Monday, November 18, 2024

Exclusive – అసెంబ్లీ.. టార్గెట్! జనసైన్యం కసరత్తు పూర్తి

అభ్యర్థుల జాబితా సిద్ధం
పేర్ల ప్రకటనే ఆలస్యం
ఇప్పటికే వ్యక్తిగతంగా కబురు
బీజేపీతో పొత్తే ఆలస్యం
లోక్సభ బరిలో హేమాహేమీలు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ) – ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎట్టి పరిస్థితిలోనూ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ప్రగాఢ లక్ష్యంతో… తన జనసైన్యం త్యాగాన్ని పణంగా పెట్టిన జనసేనాని గెలుపే ధ్యేయంగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒంటరి పోరాటంతో పదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక శైలిలో జనం మదిలో స్థానాన్ని కాపాడుకుంటూనే.. ఈ సారి విజయమో, వీరస్వర్గమో అనే రీతిలో జరుగుతున్న ఎన్నికల్లో తన బలంతో పాటు.. సహచర బలగాన్ని ప్రయోగించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఒక వైపు బీజేపీ చెలిమిని వీడకుండానే.. మరో వైపు తెలుగుదేశం సాన్నిహిత్యాన్ని కాపాడే తంత్రాంగంతో కదన రంగంలోకి దూకుతున్నారు. ఇప్పటికే పొత్తు కారణంగా సీట్లు తగ్గాయని కొందరు జన సైనికులు రోడ్డెక్కినా.. ఎన్నికల్లో సహకరించేది లేదని హెచ్చిరించినా.. పవనిజం ఎక్కడా తొణకటం లేదు. బెదరటం లేదు.

ఓటు బదిలీపైనే మెయిన్ ఫోకస్..
ఓటు బదిలీయే అసలు సిసలు త్యాగం.. ఈ యజ్ఞంలో శ్రమించిన యోధులందరికీ తగిన ప్రతిఫలం ఉంటుందని పవన్ కళ్యాణ్ సముదాయిస్తున్నారు. కాపు సామాజిక వర్గం అత్యధిక ప్రభావం చూపించే ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

పోటీ స్థానాలు ఖరారు..

టీడీపీతో కుదిరిన ఒప్పందం మేరకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. 3 ఎంపీ సీట్ల పరిధిలోని 21 స్థానాలనూ లెక్కలోకి తీసుకుంటే.. మొత్తంగా 45సీట్లలో జనసేన ప్రభావం ఉండబోతోంది. ఇప్పటికే తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్‌, రాజానగరంలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను జనసేనాని ప్రకటించారు. మిగిలిన 18 స్థానాల మీద ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. వీటిలో పిఠాపురం, అమలాపురం, భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, యలమంచిలి, పాలకొండ స్థానాలు జనసేనకు ఖరారైనట్లు వినవస్తోంది. వీటికి తోడు గిద్దలూరు, అనంతపురం లేదా పుట్టపర్తి, మదనపల్లె, బద్వేలు లేదా రైల్వే కోడూరు అసెంబ్లీ సీట్లను కోరేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం.

లోక్సభ విషయంలోనూ..

- Advertisement -

ఇక.. లోక్‌సభ విషయానికొస్తే బందరు, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీటిలో అనకాపల్లి నుంచి మెగా బ్రదర్ నాగబాబు జరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి బరిలో ఉంటారని సమాచారం. ఇక బీజేపీతో చర్చలు కొలిక్కి రాగానే రెండో జాబితా రూపంలో సీట్లను ప్రకటించేందుకు జనసేన సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement