫైట్ నియోజకవర్గాల్లో ఓటుకు నోటు విలువ పెరిగింది. సాక్షాత్తు సీఎం జగన్ మంగళగిరిలో మాట్లాడుతూ, ప్రత్యర్థి దగ్గర దోచిన సొమ్ము చాలా ఉంది. ఎంత ఇస్తే అంత తీసుకోండి. ఓటు మాత్రం ఫ్యాన్ కే వేయాలని సూచించారు. ఇదే దొరణి ఏపీలో అన్ని చోట్ల కనిపిస్తోంది.

ఓటరుకు దక్కినంత..

ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నోట్ల పంపిణీల్లో అభ్యర్థులు నువ్వా నేనా అనే రీతిలో పంపిణీ ప్రారంభించారు. ఒక నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇద్దరూ కలిసి ఓటుకు వెయ్యి రూపాయాలు ఇస్తుంటే.. మరో పార్టీ అభ్యర్థులు చెరోక వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అంటే సగటున ఒక నియోజకవర్గంలో ఓటుకు రూ.3వేలు లభించాయి. కొన్ని చోట్ల రెండు ప్రధాన పార్టీల నుంచి రూ.4వేలు ఓటరుకు లభించాయి. ఇది సరే సామాజికంగా.. ఓటరు బలం ఉన్న ప్రాంతంలో అసెంబ్లీ అభ్యర్థులు ఎంపీ పంపించిన డబ్బును ఇద్దరికీ అని పంచుతున్నారు. ఒక ఓటుకు ఎంపీ వెయ్యి రూపాయలు పంపిస్తే.. ఆ డబ్బును ఎమ్మెల్యే అభ్యర్థి ఖాతాలో వేసుకొంటున్నారు. ఒక్కొక్క చోట ఒక ఓటు ఫ్యానుకు, మరో ఓటు గ్లాజు గ్లాసుకు అని వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. మరో చోట ఒకటి సైకిల్ కు.. మరొకటి ఫ్యాన్ కు అని చెబుతున్నారు. ఈ ప్రకారం పరిశీలిస్తే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో (25 ఎంపీ స్థానాలు) సరాసరి 12,500 కోట్లు చేతులు మారినట్టేనని రాజకీయ పరిశీలకుల అంచనా.

గప్ చిప్ బ్రాందీ బుడ్డి ..

ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కేవలం కీలక కార్యకర్తలకే మద్యం సరఫరా చేసిన నేతలు.. గడచిన ఈ 50 రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.50వేలకు పైగా మద్యం పంపిణీ చేశారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంటే రూ.25లక్షలు కార్యకర్తల మద్యం కోసమే ఖర్చు చేశారు. ఇక గత వారం రోజులుగా పల్లెల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. కేవలం లిక్కర్ కే ఒక్కొక్క అభ్యర్థి రూ.3 కోట్లు పైగా ఖర్చు పెట్టారట. ఇక శని, ఆదివారాల్లో మరో రెండు కోట్లు ఖర్చు కాగలదని బ్రాందీ సీసాలను డంప్ చేశారని, మరి కొందరు సొంత తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కేవలం మద్యం కోసమే ఒక్కొక్క అభ్యర్థి తన ఇలాఖాలో రూ.5కోట్లు వెదజల్లితే… ఏపీ మొత్తం మీద.. మద్యం ఖర్చు రూ.875 కోట్లకు చేరినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement