రోజు రోజుకూ పెరుగుతున్న నష్టం అంచానాలు
అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్
బుడమేరు ఉప్పొంగి బెజవాడ బేజారు
వరదలతో ఇప్పటికే 46 మంది మృతి
ఆస్తి, మౌలిక వసతుల నష్టం ₹8000 కోట్లకు పైగానే
తాజాగా ఉత్తరాంధ్ర అతలాకుతలం
వానల దెబ్బకు ధ్వంసమైన రహదారులు
వేలాది ఎకరాల పంట పొలాలు నీటి పాలు
ఏలేరు వరదతో కాకినాడ జిల్లాకు నష్టం ముప్పు
మొత్తంగా 4.90 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
నష్టం అంచనాల్లో తలమునకలైన అధికారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్: పది రోజులు వ్యవధిలో ఏపీలోని పద్నాలుగు జిల్లాలను పకృతి వైపరీత్యం దెబ్బతీసింది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలపై మున్నేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ విరుచుకు పడితే.. ఈ ఏర్లన్నీ ఇప్పుడు కొల్లేరును చుట్టుముట్టాయి. ఇక బుడమేరు, మున్నేరు వరద తాకిడి నుంచి బయట పడిన జనం.. వరదల్లోంచి ఎలా బయటపడతామో? బతుకులు గడిచేది ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇప్పుడు వరద తగ్గిందని ఆనందం కంటే.. అయ్యో ఎలా కోలుకుంటామని అల్లాడిపోతున్నారు. కళ్ల ముందే గూళ్లు చెదిరిపోయాయి. పొలాలు నీట మునిగాయి. పెంచుకున్న పశువుల మృతకళేబరాలు కనిపిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభాలు ఇళ్లపై కూలాయి. బెజవాడలో ఇప్పుడిప్పుడే జనం ఆకలి వెతల నుంచి కోలుకొంటున్నారు.
ఉత్తరాంధ్రకు వరద పోటు..
బెజవాడ కోలుకుంది అనుకునే సమయంలోనే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై వరద పోటెత్తింది. భారీ వర్షాలకు వరద నీరు ఉప్పొగండంతో రిజర్వాయర్ల గేట్లు తెరుచుకున్నాయి. వీటిల్లోని నీరు నదులకు ఎగబాకుతున్నాయి. ఈ సీజన్ లో కుంభ వృష్టి కురిసింది. తేరుకున్న తరుణంలో అపార నష్టం పలకరిస్తోంది. ఏపీలో ప్రస్తుతం వాన తెరిపించింది. వరద ప్రభావమూ తగ్గుముఖం పడుతోంది. ఇక అంతులేని నష్టం వెలుగు చూస్తోంది. వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది.
వరదల నష్టంపై సర్కారు ప్రాథమిక అంచనా..
భారీ వర్షాలు.. వరదలతో దెబ్బతిన్న తీరుపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. దీని ప్రకారమే ₹6,882 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు కేంద్రానికి ప్రభుత్వం నివేదిక అందజేసింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతున్న తరుణంలో.. లెక్కతేలుతున్న నష్టాల వివరాలు ఇంకా అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 46మంది చనిపోయారు. వ్యవసాయ, ఆస్తి నష్టం అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ప్రతి ఇంటికీ జరిగిన నష్టాన్ని లెక్కేస్తే వరద నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 4.90 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 49 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 200 ఎకరాల్లో సెరీ కల్చర్‌కు నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.
వేల కిలోమీటర్ల మేర రోడ్లకు దెబ్బ..
ఏపీలో మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 4,203 కిలో మీటర్ల మేర స్టేట్ హైవేస్ దెబ్బ తిన్నాయి. పంచాయతీల పరిధిలో 1,160 కిలో మీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలో మీటర్ల మేర రోడ్లు
ద్వసం అయ్యాయి. 540 పశువులు మృత్యువాత పడ్డాయి. 11 కేవీ లైన్లు తెగిపడ్డాయి, 76 సబ్ స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, 1,668 11 కేవీ ఎలక్ట్రిక్ పోల్స్ వరదలకు దెబ్బతిన్నాయి. బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. మొత్తంగా 405 చోట్ల కాల్వలకు, చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు గుర్తించారు.
ఇక ఏలేరు వంతు …
ఒక వైపు తాండవ నది, మరో వైపు శుద్ధ గడ్డ విరుచుపడటంతో ఏలేరు కాల్వలకు గండి తప్పలేదు. ఫలితంగా గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత దూకుడు పెరిగింది. వరద కారణంగా ఇప్పటికే 25 వేల ఎకరాలు నీట మునిగాయి. మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి.
కాకినాడ జిల్లాకు తీరని నష్టం..
గొల్లప్రోలు పట్నంలోని మార్కండేయపురంలోకి ఏలేరు వరద నీరు ప్రవేశించాయి. గొల్లప్రోలు పట్టణ శివారులో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై కూడా ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. గొల్లప్రోలు పట్టణ శివారులోని వేరుశెనగ మిల్లులోకి వరద నీరు ప్రవేశించింది. ఏలేరు ఒకవైపు .. శుద్ధ గడ్డ మరోవైపు ముంచెత్తడంతో పంట పొలాల్లో భారీగా ముంపుపెరిగింది. గొల్లప్రోలు జగనన్న కాలనీ సూరంపేటలకు వెళ్లే రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ స్థితిలో ఏలేరు వరదతో కాకినాడ జిల్లాలకు తీరని నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు.