Thursday, November 28, 2024

Exclusive – క‌డ‌ప‌లో ‘చెత్త’ పాలిటిక్స్

మేయర్​ వర్సెస్​ ఎమ్మెల్యే
పట్టణంలో టెన్షన్ టెన్షన్
మేయర్ ఇంటి ఎదుట చెత్త డంప్
అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన మేయర్ సురేష్ బాబు
ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం
అడ్డుకున్న పోలీసులు.. భారీ పోలీస్ బందోబస్తు

( ఆంధ్రప్రభ స్మార్ట్, కడప బ్యూరో) : కడపలో చెత్త సేకరణ వివాదం హై టెన్షన్ కు దారి తీసింది. నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి రెడ్డి మధ్య రగిలిన వివాదం కాస్త ముదిరి ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు దాడులకు దిగారు. ఎమ్మెల్యే మాటలకు కట్టుబడిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు జనంతో కలసి మంగళవారం మేయర్ ఇంటి వద్ద చెత్త వేయడంతో నగరంలోని చిన్న చౌక్ ప్రాంతంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. త‌న ఇంటి ఎదుట చెత్త వేయ‌డాన్ని నిరసిస్తూ మేయర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆందోళ‌న‌కు దిగారు. ఆయ‌న‌కు మద్దతుగా కార్పొరేటర్లు కూడా పోలీస్ స్టేషన్ కు తరలిరావడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. మరో వైపు మేయర్ సురేష్ బాబుని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, నేతలు చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. మరోవైపు తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా గుమికూడ‌టంతో అక్క‌డ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

చెత్త రగడ రగిలిందిలా…
కడప నగరంలో చెత్త సేకరణపై మూడు రోజులుగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి- నగర మేయర్ సురేష్ బాబు మధ్య వివాదం ప్రారంభమైంది. ఇంటింటికి చెత్త సేకరణకు వెళ్లే వాహనాలను కార్పొరేషన్ అధికారులు నిలిపివేయడంతో ఈ అంశాన్ని కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మాధవి రెడ్డి ఇంటింటికి చెత్త సేకరణను చేపట్టకపోతే.. ఆ చెత్తను తీసుకెళ్లి మేయర్ ఇంటి ముందు వేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఉద్దేశంతోనే మేయర్ చెత్త సేకరణను నిలిపి వేయించారని ఆరోపించారు. అయితే తాము ఉద్దేశపూర్వకంగా సేకరణ నిలిపివేయలేదని, వాహనాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు భరించ లేకనే వాహనాల సంఖ్యను కుదించామని మేయర్ సురేష్ బాబు సోమవారం మీడియా సమావేశంలో వివరించారు. ప్రభుత్వ ఆదేశం మేర‌కు ప్రజలు చెత్త బిల్లులు చెల్లించడం లేదని, ఫలితంగా మూడు నెలలుగా బిల్లుల వసూళ్లు ఆగిపోయాయని, దీంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేకున్నామని మేయర్ స్పష్టం చేశారు.

మేయర్ ఇంటి ఎదుట చెత్త డంప్
కొంతమంది టీడీపీ కార్యకర్తలు మంగళవారం ప్రజలతో కలిసి వెళ్లి చిన్నచౌక్ లోని మేయర్ సురేష్ బాబు ఇంటిలోకి చెత్తను విసిరి వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని మేయర్ కు చేరవేయడంతో పాటు చెత్త వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం ప్రారంభమైంది. పోలీసులు కూడా భారీగా మేయర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. సమీపంలోని పారిశుద్ధ్య కార్మికులు సైతం వెంటనే సురేష్ బాబు ఇంటి వద్దకు చేరుకుని చెత్త తొలగింపును చేపట్టారు. మేయర్ కూడా వెంటనే కొంతమంది అనుచరులతో కలిసి ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి గమనించి అక్కడి నుంచి పాదయాత్రగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ పాదయాత్రలో స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున రావడంతో పోలీస్ స్టేషన్ ఎదుట దీక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్టేషన్ గేటుకు తాళం వేసి మేయర్ ను అడ్డుకున్నారు. దీంతో ఆయన స్టేషన్ గేటు వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న కొంతమంది కార్పొరేటర్లు హుటాహుటిన పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఎమ్మెల్యే ఇంటి వద్ద ధర్నా చేయాలని అక్కడి నుంచి మేయర్, కార్పొరేటర్లు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందనే ఉద్దేశంతో పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ కు అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మేయర్ సురేష్ బాబును అదుపులోకి తీసుకొని స్టేషన్ లోపలికి తరలించారు. ఆయనతో పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఆయన సానుకూలంగా స్పందించి వెనుతిరగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ బందోబస్తు..

వైసీపీ కార్యకర్తలు ద్వారకా నగర్ లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ భారీగా మొహరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టిడిపి కార్యకర్తలను కూడా పోలీసులు చెదరగొట్టారు. ఎటువంటి వివాదము.. ఘర్షణ చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఏ క్షణమైనా వైసిపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వైపు వెళ్లే రహదారిని నిర్బంధించారు. కాగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చెత్త వివాదం కాస్త కడప నగరంలో ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement