Wednesday, November 20, 2024

Exclusive – నిర్ల‌క్ష్య‌మే..నిండా ముంచింది

ఆ శాఖ‌ల‌ ఆపీస‌ర్ల‌దే పూర్తి బాధ్య‌త

అక్ర‌మ అధికారులే దోషులు

అరచేతిలో లేటెస్ట్‌ సమాచారం అయినా ప‌ట్టించుకోని త‌నం

స‌మాచారం ఇవ్వ‌కుండా దాట‌వేశారు

- Advertisement -

వరద బాధితులకు సాయంలో అలసత్వం

అక్రమార్జనలో తలమునకలు

అధికారుల తీరుపై సీఎం చంద్ర‌బాబు ఫైర్‌ఏపీ, తెలంగాణ‌లో వ‌ర‌ద‌ల‌పై ప్ర‌జ‌ల ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూస్ నెట్‌వ‌ర్క్‌:అవును ప్రభుత్వాలు వస్తుంటాయి . పోతుంటాయి. నాయకులూ మారుతుంటారు. కానీ, దశాబ్ధాలుగా కీలక శాఖల్లో పని చేసే అధికారులు కనీసం స్పందించరా? తమ ఇళ్లపై వరదలు పొంగితే తన కుటుంబ పరిస్థితిని ఊహించలేరా? ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావించలేరా? వాతావరణ శాఖ సాంకేతిక పరిజ్ఞానంలో అప్ డేట్ అయింది. కొన్ని గంటల్లోనే పిడుగులు పడతాయని డేంజర్ బెల్ మోగిస్తోంది.

భారీ వర్షాలు.. అతి వర్షాలు వస్తున్నాయని .. ఆరెంజ్. రెడ్ అలెర్ట్లతో సైరన్ మోగిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఇన్ని వందల సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరో కొన్ని వందల వాన తథ్యం అని ఐఎండీ, విపత్తుల ప్రతిస్పందన శాఖ నెత్తినోరు బాదుకొంటుంటే.. ఇక్కడ మన పరిస్థితిని అంచనా వేసే ఇంగిత జ్ఞానం లేదా? ఒక వేళ విషయం అర్థమైతే.. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకో.. మంత్రులకో ముందుగానే ప్రమాద హెచ్చరికలపై సమాచారం ఇవ్వాలి కదా?

వరద విషయంలో అంచనా వైఫల్యం స్పష్టంగానే ఉందీ.. పోనీ, సహాయక చర్యల్లో బాధితులకు అందుబాటులో ఉన్నారా అంటే.. ఇక్కడ కూడా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఆకలో ఆకలి అని జనం గగ్గోలు పెడుతుంటే.. భోజనం బస్తాలతో తిరుగుతున్న వాహనాలను ఏ ప్రాంతానికి పంపించాలో .. పోలీసులు పట్టించుకోలేదు.

ఇంత నష్టమా? ఇంతకీ, ఈ విపత్తుతో ఏం జరిగింది? అపార ప్రాణ నష్టం తప్పిందని పాలకులు గొప్పలు పోతున్నారు. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 48 మంది మృతి చెందారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది చనిపోయారు. ఇద్దరు గల్లంతు అయ్యారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెంచారు. 1,69,370 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. 60 వేల కోళ్లు.. 275 పశువులు మృతి చెందాయి. 22 సబ్ స్టేషన్‌లు దెబ్బతిన్నాయి. 3,973 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి.

వర్షం వరదల వలన 6,44,536 మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. 214 రిలీప్ క్యాంపుల్లో 45,369 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ టీమ్‌లు రంగంలో దిగాయి. 6 హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయి. 228 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు.

కృష్ణా నదికి ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది

.ఆఫీసర్లు పసిగట్టలేదా?

వరదల విలయానికి రెండు తెలుగు రాష్ట్రాలూ అల్లల్లాడాయి. పీకల్లోతు నీళ్లు.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. కుండపోత వర్షంలో కుటుంబాలను కాపాడుకోలేని దుస్థితి. నదీ ప్రవాహంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారా అన్నట్లు.. ఎటు చూసిన నీటి ప్రవాహం. ఇది ఊహించని పరిణామమే కావచ్చు.. కానీ అంచనా వేయలేని పరిస్థితి కాదన్నది అందరు చెబుతున్న మాట.

రెండు రాష్ట్రాల్లోనూ ఆయా శాఖలు, విభాగాలు ఉన్నాయి. వాతావరణ శాఖ నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ నివేదికలు తయారు చేస్తుంది. వర్షం ఎప్పుడొస్తుందీ? ఎంత మేరకు వర్షం పడుతుంది? ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలి? అనే అంశాలు క్లియర్‌గా ఉంటాయి.

అలాగే, నదుల ప్రవాహం, నీటి పరిమాణం, దారి మళ్లింపులు, చెరువులు పరిస్థితులు వంటి విషయాలను పర్యవేక్షించడానికి పలు శాఖలు వాటి అధికారులు ఉంటారు. ముఖ్యంగా వానాకాలం వస్తుందంటే సంబంధిత శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

మరి ఏం జరిగింది? వీళ్లంతా ఏమై పోయారు? వాతావరణ శాఖ నివేదికలు తప్పయ్యాయా? నిపుణులు అంచనా వేయలేదా? అధికారులు నిర్లక్ష్యం వహించారా? తప్పు ఎక్కడ జరిగింది? .. బ్యూరోక్రాట్ల నిర్లక్యం.. అలసత్వం.. ఆమ్యామ్యాలే ఈ విప్తతుకు అసలు సిసలు కారణం.

ఏపీ సీఎం స్పందించినా…

నిజానికి పాలనలో అపార అనుభవం ఉండబట్టే సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం మద్యాహ్నం తన క్యాంప్ ఆఫీసులో వరదలపై సమీక్షలో.. ఏపీకి రాబోతున్న ఉపద్రవాన్ని పసిగట్టారు. మధ్యాహ్నం 2.00 గంటలకే కనక దుర్గమ్మ వారధి నుంచి కృష్ఱానది వరద దూకుడును అంచనా వేశారు. బుడమేరు పరిస్థితిని గుర్తించారు. అప్పటి నుంచి వరద తీవ్రత.. ప్రజల కష్టాలను అంచనా వేశారు. విజయవాడ కలెక్టరేట్ లో మకాం వేశారు.

కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరించారు. కేంద్రం కూడా అర్థం చేసుకుని రంగంలోకి దిగింది. కానీ వర్షం తగ్గినప్పటికీ వరద కష్టాలు మాత్రం ప్రజల్ని ఇంకా వదిలిపెట్టలేదు. ఆరు రోజులుగా నరకయాతన చూసిన ప్రజలు ఇప్పటికీ తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం కోసం తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. కనీసం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి కూడా సహాయక చర్యలు సరిగ్గా అందట్లేదని వాపోతున్నారు

.ఆఫీసర్లపై సీఎం ఫైర్

వరద పునరావస చర్యలపై సీఎం చంద్రబాబు అధికారుల్ని హెచ్చరించారు గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. మొద్దు నిద్ర వీడాలన్నారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు. పరిస్థితిని అంచనా వేయలేకపోయారు సరే.. కనీసం, సహాయక చర్యల్లో అయినా నిబద్ధతను చూపించమని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న అధికారుల తీరును ఎప్పటికప్పడు మంత్రులు పర్యవేక్షించాలని కోరారు

. కాగా.. కొంత మంది అధికారులు కావాలనే సహాయక చర్యలకు ఆటంకం కల్పిస్తున్నారని సీఎంకు ఫిర్యాదులు వెళ్లే పరిస్థితికి అధికారులు చేరుకున్నారు. అయితే, ఎవరు డ్యూటీలో ఉండగా సహాయక చర్యల్లో జాప్యం జరుగుతుందో వారిపై సీఎం చంద్రబాబు నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జక్కెంపూడిలో ఒక అధికారిని సస్పెండ్ చేయగా.. మంత్రుల్ని సైతం ఉపేక్షించేది లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి అధికారీ సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మానవతా దృక్పథంతో అధికారులు స్పందించాలి అన్నారు. మన కుటుంబసభ్యులే వరదల్లో చిక్కుకుంటే ఎలా రియాక్ట్ అవుతామో అలాగే స్పందించాలన్నారు.

చనిపోయిన వారి బాడీలను తీయకపోతే.. రేపు మనం చనిపోయినప్పుడు ఎవరు తీస్తారంటూ ప్రశ్నించారు. ఇది తీవ్రమైన సమస్య అని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులే కాదు, మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుంటూ అధికారులు నడుచుకోవాలని సూచించారు.

.ఈ అనుభవాలే ఇక గుణపాఠాలు భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారులపైనే ఉంది. ప్రభుత్వం ఆదేశాలిచ్చేది ఆయా శాఖల అధికారులు ఇచ్చే నివేదికలను బట్టే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ముందే మేల్కొనాల్సిన అవసరం ఉంది.

వాతరవణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. రహదారులు పరిరక్షణ, రవాణా సౌకర్యాలు, చెరువుల పర్యవేక్షణ, నదీ ప్రవాహాల అంచనాల విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా అది మరింత నష్టానికి దారితీసే పరిస్థితి ఉంటుందని అర్థం చేసుకోవాలి. గత అనుభావాల సమాచారం ఇప్పుడు లేదని చెప్పుకోడానికి అవకాశం ఉన్నా… ఇప్పటి అనుభావాల ప్రభావం ఎలాంటిదో చెప్పే సమాచారం పుష్కలంగా ఉంది. కనీసం, దీన్ని పరిగణలోకి తీసుకొని, రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తును తట్టుకునే ఏర్పాట్లు చేయాలి. దీనికి, ప్రతి అధికారీ నిబద్ధతతో పనిచేయాలి..

Advertisement

తాజా వార్తలు

Advertisement