Wednesday, November 6, 2024

Exclusive – కొల్లేరు ఆక్ర‌మ‌ణ‌లతోనే పెను ముప్పు…విజ‌య‌వాడ ముంపున‌కు ఇదే కార‌ణం

వెన‌క్కి త‌న్నిన వ‌ర‌ద జ‌లాలు
సాఫీగా వెళ్లాల్సిన వ‌ర‌ద‌ల‌కు ఆటంకం
ఇప్పుడిక‌.. కోల్లేరు ముంపు భ‌యం
37 ఏళ్ల త‌ర్వాత‌ బుడమేరు పగ
జతకలిసిన రామిలేరు.. తమ్మిలేరు.. గుండేరు
పెదయడ్లగాడిలో పెరుగుతున్న నీటి మట్టం
12 గ్రామాలకు చేరిన వరద నీరు
గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్: ప్రస్తుతం కొల్లేరులో రోజురోజుకు నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు సరస్సు అంతర్భాగంలో మూడు టీఎంసీల నీటి నిల్వ సామ ర్ధ్యం ఉండగా.. తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు వాగులతోపాటు కృష్ణ కాలువల్లో భారీ వరద కొల్లేరుకు చేరుతోంది. ఈ నీరంతా నేరుగా ఉప్పుటేరులో కలుస్తుంది. భారీ వరదలతో లంక గ్రామాల చుట్టూ ఇప్పటికే పూర్తిగా నీరు చేరింది. కొన్ని లంకలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్నింటికి ప్రమాదం పొంచి ఉంది. కొల్లేరులోని పెనమాకలంక ,నందిగామ లంక ఇంగిలిపాక లంక మనుగుళూరు కోవ్వాడలంక ,చింతపాడు, పులపర్రు గ్రామాల్లో కొంప కొల్లేరు కానుంది. బుడమేరు, రామిలేరు ఉధృతి తో మూడు రోజులుగా కైకలూరు, మండవల్లి మండలాల్లో కొన్ని గ్రామాలు మునిగాయి. . విజయవాడ మెట్ట ప్రాంతం లోనే వరద తాకిడితో ప్రజలను తరలించే పరిస్థితి ఎదురవ్వడంతో కొల్లేరు గ్రామాల ప్రజలు బెంబే లెత్తిపోత్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, సోల్రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి ప్రతి ఏటా నీరు చేరుతోంది.

- Advertisement -

పెరుగుతున్న నీటి మ‌ట్టం..

ఈ ఏడాది ఇప్పటికే ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెద్ద యడ్లగాడి -పెనుమాకలంక రోడ్డు బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. ఇప్పటికే 3 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. మరో అర మీటరు పెరిగితే కొల్లేరు అసాంతం మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు -ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆక్రమణల‌తో దెబ్బ‌తిన్న‌ కొల్లేరు

రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక పెత్తందారులు వేల కోట్ల విలువైన కొల్లేరు భూములను కొల్లగొట్టారు. 15 వేల ఎకరాలు చేపల చెరువుల్లా మార్చేశారు. 2006 లో జరిగిన కొల్లేరు ఆపరేషన్ లో అప్పటి కలెక్టర్ లవ్ కుమార్ అక్రమ చెరువుల్ని ధ్వంసంచేశారు, ఐదో కాంటూరు వరకూ 83,382 ఎకరాల మేర కొల్లేరు సరస్సును పునరుద్ధరించారు. ఆ రోజుల్లో కొల్లేరు నుంచి చెరువుల మాఫియా పారిపోయింది. భీమవరం సమీపంలోని కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలో పాగా వేసింది. వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు తవ్వేసింది. అప్పటి వరకూ ఎకరాకు రూ4వేల లీజు అకస్మాత్తుగా రూ.20వేలకు చేరింది. కానీ కొల్లేరు చేపలకు ఉన్న డిమాండు తీరనిది. అందుకే మళ్లీ చేపల మాఫియా కొల్లేరుకు చేరింది. అందులో 2021 అక్టోబరు 31 నాటికి 15,742 ఎకరాలు ఆక్రమణకు గురైందని అప్పటి కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించారు. 2021.. -22లో మరో 3వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వారని స్వయంగా అధికార యంత్రాంగమే అంగీకరిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటికి కొల్లేరులో 18వేల ఎకరాలను మాఫియా చెరబట్టింది. ఆ ఫలితాన్ని ఇప్పుడు కొల్లేరు జనం చవిచూడబోతున్నారు.

ప్లీజ్ బీ అలెర్ట్ : కలెక్టర్‌ వెట్రిసెల్వి

కొల్లేరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మండవల్లి, కైకలూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ముంపు ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు పాటించాల న్నారు. ఆయా గ్రామాల్లో గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారిని, వృద్ధులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు.

కృష్ణాలో 3 వేల మంది తరలింపు

కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం బుడమేరుకు వచ్చి చేరుకుంటోంది. గత 30 ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం బుడమేరుకు వచ్చి చేరుకుంటోంది. గత 30 ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చొచ్చుకు వచ్చింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం ఉంది. కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఒడ్డుకు చేరుస్తున్నారు. 3 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. పలు చోట్ల చేపల చెరువులకు గండ్లు పడ్డాయి. పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement