Sunday, November 17, 2024

Exclusive – రిజిస్ట్రేష‌న్ల‌లో లాలూ”ఛీ” – ఎవ్వరి భూమినైనా రాసేసుకోవచ్చు

పైస‌లిస్తే ఎలాంటి ప‌ని అయిన అయిపోద్ది
నకిలీ చలాన్లు యథాతథం
అధికారుల కళ్లకు నోట్ల గంతలు
రిజిస్ట్రార్లు.. రైటర్ల మాయాజాలం
సర్కారు ఖజానాకు పెద్ద ఎత్తు చిల్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్రమార్కులు
తాజాగా ఏసీబీకి చిక్కిన లంచావతారి
రిజిస్ట్రేష‌న్‌ శాఖలో అక్రమార్జన దందా

ఆంధ్రప్రభ స్మార్ట్, కర్నూలు బ్యూరో: భూమి క్రయ విక్రయాల్లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష్రన్‌ శాఖ ఎంతో కీలకం. యాజమాన్య హక్కును కాపాడటం ఈ శాఖ విధి. కానీ.. అక్రమ రిజిస్ర్టేషన్లు, మామూళ్ల వసూళ్లల్లో ఈ శాఖ తర తరాలు ఆరితేరిపోయింది. నకిలీ దస్తావేజుల తయారీ నుంచి.. దొంగ రిజిస్ర్టేషన్ల వరకూ.. చేతిలో నోట్ల కట్టలుంటే చాలు.. చట్టాన్ని చట్టుబండలు చేయటంలో ఈ శాఖ అధికారులు సిద్ధహస్తులని జనం ఆరోపణ సర్వసాధారణమే. ప్రభుత్వ ఆదాయం మాటేమిటో కానీ అక్రమార్జనతో తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో అధికారులు ఏ మాత్రం వెనుకంజ వేయటంలేదనే ఉదంతాలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట కర్నూలు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష్రన్‌ శాఖలో నకిలీ చలాన్ల వ్యవహారం కలకలం రేపింది. నంద్యాల, కర్నూలు, కల్లూరుల్లో వెలుగుచూసిన చలానా వ్యవహారంలో ఇద్దరు సస్పెన్షన్‌ కాగా, వక్ప్‌బోర్డు భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన కర్నూలు సబ్‌ రిజిస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌పై రిజిస్ర్టేషన్ శాఖ కమిషనర్‌ వేటు వేశారు.

- Advertisement -

అన్నీ అక్రమార్కుల ఎపిసోడ్‌లే..

ఉమ్మడి జిల్లాలోని స్టాంఫ్‌ అండ్‌ సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల పరిధిలో ఏ మేరకు అవినీతి ,అక్రమాలు వేళ్లునుకుని పోయాయంటే.. . ఇందుకు తార్కణం గత నాలుగేళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ కేసుల్లో చిక్కుకొని సస్పెన్షన్‌ అయిన రిజిష్ట్రార్‌లు, కింది స్థాయి సిబ్బందే ఓ ఉదహారణ. జిల్లా ఏరియాతో సంబంధం లేకుండా సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో అక్రమార్కులు . అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారని జనం ఆరోపణ. ముఖ్యంగా రెండేళ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రేష్రన్‌ ఆఫీసు చలాన్లను సీఎఫ్‌ఎంఎస్‌ కు అనుసంధానం చేసే క్రమంలో జిల్లాల్లోనూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష్రన్‌ శాఖ తనిఖీలు చేపట్టగా భారీ కుంభకోణం వెలుగు చూసింది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేష్రన్‌ ఫీజు కోసం చెల్లించే చలానాలను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేష్రన్‌ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్‌ రిజిస్ట్రార్ర్‌ కార్యాలయంలో సమర్పించాక.. కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగించినట్టు దర్యాప్తులో తేలింది.

సాంకేతిక లోపాన్ని ఆస‌ర‌గా చేసుకుని..

సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకుని కేటుగాళ్లు ఈ నకిలీ ఈ చలానాల దందాను నడిపించారు. దీంతో సర్కార్‌ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు పక్కదారి పట్టాయి. కర్నూలు, నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కర్నూలు జిల్లా నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్ర్‌ ఆఫీసులో నకిలీ చలానాల వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. సబ్‌ రిజిస్టర్‌ సోఫియా బేగం, జూనియర్‌ అసిస్టెంట్‌ వీరన్నపై అప్పట్లో వేటుపడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత ఆలూరు కి చెందిన ఓ సబ్‌ రిజిస్టర్‌ అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆలూరు సబ్‌ రిజిస్టర్‌ శ్రీనివాసులు డాక్యుమెంటు రైటర్లు రాజన్న స్వామి, రాయచోటయ్య స్వామిలతో. స్టాంప్‌ల విక్రయాలు, రిజిస్ట్రేష్రన్‌లు, డ్యాకుమెంట్లు, చలనాల ఈ వ్యవహారంలో అక్రమాలకు తెర తీసిన్నట్లు గుర్తించారు. వివిధ చోట్ల దాచి ఉంచిన అనధికార నగదు రూ.1,75,270 ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

అధిక మొత్తంలో వ‌సూలు..

రిజిస్ట్రేష్రన్లకు అధిక మొత్తంలో డ్యాకుమెంట్‌ రైటర్లు, సబ్‌ రిజిస్టార్‌ కలసి డబ్బులు తీసుకుంటు-న్నారని గుర్తించి ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతని పై వేటు వేసింది. ఆ తర్వాత రెండేళ్ల కిందట కల్లూరు సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయ పరిధిలో పనిచేసే సబ్‌ రిజిష్టర్‌ అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయారు. అంతకు ముందు కల్లూరులో ఓ మసీదు మాన్యాన్ని రిజిష్టర్‌ చేసిన కేసులో రమణ రావు అనే రిజిష్ట్రార్‌ను అప్పటి డీఐజీ కిరణ్‌ కుమార్‌ డిస్మిస్‌ అర్డర్‌ ఇవ్వగా, కోర్టుకు వెళ్లి తిరిగి పోస్టు తెచ్చుకున్నారు.

అక్క‌డి నుంచి మ‌రోచోటుకు..

ఆ తర్వాత అతన్ని ఇక్కడి నుంచి బదిలీచేసి ధర్మవరం పోస్టింగ్‌ ఇచ్చారు. ఇతను కర్నూలు నగర పరిధిలోని మామిదాల పాడు 154 సర్వేనెంబర్‌, 7ఏ పందిపాడు పరిధిలోని 7ఏ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు ఆరోఫణలు వచ్చాయి. ఇదే తరహాలో గతంలో కల్లూరు సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయంలో పనిచేసిన చీకటి వనజా లక్ష్మి కల్లూరు పరిధిలోని 124, 128, 340, 382 వక్ప్‌బోర్డు సర్వేనెంబర్‌లో రిజిష్టర్‌ చేసినట్లు అరోఫణలు రాగా ఆమెను నంద్యాల కు బదిలీ చేశారు. ఈ మహిళపై ఎటువంటి చర్యలు లేకుండా గుట్టుచప్పుకోకుండా బదిలీ చేశారు. అంతకు ముందు బనగానపల్లేలో ఓ సబ్‌ రిజిష్టర్‌ ప్రభుత్వ భూములను రిజిష్టర్‌ చేయగా, గుర్తించి సస్పెండ్‌ చేశారు. కోవేలకుంట్లకు చెందిన ఓ సబ్‌ రిజిష్ర్టార్‌ కూడ ఇదే తరహాలో అక్రమాలకు తెరతీయగా అతడిపై అప్పట్లో సస్పెన్షన్‌ వేటు వేశారు.

తాజాగా వక్‌బోర్డు భూములకు ఎసరు..

వక్ప్ బోర్డు భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం.. ఆ శాఖలో కలకలం రేపుతోంది. కర్నూలు జాయింట్‌ -1 సబ్‌ రిజిస్ట్రార్ర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పై శనివారం సస్పెన్షన్‌ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబర్‌ లోని 12.59 ఎకరాల వక్ఫ్‌ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేష్రన్‌ చేశారంటూ ఆరోపణలు రావడంతో డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్‌ కుమార్‌ ఆ స్థలాన్ని 154/1 సబ్‌ డివిజన్‌ గా మార్చి మొత్తం 15 దస్తావేజులతో అక్రమ రిజిస్ట్రేష్రన్‌ చేసినట్లు- విచారణలో బహిర్గతం కావడంతో ఆయనను డీఐజీ సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కార్యాలయ సీనియర్‌ క్లర్కు రాఘవేందర్‌ ను కర్నూల్‌ సబ్‌ రిజిస్టర్‌ గా తాత్కాలికంగా నియమించారు.

ప్రతిపనికీ ఒక్కో రేటు..

ఇలా వక్‌బోర్డు, ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయడమే కాదు స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేష్రన్‌ శాఖ పరిధిలో ప్రతిరోజూ జరిగే స్టాంప్‌ డ్యూటీ-, ట్రాన్స్‌ ఫర్‌ డ్యూటీ-, రిజిస్ట్రేష్రన్‌ చార్జీలతోపాటు రిజిస్ట్రేష్రన్‌ శాఖ అందించే సర్వీసులలో సేల్‌ అగ్రిమెంట్‌, జీపీఏ, డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌, డెవలప్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ పార్టిషియన్‌ రిజిస్ట్రేష్రన్‌, కుటు-ంబ, కుటు-ంబేతరుల మధ్య అగ్రిమెంట్లు, గిప్ట్‌ రిజిస్ట్రేష్రన్లు, టైటిల్‌ డీడ్‌ డిపాజిట్‌, ఆథరైజేషన్‌తో, ఆథరైజేషన్‌ లేకుండా వీలునామా, లీజు సహా ఇతర సేవల అన్నింటిలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కాదని ప్రతి పనికి సెపరేటుగా తమ ఆదాయ వనరుగా స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేష్రన్‌ శాఖ అధికారులు మలుచుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement