Friday, November 22, 2024

Exclusive – కాళీపట్నం భూములు ఖాళీ..జమీందార్ భూముల పంపిణీ జాప్యం

ఏలూరు, ప్రభ న్యూస్‌బ్యూరో: జమీందారీ వ్యవస్థ లేదు కానీ… అప్పటి జమీందార్ల వారసుడిగా చెప్పుకుంటున్న ఓ భూస్వామి వేల ఎకరాలు గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ భూమి పేదలకు పంచాలని ప్రభుత్వం, న్యాయస్థానం పదేపదే చెప్పినా ఊహూ అంటున్నాడు. కోట్ల విలువైన భూములను వదులుకునేందుకు ససేమి రా అంటున్న ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు భూపంపిణీ ని అడ్డుకుంటున్నాడు. మొగల్తూరు సంస్థానం లోని కాళీపట్నం భూముల కథ ఇది. పేదలకు పంచాల్సిన భూముల విస్తీర్ణం ఏకంగా 5,500 ఎకరాలు. దాని విలువ ప్రస్తుతం మార్కెట్‌ ధరల ఫ్రకారం రూ.2,750 కోట్లు. ఇక్కడ ఓ సంగతి చెప్పుకోవాలి. జమీందారి భూములను పేదలకు పంచాలని చేస్తున్న పోరాటం ఈనాటిది కాదు. స్వాతంత్య్రపోరాటం నాటి నుంచి కొనసాగు తోంది. ఆనాటి ముుఖ్యమంత్రి ప్రకాశం పంతులు మొదలుకొని… నిన్నమొన్నటి వరకు ప్రభుత్వా లు, న్యాయస్థానాలు ఆ భూమి పేదలకే పంచాలని, జమీందారుకు ఎటువంటి హక్కులు లేవని గంటాపథంగా చెప్పినా… ఇంతవరకు అంగుళం భూమి పేదలకు అందలేదు. ఎందువల్ల అలా జరుగుతోంది? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, పేదలకు సానుకూలంగానే వ్యవహరిస్తున్నా… భూపంపిణీ మాత్రం సాగడం లేదు. ప్రభుత్వం తాజాగా రీ సర్వే చేసి ప్రభుత్వ పోరంబోకు భూములు చుక్కల భూములు అసైన్‌ భూములు అర్హులైన పేదలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్న నేపథ్యంలో కాళీపట్నం భూముల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇటీ-వల జిల్లా అధికారులు ఈ భూములకు సంబంధించిన లిటిగేషన్‌ ఫైళ్లను బూజు దులిపి అధ్యయనం చేస్తున్నారు.

కాళీపట్నం భూముల కథ ఇదీ…
ఇచ్చాపురం నుండి తడవరకు కాలిబాటన వెళ్లే బాటసారుల భోజన వసతి సదుపాయాలు కల్పించడం కోసం కాళీపట్నం గ్రామంలో సత్రం నిర్మించారు. ఆ సత్రంలో తల దాచుకునేందుకు వచ్చిన బాటసారులకు భోజన వసతి కల్పించేందుకుగాను 264 ఎకరాల భూమిపై వచ్చే శిస్తును వసూలు చేసే హక్కును వంటపుట్టిగా ఉన్న కాండ్రేగుల జగన్నాధరావుకు బ్రిటిష్‌ ప్రభుత్వం దఖలు పరిచింది. ఆ భూములపై ఎటు-వంటి యాజమాన్యపు హక్కులు కల్పించలేదు. అనంతర కాలంలో రహదారుల నిర్మాణం జరిగి రైలు సౌకర్యాలు వచ్చిన నేపథ్యంలో 1770లో ఈ సత్రాల నిర్వహణను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ వంట పుట్టికి సంబంధించిన వారసులు తాము ఈ ఎస్టేట్‌కు జమీందారులమని తమకు తామే ప్రకటించుకున్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ భూములను గ్రామంలోని పేదలకు పంపిణి చేయనుందని, ఈ ఫారెస్ట్‌ను సాగుయోగ్యంగా చేసుకుని నీటిపారుదల వ్యవస్థను ఏర్పరచాలని గ్రామస్తులకు నమ్మబలికారు. 7,800 ఎకరాలలో కాలువలు రహదారులు, జిరాయితి భూములు పోను 5500 ఎకరాలు భూమిని శ్రమదానంతో గ్రామస్తులందరూ కలిసి సాగులోనికి తెచ్చారు. ఈ భూములను సాగులోకి తేవడంలో పాత కాళీపట్నం గ్రామంలోని కాపు, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ , యాదవ, నాయి బ్రాహ్మణ, బ్రాహ్మణ, ఎస్సీలు, ఇత్యాది వర్గాల వారంతా ఉమ్మడిగా శ్రమించి సాగులోకి తెచ్చారు. ఈ గ్రామం ప్రస్తుతం ఈస్ట్‌ కాళీపట్నం, వెస్ట్‌ కాళీపట్నం, పాతపాడు గ్రామాలుగా విభజించబడింది.

- Advertisement -

ప్రకాశం పంతులు చొరవతో…
1930లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో త్రిపుర కాంగ్రెస్‌ పక్షాన టంగుటూరి ప్రకాశం పంతులు కృషితో ఈ భూములు సాగునీటి సరఫరా కోసం ప్రధాన కాలువను కూడా ఏర్పరిచారు. భూమి సాగుకు యోగ్యమైన తరువాత జమీందారుగా ప్రకటించుకున్న వారసుడు ఈ భూములపై హక్కులు తనకే చెందుతాయని అడ్డం తిరిగాడు. గ్రామంలోని పేదలకు న్యాయం జరగాలని అప్పటి స్వతంత్ర సమరయోధులు గ్రామస్తులతో కలసి పోరాటాన్ని ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం ల్యాండ్‌లెస్‌ పూర్‌ సొసైటీ- పేరుతో 1936లో అల్లూరి సత్యనారాయణ, పరకాల శేషావతారం, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఎన్‌.జి.రంగా, టంగుటూరు ప్రకాశం, ఉద్దంరాజు రామంవంటి నాయకుల నాయకత్వంలో పేదల పక్షాన పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో క్విట్‌ ఇండియా ఉద్యమ సందర్భంగా గ్రామ పెద్దలతో సహా వందమంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఎస్టేట్‌ అబాలిషన్‌ యాక్ట్‌
స్వాతంత్రానంతరం 1947లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎస్టేట్‌ ఎబాలిషన్‌ యాక్ట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాక్ట్‌ ప్రకారం 2.50 ఎకరాలు చొప్పున ఆయా ప్రాంతాల్లోని భూమిలోని పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు ఇక్కడ జమీగా కొనసాగుతున్న వ్యక్తి అడ్డుపడి పంపిణీ జరగనివ్వ లేదు. ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఈ భూముల విషయంపై 1950లో అల్లూరు సత్యనారాయణ చైర్మన్‌గా నాన్‌ అఫీషియల్‌ కమిటీ- వేసారు. కమిటీ- విచారణ జరిపి ఈ భూములతో ఇక్కడ జమీ అని చెప్పుకునే వ్యక్తికి ఎటు-వంటి హక్కులు గాని, సంబంధంగాని లేదని తేల్చింది.1950లో ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుంది. దీనితో జమీ సివిల్‌ కోర్ట్‌కు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. 1969 వరకు న్యాయస్థానంలో వాదోపవాదాలు అనంతరం ఈ విషయంపై వివాదాన్ని ప్రత్యేక ట్రిబ్యునల్‌ తేల్చాలని న్యాయస్థానం సూచించింది. 1973లో ట్రిబ్యునల్‌ ఈ భూమిని ప్రభుత్వ భూమిగా డిక్లేర్‌ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలతో ప్రభుత్వం భూములను హేండోవర్‌ చేసుకుంది. అప్పటి కలెక్టర్‌ ఈ భూములను పంపిణీ చేస్తామని, అనధికారికంగా జరిగిన ఈ భూములు అమ్మకాలు, కొనగోళ్లు చెల్లవని గ్రామంలో టాంటాం వేసి ప్రకటించారు. 1978లో ఎస్టేట్‌ ఎబాలిషన్‌ యాక్ట్‌ ప్రకారం అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ తంతు జరుగుతుండగానే జమిందార్‌ అనే వ్యక్తి వైట్‌ పేపర్‌ అగ్రిమెంట్‌ ద్వారా ఆక్రమణదారులకు హక్కులు రాయడం ప్రారంభించారు. సెటిల్మెంట్‌ అధికారులను సైతం ప్రలోభపెట్టి పట్టాలు సైతం ఇవ్వడం ప్రారంభించారు. గ్రామంలోని భూ పోరాట కమిటీ- కలెక్టర్‌ని కలిసి ఇది చట్టవిరుద్ధమని, గ్రామపేదలకు అన్యాయం జరుగుతున్నదని మొరపెట్టు-కోగా సెటిల్మెంట్‌ అధికారి విచారణ జరిపారు. అలా రాసివ్వడం తప్పని, ఆపాల్సిందిగా కలక్టర్‌ ఆదేశించారు. ఆక్రమణదారులు ఎటు-వంటి హక్కులు లేకపోయినా ఈ భూములలో చెరువులు తవ్వి ఫలసాయాన్ని అనుభవిస్తున్నారు.

ఆక్రమణదారుల హవా
అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఆక్రమణదారులకు హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్‌ 82ను విడుదల చేశారు. టంగుటూరి ప్రకాశం ల్యాండ్‌లెస్‌ పూర్‌ సొసైటీ- తరఫున గ్రామస్తుల పక్షాన మేడిది బాబ్జి ఈ జీవోను సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2017లో ఈ జీవో రద్దు చెెస్తూ తీర్పునిచ్చింది. 1982 కటాప్‌ డేటు-ను రద్దచేసి 1945 కటాఫ్‌ డేట్‌ను ఖాయం చేసింది. ఎటు-వంటి అధికారాలు లేనప్పటికి ఆక్రమణదారులు తమ పరపతిని ఉపయోగించి స్థానిక అధికారులను ప్రలోభ పెట్టి అమ్మకాలు కొనుగోళ్లకు ప్రయత్నించడం, బ్యాంకులు ఈ భూములకు రుణాలు మంజూరు చేయడం వంటి అనధికారిక కార్యకలాపాలు చేస్తున్న ప్రతిసారి పోరాట కమిటీ- అడ్డుకుంటూనే ఉంది. ఆక్రమణదారులలో సంపన్న వర్గాలు పలుకుబడి కలిగిన వారు సైతం 50,100 ఎకరాలు చొప్పున చెరువులు సాగు చేస్తున్నారు. ఎకరా లక్ష రూపాయలు చొప్పున లీజులు పొందుతున్నారు. తాజాగా రీసర్వేకు జిల్లాయంత్రాంగం ప్రయత్నిస్తున్న నేపధ్యంలో భూపోరాట కమిటీ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం ఈ భూముల రీసర్వే ఆగిపోయింది. ఈ విషయంపై ఏళ్ల తరబడి గ్రామ పేదల పక్షాన పోరాటం చేస్తున్న టంగుటూరి ప్రకాశం ల్యాండ్‌లెస్‌ పూర్‌ కమిటీ- ప్రతినిధి మేడిది బాబ్జి ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడుతూ ఆక్రమణదారుల్లో చిన్న సన్న కారు రైతులకు నిబంధనల ప్రకారం రెండున్నర ఎకరాలు చొప్పున పంపిణీ చేసి మిగిలిన భూములను ఈ గ్రామంలోని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. పాత కాళీపట్నం గ్రామ పరిధిలోని గ్రామస్తులకు ఎస్టేట్‌ ఎబాలిషన్‌ యాక్ట్‌ క్రింద విచారణ చేసి పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దశాబ్దాలకాలంగా పేదలకు, పెద్దలకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వం ఈ భూసమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుంది? పేదలకు న్యాయంచేస్తుందా ఆక్రమణదారుల పక్షాన నిలుస్తుందా అనేది వేచిచూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement