Tuesday, November 19, 2024

Exclusive – గేట్లు తెరిచిన ప‌వ‌ర్‌ స్టార్‌ ..వైసిపి నుంచి జంప్ అవుతున్న లీడ‌ర్లు

జ‌న‌సేన‌కు ఫిక్స్ అవుతున్న సీనియ‌ర్లు
జ‌గ‌న్ బాసిజం తట్టుకోలేక‌నే బ‌య‌టికి
వైసీపీ జెండా ప‌క్క‌న‌పెట్టేస్తున్న నాయ‌కులు
ప్ర‌త్యామ్నాయ పార్టీగా జ‌న‌సేనలో ఆద‌ర‌ణ‌
స‌మ‌ర్థ‌వంత‌మైన లీడ‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీశార‌న్న బాలినేని
జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో భేటీ.. చేరిక‌కు స‌న్నాహాలు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గ్రేట్ గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్‌
ఒంగోలు కార్పొరేష‌న్ కైవ‌సం చేసేందుకు య‌త్నాలు
ప్ర‌కాశం జిల్లాలో ప‌వ‌ర్‌స్టార్‌కు ప‌దునైన ఆయుధం
బాలినేని రాక‌తో తీర‌నున్న నాయ‌క‌త్వ స‌మ‌స్య‌
కృష్ణా జిల్లాలోనూ సామినేని సానుకూల‌త‌
కేడ‌ర్‌తోపాటు చేరేందుకు కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ
భీమ‌వ‌రం నుంచి గ్రంథి శ్రీ‌నివాస్ కూడా అవుట్‌?
గోదావ‌రి జిల్లాల్లోనూ వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరిక‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

బలమైన కేడర్.. సమర్ధుడైన లీడ‌ర్‌ ఉన్నప్పటికీ.. జనసేనకు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సరైన నాయకులు లేరు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన విషయంలో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. మొన్నటి ఎన్నికల్లో ప‌వ‌ర్ స్టార్‌ పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్‌స‌భా స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఆ సందర్భంగా పవన్ సైతం నాయకత్వలేమిని పరోక్షంగా అంగీకరించారు. అయితే.. పొత్తుల బలం, పవన్ ఛరిష్మాతో జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించింది. జనసేనాని డిప్యూటీ సీఎం అయ్యాక ఆ పార్టీ ఫేట్ మారిపోయింది.

- Advertisement -

జ‌గ‌న్ బాసిజంతో విసిగిపోయి..

వైసీపీ చీఫ్ జగన్ బాసిసజంతో విసిగివేసారి పోయిన ఆ పార్టీలోని బడా నేతలంతా ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. అలాంటి సీనియర్లకు జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఇంత వరకు చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. ఇప్పుడు మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రూపంలో ఆ పార్టీకి జిల్లాలో సరైన ఆయుధం దొరికింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. జనసేనకు ఫిక్స్ అయ్యారు. దాంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు కొత్త జోష్ వచ్చినట్లైంది.

జ‌న‌సేన‌కు ప‌దునైన ఆయుధం..

ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరున్న బాలినేని.. జనసేనలో ఎంట్రీకి రెడీ అయ్యారు. ఒంగోలు కార్పొరేషన్‌ను జనసేనానికి బహుమతిగా ఇవ్వాలని బాలినేని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వైసీసీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తన అనుచరులైన 20 మంది కార్పొరేటర్లను.. తిరిగి జనసేనలో చేర్చేందుకు ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. 50 డివిజన్లు ఉన్న ఒంగోలులో వైసీపీ 41 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. ఇప్పటికే 20 మంది పార్టీ మారడంతో వైసీపీ మైనార్టీలో పడిపోయింది. ఆ క్రమంలో ఒంగోలు మేయర్ పదవిని జనసేన చీఫ్‌ పవన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని బాలినేని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సానుకూలంగా ఉన్న సామ‌నేని..

మరోవైపు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తన అనుచర వర్గంతో కలిసి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జగ్గయ్యపేటలో 1999 నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని.. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ సీనియర్ నేతకు జగన్ కేబినెట్‌లో బెర్త్ దక్కలేదు. అప్పటి నుంచి ఒకింత అసంతృప్తితో కనిపిస్తున్న ఆయన.. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరమయ్యారు. తాజాగా బాలినేని రాజీనామా తరహాలోనే ఉదయభాను కూడా వైసీపికి రాజీనామా చేసి జనసేన జెండాను భుజానికి ఎత్తుకోవడానికి రెడీ అయ్యారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ..

ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రెండు జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయిన వైసీపీ ఇప్పుడు వలసలతో ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా 2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌పై అనూహ్య విజయం సాధించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇప్పుడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత గ్రంథి వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. అయితే.. ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరతారా? లేకపోతే రాజకీయాలకు దూరమవుతారా? అన్నది చర్చల్లో నలుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement