ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ :ఏపీలో రాజకీయ వివాదాలకు ఫ్లై యాష్ కేంద్ర బిందువుగా మారింది. లీడర్లకు ప్రధాన వనరుగా.. ఇదే ధనాధారం కావడంతో తగ్గేదే లేదంటున్నారు పలువురు లీడర్లు. వైసీపీ, కూటమి నేతల మధ్య సైలెంట్ వార్ సృష్టిస్తున్న ఫ్లై యాష్ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం పిలుపుతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మరో నేత భూపేష్‌రెడ్డి సచివాలయానికి వచ్చి భేటీ అయ్యారు. జ్వరం వల్ల రాలేనని జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది.
ఇక.. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదం కారణంగా కూటమి ప్రతిష్ట దెబ్బతింటుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఫ్లై యాష్ ఎలా వస్తుంది..ఏపీలో ప్రధాన థర్మల్ కేంద్రాలు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ , రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ -కృష్ణపట్నం.. తదితర థర్మల్ పవర్ స్టేషన్లలో మొత్తం 5,010 మెగావాట్ల విద్యుదుత్పతి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఇందుకు విజయవాడ ఎన్టీటీపీఎస్‌కు రోజుకి 24,600 టన్నుల బొగ్గు కావాలి. ఆర్టీపీపీకి రోజుకు 21000 టన్నులు, దామోదరం సంజీవయ్య పవర్ స్టేషన్‌కి రోజుకు 13,600 టన్నుల బొగ్గు కావాలి. అంటే ప్రతి రోజూ 55000 టన్నుల బొగ్గును కాలిస్తే 5010 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. సుమారు 19000 వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుంది.
విద్యుదుత్పత్తి చేసే థర్మల్ పవర్ స్టేషన్లో ఒక టన్ను బొగ్గును కాలిస్తే 350 కిలోల బూడిద మిగులుతుంది. ఈ బూడిదే బంగారమై పోతోంది. సిమెంటు తయారీలో వినియోగం.. భవన నిర్మాణ రంగంలో కీలకమైన ఈ సిమెంటు ఉత్పత్తిలోనూ థర్మల్ పవర్ స్టేషన్ ఫ్లైయాష్ ఎంతో అవసరం. సిమెంటు తయారీ ఖర్చును తగ్గిస్తుంది. అందుకే సిమెంటు కంపెనీలు బారులు తీరుతాయి..
ఇంతకీ సిమెంటు ఉత్పత్తిలో ఫ్లైయాష్ పాత్ర ఏమిటి? సిమెంట్ అత్యంత గిరాకీ కావటంతో ఫ్లై యాష్ మిశ్రమంతో సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది. ఫ్లై యాష్ స్లాగ్ సాధారణంగా పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కంటే 18 శాతం చౌకగా లభిస్తాయి. సిమెంటు మిక్స్‌లో 20 శాతం ఫ్లై యాష్ ఉన్నప్పుడు, ఇది ఉత్పత్తి ఖర్చులో 3.5 శాతం ఆదా అవుతుంది. అందుకే సిమెంటు ఫ్యాక్టరీలు ఫ్లైయాష్ కోసం బారులు తీరుతాయి.
ఉచితంగా తీసుకెళ్లే చాన్స్..
థర్మల్ పవర్ స్టేషన్ ల్లో బొగ్గు వినియోగంలో మూడోవంతు పరిణామంలో బూడిద ఉత్పత్తి అవుతుంది. ఈ బూడిదను ప్రత్యేక కొలనుల్లో పవర్ ప్లాంట్ యాజమాన్యాలు నిల్వ చేసుకోవాలి. 20 శాతం బూడిదను రిజర్వు చేసి .. మిగిలిన బూడిదను వదిలించుకోవాలి. ఉచిత మంత్రంతో ఫ్లైయాష్‌ను వివిధ అనుబంధ కంపెనీలకు ఇచ్చేవి. ఈ స్థితిలోనే బ్రిక్స్ ఇండస్ర్టీ పుంజుకుంది. కానీ థర్మల్ పవర్ స్టేషన్లు సంఖ్య పెరిగే కొద్దీ ఫ్లైయాష్ కొండలు అవతరిస్తున్న తరుణంలో.. పర్యావరణానికి విఘాతం అనివార్యమైంది.
ప్రతి ప్లాంటు 100 శాతం యాష్‌ను సద్వినియోగం చేయాలని, లేనిపక్షంలో టన్నుకు రూ.1,000లు పరిహారం చెల్లించాలని 2021 డిసెంబరు 31న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో తమ బూడిదను ఉచితంగా తీసుకువెళ్లాలని కంపెనీల వెంట పడ్డాయి.
బూడిదపై అదానీ మార్క్.. టన్ను బూడిద ₹3400
థర్మల్ పవర్ ప్లాంట్ లో విడుదలయ్యే బూడిదనూ అదానీ కంపెనీ ఆదాయ వనరుగా మార్చుకుంది. దేశంలో అత్యధికంగా అదానీ సంస్థకే పవర్ ప్లాంట్లు ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్.. ఇలా 8 చోట్ల 13,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి సుమారు 1.5 కోట్ల టన్నుల ఫ్లైయాష్ వస్తోంది. ఈ బూడిదను ఉచితంగా ఇవ్వడానికి అదానీ కంపెనీ ఒప్పలేదు. దాంతో కేంద్ర ఇంధన శాఖను ప్రభావితం చేసి ఓ సలహా ఇప్పించింది. దేశంలోని ప్రతి థర్మల్ పవర్ ప్లాంటు ఫ్లైయాష్‌ను ఎవరికీ ఉచితంగా ఇవ్వవద్దని, టెండర్ ప్రాసెస్‌లో విక్రయించాలని, ఒకవేళ బూడిద మిగిలితే ఉచితంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇప్పించింది.
అంతే బూడిద ధర మార్కెట్ తెర మీదకు వచ్చింది. టన్ను బూడిద ధర 15 డాలర్లు (₹1200లు) నిర్ణయించారు. బ్రిక్ పరిశ్రమలు బిక్క చచ్చిపోయాయి. ఇప్పుడు టన్ను బూడిద ధర ₹3400లకు చేరింది. ఎన్జీటీ వద్దంటే.. సుప్రీంకు వెళ్లిన అదానీఫ్లైయాష్‌ను వ్యాపారంగా మార్చిన ఇంధన శాఖ నిర్ణయంపై ఏపీకి అమరావతి ఫ్లైయాష్ బ్రిక్ తయారీదారుల అసోసియేషన్ సహా మరికొన్ని అసోసియేషన్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎవరైతే కాలుష్యం సృష్టిస్తారో వారే దాని వ్యయం భరించాలనేది ప్రాథమిక సూత్రమని, అటవీ పర్యావరణ శాఖ కూడా అదే చెబుతోందని పిటిషన్ దాఖలు చేశారు. ఈ లెక్కన ఫ్లైయాష్ కాలుష్య కారకం కాబట్టి.. దాన్ని వదిలించుకునే వ్యయాన్ని పవర్ ప్లాంట్లే భరించాలి. ఉచితంగానే ఇవ్వాలని, డబ్బులు వసూలు చేయకూడదని కోరాయి. ఇది న్యాయసమ్మతంగా ఉందని భావించిన ఎన్జీటీ.. ఇంధన శాఖ సలహాను పాటించాల్సిన అవసరం లేదని, దాన్ని అబయెన్స్‌లో పెడుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
దాంతో అదానీ సంస్థలు గిలగిలలాడి.. ఇంధన శాఖను సుప్రీం కోర్టుకు పంపింది. అక్కడ ఎన్జీటీ ఆదేశంపై స్టే లభించింది. దేశవ్యాప్తంగా అన్ని సంస్థలు ఫ్లైయాష్‌కు టెండర్లు ఆహ్వానించాయి. సిమెంటు ఫ్యాక్టరీలు, బ్రిక్స్ కంపెనీలు థర్మల్ పవర్ స్టేషన్లకు క్యూకట్టాయి.
జగన్ సర్కారు హయాంలో..
రాజకీయ నాయకులు బూడిదను సిరులు పండించే పంటగా మార్చేశారు. ఉచిత బూడిదను అమ్ముకుని కోట్లు గడించారు. రాజకీయ పార్టీలన్నీ బూడిదకు క్యూకట్టాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నాయకులు బూడిద సామ్రాట్టులుగా అవతరించారు. ఇబ్రహీపట్నం నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఇలాఖాలో పాతికేళ్లుగా ఇదే వ్యాపారం జరుగుతోంది. గత ప్రభుత్వ పాలనలో మరింత జోరుగా సాగింది. ఇక్కడ సొంతపార్టీ నేతల మధ్యే జగడం జరిగింది. ఇదే స్థితి ప్రస్తుతం రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో తెరమీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పెద్దారెడ్డి సిమెంటు పరిశ్రమలకు బూడిదను సరఫరా చేశారు.
ఇప్పుడు జేసీ వర్గం దందా.. చంద్రబాబు సీరియస్
తాజాగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బూడిద రవాణా ప్రారంభించారు. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే నేనే లోకల్.. నాదే హక్కు నినాదంతో ఆదినారాయణరెడ్డి బూడిద తోలకం ప్రారంభించారు. అంతే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంటు పరిశ్రమలకు వెళ్లకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఫ్లైయాష్ వివాదం ఎట్టకేలకు సచివాలయానికి చేరింది.
సీఎం చంద్రబాబు పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. జ్వరం వల్ల రాలేనని జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారం అందించారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదం కారణంగా కూటమి ప్రతిష్ట దెబ్బతింటుందని ఇప్పటికే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.