Thursday, November 21, 2024

Exclusive – శుభ శకునాల దరహాసం… చంద్రహాసం!

కష్టకాలాన్ని అధిగమించిన చంద్రబాబు
కూటమితో కొత్త బలం… బలగం
పవన్‌ మిత్రధర్మం కొండంత శక్తి
రాజకీయ ప్రతీకారాలకు దూరం
కూటమి కార్యకర్తలకు హితోపదేశం
తగ్గిన రాజకీయ ఉద్రిక్తతలు… ఉద్వేగాలు
కేంద్రంలో కలిసొచ్చిన ప్రాధాన్యత
వెూడీ నుంచి సానుకూల స్పందనలు
కేంద్ర బడ్జెట్‌ ద్వారా కొత్త సంకేతాలు
రాష్ట్ర ప్రాజెక్టులకు శుభఘడియలు
ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం
చంద్రబాబుకు అమృత ఘడియలు
సుపరిపాలనకు సదవకాశం
చరిత్రలో నిలిచిపోయే శుభపరిణామం
వచ్చే ఐదేళ్లు స్వర్ణయుగం కావాలని ఆకాంక్ష

కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందని సామెత… ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఇది కాలం చెల్లిన సామెతగా మారిపోయింది. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడని మరో సామెత.. సీఎం చంద్రబాబు విషయంలో
ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తున్నది.

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి, అమరావతి, ఆంధ్రప్రభ)

జూన్‌ 12న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి రాష్ట్రంలో రాజకీయ, సామాజిక సానుకూల పవనాలు వీస్తున్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. తిరుగులేని విజయం తాలూకు ఉద్వేగ భావనలు ఇంకా తగ్గకపోగా రోజురోజుకి అవి సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ప్రజలు తమ ఇష్టానుసారం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రభుత్వాధినేత విషయంలో ఆమాత్రం ముందస్తు అంచనాలు అధికంగా ఉండటం సహజమే. దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి తాము అనుకున్న రీతిలో ప్రాధాన్యతా అంశాలపై అడుగులు వేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం మీద, రాష్ట్ర అస్తిత్వానికి చిహ్నంగా నిలిచే అమరావతి రాజధాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వేగిరంగా పునర్నిర్మాణం దిశగా చర్యలకు ఉపక్రమించడం కూడా పెద్ద ఉపశమనంగా వారిలో సంతృప్తి వ్యక్తమవుతున్నది.

ఆరు నెలల క్రితం పరిస్థితి ఒక చీకటి అధ్యాయం అనుకుంటే ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామాలు చంద్రబాబుకు అన్నీ శుభశకునములే అన్నట్టు మారాయి. బలమైన శక్తిగా పవన్‌కల్యాణ్‌ చేతులు కలపడం ద్వారా చంద్రబాబుకి రాజకీయ నైతిక బలం సమకూరినట్టయింది. తదనంతరం బీజేపీ మద్దతు కూడగట్టడం లో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించడంతో కూటమికే కాకుండా ముఖ్యంగా కూటమి సారథి చంద్రబాబుకి తిరుగులేని రాజకీయ శక్తి సమకూరినట్టయింది. అసెంబ్లిd, లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో చంద్రబాబు మరోసారి తన రాజకీయ వ్యూహాత్మక శక్తి యుక్తులు ఇంకా ఆవిరి కాలేదని నిర్మాణాత్మకంగా చెప్పినట్టయింది.

- Advertisement -

ఎన్నికల విజయం రాష్ట్రంలో చంద్రబాబుకి సరికొత్త సాధికారి తను కట్టబెట్టగా, కేంద్రంలో తిరుగులేని ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా దగ్గర నుంచి కేంద్ర అమాత్యులు..ఆమాటకొస్తే యావత్‌ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిందనడానికి ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలే తార్కాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యతల్లో అనేకం కేంద్ర బడ్జెట్‌లో స్ధానం సంపాదించాయి. ముఖ్యంగా పోలవరం నిర్మాణం తమ బాధ్యతే అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనకు విశేష ప్రాధాన్యత ఉంది. గత అయిదేళ్లలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు వెళ్లలేకపోయింది. పైపెచ్చు నిర్మాణపరంగా అదింకా కుంచించుకు పోయింది. మళ్లిd చంద్రబాబు పాలనలో కేంద్రం తనంత తానుగా పోలవరాన్ని తలకెత్తుకుని ముందుకు పోయేందుకు పెద్ద భరోసా ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటగానే భావించాలి.

అలాగే అమరావతి రాజధాని నిర్మాణంపై కేంద్రం వాస్తవిక దృక్పథంతో ఉన్నదని స్పష్టమైంది. పదిహేను వేల కోట్ల రూపాయల సాయం అందుబాటులోకి తెచ్చేందుకు ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప నైతిక బలమిస్తున్నది. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇదెంతైనా శుభసూచికంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ అభివృ ద్ధికి, విద్యుత్‌, వాటర్‌, రోడ్లు తదితర రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏమి అడిగినా చేసేందుకు సిద్దంగా ఉన్నామని సాక్షాత్తూ నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన విషయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అది కేవలం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనగా చూడటం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన అభయంగా భావించాల్సి ఉంటుంది. గత అయిదేళ్ల లో ఎలాంటి హామీలు గాని, భరోసాలు గాని మృగ్యమైన పరిస్థితు ల్లో రాష్ట్రం ఎడారిగా మారిన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ రూపంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇది చంద్రబాబు రాజకీయ దౌత్యానికి నిలువుటద్దంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

పదవీ బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు ఢిల్లిd వెళ్లి ప్రధానమంత్రి మోడీని కలిసి రాష్ట్రావసరాలను నివేదిక రూపంలో ఇచ్చి రావడం, వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రుల్ని కలిసి తన మనోభావాలను వారి ముందుంచడం కలిసొచ్చిందన్న అభిప్రా యం వ్యక్తమవుతున్నది. కేంద్రబడ్జెట్‌కు ముందుగా కేంద్రానికి రాష్ట్ర ప్రతిపాదనలు సమర్పించడాన్ని చంద్రబాబు దార్శనికతకు దర్పణంగా వారు చెబుతున్నారు.


చంద్రబాబుకి కలిసొచ్చిన మరొక ముఖ్యమైన అంశం..కూటమి భాగస్వాములు ఆయనకు పెద్దపీట వేసి ఆయన అడుగుజాడల్లో నడవడం. సంకీర్ణ మనగానే సహజంగానే లుకలుకలకు నెలవు అన్న సాధారణ అభిప్రాయం ఉంది. కాని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం..పేరుకే కూటమి ప్రభుత్వం గాని ఏకపార్టీ ప్రభుత్వమన్నంతగా ఒకే మాట-ఒకే బాటగా సాగుతున్నది. ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు రాజకీయ, పాలనానుభవానికి, దార్శనికతకు ఇస్తున్న గౌరవం అందర్నీ విస్మయానికి గురి చేస్తున్నది. చంద్రబాబుకి ఆయన ఇస్తున్నంత నైతిక మద్దతు మరే సంకీర్ణంలోనూ మరెవ్వరూ ఇచ్చి ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇది చంద్రబాబుని మరింత శక్తిమంతుడిగా చేస్తున్నది. వైసిపి పాలనలో తమ కేడర్‌ మీద జరిగిన అరాచకాలకు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒత్తిళ్లు మూడు పార్టీల్లోనూ వ్యక్తమవుతున్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీకార దాడులను సహించబోనని నిర్మొహమాటంగా చెప్పడం, దాన్ని పవన్‌ కల్యాణ్‌ శిరోధార్యంగా భావించి అసెంబ్లిd సాక్షిగా తమ కేడర్‌కి అదే మాట స్పష్టం చేయడం విశేషం. అంతేకాదు. తమ పార్టీ నుంచి అలాంటి ప్రతీకార దాడులకు అనుమతివ్వబోనని, మీ మాటే ఫైనల్‌ అని అసెంబ్లిdలోనే ప్రకటించడం ద్వారా పవన్‌ కల్యాణ్‌ మిత్రధర్మానికి సరికొత్త నిర్వచనం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రంలో ప్రధాని మోడీ సంకీర్ణ ధర్మంలో భాగంగా చంద్రబాబు-పవన్‌ ద్వయానికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో, రాష్ట్రంలోనూ పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు అదే రీతి గౌరవం, ప్రాధాన్యత ఇస్తూ సంకీర్ణ రాజకీయాల్లో సౌమనస్య వాతావరణాన్ని పాదుగొల్పుతున్నారని ప్రజలు గుర్తించారు. ఇదొక ఎత్తయితే, అరాచకాలు, హింసాకాండపై చట్టబద్దంగానే వెళ్లాలని, దాడులకు ప్రతీకార దాడులు పరిష్కారం కాదని చంద్రబాబు పదేపదే చెప్పడం రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతాలనిస్తున్నది. దాడులు.. ప్రతీకార దాడులు..అందుకు మళ్లిd ఎదురుదాడులు..ఇలా నిరంతర నిర్విరామ అశాంతికర పరిస్థితులు ఉండబోవన్న భరోసా చంద్రబాబు మాటల్లో తమకు లభిస్తున్నదని సామాన్య పౌరులు భావిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సగటు రాజకీయ నాయకుడిలా కాకుండా రాజకీయ స్థితప్రజ్ఞుడిలా వ్యవహరిస్తున్నా రని సామాన్య ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పంథా కొనసాగితే రానున్న అయిదేళ్లు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణ యుగమేనని సకల జనులు విశ్వసిస్తున్నారు.

జూన్‌ 12న చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజుల్లో ఉన్న కంటికి కన్ను-పంటికి పన్ను తరహా ఉద్రిక్త భావాలను కార్యకర్తల నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల నుంచి దూరం చేయడంలో అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కల్యాణ్‌ కృతకృత్యులయ్యారు. హింసకు పాల్పడితే ఎంతటి నేతలైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు పదేపదే ప్రకటించడం..కీలక భాగస్వామిగా పవన్‌ కల్యాణ్‌ అందు కు సంపూర్ణ మద్దతు పలకడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్వేగ భావా లు చల్లబడ్డాయి. ఈ పరిస్థితి సామరస్య పాలనకు, శాంతిభద్రతల పరిరక్షణకు పూచీగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం వైపు పూర్తి సమయం కేటాయించి రాష్ట్రాన్ని సరికొత్త దిశలో నడిపించేందుకు దోహదం చేస్తుంది. రానున్న అయిదేళ్ల పాలనపై ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తమతమ అంచనాలకు వస్తున్నారు. చంద్రబాబు-పవన్‌ మిత్రద్వయం మూడోపక్షమైన బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను శిఖరసమానంగా చేస్తారని నిండు శ్వాసతో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏతావాతా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమృత ఘడియలు నడుస్తున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.

డెబ్బయ్‌ నాలుగేళ్ల వయస్సులో తనకొచ్చిన ఈ సదవకాశాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకోవడానికి కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సద్విని యోగం చేయాలన్న ఆకాంక్షతో చంద్రబాబు ఉన్నట్టు వివిధ సంద ర్భాల్లో ఆయన మాటల ద్వారా వ్యక్తమవుతున్నది. తన అపార అనుభవం ఇప్పటికే తనకు తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టిన నేపథ్యంలో ప్రజలే లక్ష్యంగా తన ప్రతి అడుగు పడుతుందని ఆయన భరోసా ఇస్తున్నారు. ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్‌ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే క్రమంలో..తన రాజకీయ చరిత్రలో దీన్నొక కీలక ఘట్టంగా మలుచుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement