ఏపీలో ఎన్నికల సమరం క్లైమాక్స్ దశకు చేరింది, బ్యాలెట్ బరిలో దిగిన యోధులు అస్త్ర శస్త్రాలు సంధిస్తున్నారు. అభ్యర్థులు తమ ప్రత్యర్థి బలం.. బలగాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడలు పన్నుతున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల దళపతులు ప్రచారంలో ఎక్కడా తగ్గటం లేదు. ఏ పార్టీ సభను చూసినా జనం హోరు.. జనం ఉప్పెన, జన జాతర, జన సునామీ.. జన కెరటాలు.. జనం పరవళ్లు తొక్కుతోంది. ఇలా అన్ని సభలకూ హాజరైన ప్రజాబలాన్ని వర్ణించడం ఎవరితరమూ కావడం లేదు. మేమంతా సిద్ధం, ప్రజాగళం, విజయభేరీ, న్యాయ్ యాత్ర పేర్లతో పార్టీల లీడర్లు కదం తొక్కుతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం మార్మోగిపోతోంది. పదాలు పదును తేలాయి. మాటల తూటాలు పేలాయి. సూటి ప్రశ్నల ఈటెలు గుండెల్లో గుచ్చుకొంటున్నాయి. సెటైర్లు మీసైల్స్‌లా దూసుకెళ్తున్నాయి. ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీల నేతలు గళం విప్పితే.. ఇప్పుడు జాతీయ నేతలు స్వరం పెంచారు. ఈ మాటల దాడి, ప్రతిదాడులు ఓటర్లపై ఎంత ప్రభావం చూపిస్తాయో గానీ.. మండు వేసవిలో ఎన్నికల వేడి నిప్పులు కురిపిస్తోంది. ఇక.. చివరాఖరిలో ఈసీ జోక్యం చేసుకుని తోక జాడించే అధికారులకు కళ్లాలను బిగిస్తోంది.
అందరి టార్గెట్ సీఎం జగన్
టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న ఎన్డీఏ
మిడిలార్డర్‌లో బౌన్స్‌లతో షర్మిల దాడి
అవినీతి అక్రమాల పేరిట ఆరోపణలు
టెయిలెండర్ దశలో ఈసీ దూకుడు
బ్యూరోక్రాట్లకు కళ్లెం.. తోక జాడిస్తే దబిడిదిబిడి
డీబీటీ స్కీమ్‌లన్నిటికీ టక్కునపడ్డ బ్రేకులు
ఆత్మరక్షణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
క్లైమాక్స్ దశకు చేరిన ఏపీ రాజకీయం
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారం ఈనెల 12వ తేదీతో ముగుస్తుంది. 13న పోలింగ్ జరుగనుంది. అంటే.. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ స్థితిలో అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష కూటమి (ఎన్డీఏ) , ఇండియా కూటమి నువ్వా నేనా అనే రీతిలో ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇప్పటి వరకూ తాను పంచిన నవరత్నాలతో జనాన్ని వైసీపీ అధినేత ఆకట్టుకుంటుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు ఎన్డీఏ, ఇండియా కూటములు గాలం వేస్తున్నాయి. అవినీతి, అక్రమాల ఆరోపణలు, వివేకా హత్యోదంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి విరుచుకు పడుతుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని అమరావతి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు తన చిన్నాన్న హత్య కేసు వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన అన్న సీఎం జగన్ దుమ్ము దులిపేస్తున్నారు.
ఎన్డీఏ దంచుదే దంచుడు..
టీడీపీ, జనసేనతో జత కట్టిన తొలి రోజుల్లో.. బీజేపీ అగ్రనేతలు సీఎం జగన్‌ని కార్నర్ చేయలేదు. అదే విధంగా వైసీపీ అగ్రనాయకులూ మాటవరసకూ బీజేపీ జోలికి వెళ్లలేదు. ఈ స్థితిలో బీజేపీ పొత్తుపై జనంలోనూ అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి. వైసీపీ గెలిచినా ఎన్డీఏకే మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఈ స్థితిలో ధర్మవరంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఎక్కడా అభివృద్ధి లేదని, కేవలం మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతేనని, పోలవరం ప్రాజెక్టు పనులను రెండేళ్లల్లో పూర్తి చేస్తామని వరాలు కుమ్మరించారు. ఇక ప్రధాని మోదీ సైతం స్వరాన్ని పెంచారు. ఏపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోషణలు సంధించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేశారని తూర్పారపట్టారు. ఈ ప్రచారంలో మోదీ, అమిత్ షా సంధించిన అంశాలపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వలేక చేతులెత్తేశారు.
బ్యూరోక్రాట్లకు దబిడి దిబిడి
ధర్మవరంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం ముగిసిన కొన్ని గంటల్లోనే ఏపీ పోలీసు బాసుపై ఈసీ వేటు పడింది. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రభుత్వానికి అనుకూల అధికారులకు కీలక శాఖలకు అప్పగించి, ముఖ్యమైన జిల్లాలకు మరికొందరిని బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక తమకు తిరుగులేదని వైసీపీ నాయకులు భావించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. కొందరు తస్మదీయ అధికారులపై ఈసీ వేటుకు దిగింది. దాదాపు డజనకు పైగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. కొందరికి పోస్టింగ్ ఇవ్వగా, మరికొందర్ని పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీస్ కమిషనర్లు, ఐజీ ర్యాంకు అధికారులు ఉన్నారంటే ఏపీలో జగన్ సొంత బలాన్ని బలహీన కూటమి యత్నాలు బయట పడగలవు. చివరకు వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది.
వైసీపీ ఓటు బ్యాంకుకు వాతలు
వివిధ సంక్షేమ పథకాలకు ప్రభుత్వ నిధుల విడుదలను ఈసీ అడ్డకుంది. వైఎస్సార్ చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం , జగనన్న విద్యాదీవెన , ఫీజు రీయంబర్స్‌మెంటు తదితర డీబీటీ పథకాలకు బ్రేకులు పడ్డాయి. పోలింగ్‌కు ముందే ఆర్థిక లావాదేవీలు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి మింగుడుపడలేదు. అప్పటికీ లబ్ధిదారులతో హైకోర్టులో పిటీషన్ వేయించింది. ఎలాగూ ఈ వివాదం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ తీర్పు రాదు. కానీ, ఈ సంక్షేమ పథకాలు నిలిచిపోవటానికి చంద్రబాబే కారణమనే ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లటమే వైసీపీ వ్యూహం.
ఇక సీఎం జగన్ ఎదురుదాడి..
మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఎన్డీఏ కూటమిపై జగన్ ఎదురు దాడి చేశారు. ఏపీలో ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం లేదని తన రోడ్ షోల్లో చెప్పారు. అమలులో ఉన్న సంక్షేమ పథకాల నిధులనూ అడ్డుకున్నారని దుయ్యబట్టారు. సిద్ధం సభల్లో కేవలం తాను చేసిన మంచి పనులనే జనానికి వివరించారు. మేమంతా సిద్ధం సభలో టీడీపీ, జనసేన నాయకుల్నే టార్గెట్ చేశారు. ఇక రోడ్ షోల్లో షర్మిలపై మాటల తూటాలు పేల్చారు. మేనిఫెస్టోపై విమర్శలు సంధించారు. కానీ, ధర్మవరంలో అమిత్ షా ప్రశ్నలకు సమాధానం ఇవ్వని జగన్.. రాజమండ్రిలో మోదీ సంధించిన అస్త్రాలతో చలించిపోయారు. తాజాగా కూటమిపై బాణాలు ఎక్కుపెట్టారు. తుప్పు పట్టిన సైకిల్ ఉదంతంపై సెటైర్లు పేల్చారు. కానీ, ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , పురందేశ్వరినే టార్గెట్ చేశారు. మోదీ, అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిస్పందన ఇవ్వక పోవటం విశేషం.