Friday, September 20, 2024

Exclusive – దోస్తుల మధ్య డెడ్లీ డీల్​! మిస్ట‌రీగా ఆత్మ‌హ‌త్య‌..

అక్వా ఎగుమతుల పేరిట బిజినెస్​
తొలుత లాభాలు, ఆ తర్వాత భారీ నష్టాలు
బయటపడేందుకు ఆత్మహత్య నాటకం
ఆంధ్రా పోలీసలకు సవాల్​గా మారిన కేసు
మిస్టరీ కేసులో తెరమీదకు నాగేంద్ర
ఇతను కంటికి కనిపించని కల్పిత బినామీనా?
కంపెనీ చిరునామాగా భీమ‌వ‌రం
అతడి అడ్రస్సు మాత్రం గల్లంతు
సృష్టికర్త ఎవరు? జవాబు లేని ప్రశ్నలెన్నో
మధు, చంద్రశేఖర్​పైనే అనుమానాలు
ఆధారాల సేకరణలో పోలీసులు ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రప్రభ స్మార్ట్, ఏపీ క్రైం బ్యూరో : కృష్ణాజిల్లా పోలీసులు ఎదుర్కొంటున్న కేసుల దర్యాప్తు ప్రక్రియలో ఈ కేసు ఏపీలోనే సంచలనాత్మకంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏంపీడీవో ఆత్మహత్యలో కీలక ఆధారాల సేకరణలోనూ… ఆత్మహత్య చేసుకున్న ఎంపీడీవో మృతదేహం జాడను కనిపెట్టటంలో.. కృష్ణా పోలీసు యంత్రాంగం ఎంతో సమయస్ఫూర్తి ప్ర‌ద‌ర్శించింది. దర్యాప్తు పురోగతిలో విజయం సాధించింది. ఇక.. అసలు ఆధారాల సేకరణలో నిమగ్నం కాగా, తాజాగా మరో మిస్టరీ యావత్ ఏపీ ప్ర‌జ‌ల్లో కలకలం రేపింది. కృష్ణాజిల్లా పెడన మండలం లంకల కలవ గుంటకు చెందిన జోగి నాగ వరప్రసాద్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మ‘హత్య’ కేసు మరింత సంచలనంగా మారింది.

- Advertisement -

ఈ అనుమానస్పద ఆత్మ‘హత్య’ అంతు తేల్చటానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలతో ఈ ఆత్మహత్య ముడిపడటంతో.. అసలు నిజమేంటీ? అనే అంశంపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అప్పుల బాధతోనే వరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఆర్థిక వ్యథలను తప్పించుకునే ప్రయత్నం చేశాడా? లేక .. భాగస్వామ్యులే పక్కా ప్లాన్‌తో ఆత్మహత్యను అంటగట్టారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరప్రసాద్‌తో పాటు ఆత్మహత్యకు యత్నించిన మరో టెకీ మునగాల చంద్రశేఖర్ అదృశ్యంతో.. ఈ కేసు అనేక కీలక మలుపులు తిరుగుతున్నట్టు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు వరప్రసాద్, చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు సేకరించారు. ఈ లేఖలోని సారాంశానికి, బయట ప్రపంచంలో ప్రచారానికి ఎక్కడా పొంతన కనిపించటం లేదు.

రొయ్య‌ల ఎగుమ‌తితో లాభాలు..

వరప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం నిజామాబాద్ పట్టణానికి చెందిన మునగాల చంద్రశేఖర్ భాగస్వామ్యంతో 17 నెలల కిందట వీరిద్దరూ ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారంలోకి దిగారు. ఈ వ్యాపారానికి కేరళకు చెందిన వ్యక్తి నుంచి పెట్టుబడిగా అప్పు తీసుకున్నారు. వడ్లమన్నాడుకు చెందిన జంగం మధును తమ ఎగ్జిక్యూటివ్‌గా తీసుకుని వ్యాపారం మొదలు పెట్టారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గాల్లోని చెరువుల్లో రొయ్యలను కొనుగోలు చేసి మెరైన్ కంపెనీలకు ఎగుమతి ప్రారంభించారు. భీమవరం పట్టణంలోని షిప్ట్ మెరైన్ కంపెనీ, ఒంగోలు లోని సదరన్ మెరైన్ కంపెనీకి రొయ్యలు విక్రయించారు.

ముదినేప‌ల్లి మండ‌లంలో ప్రాసెసింగ్ యూనిట్‌..

అంతేకాకుండా ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో కర్షక్ మాలపల్లిలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అకస్మాత్తుగా టర్నోవరు దెబ్బతింది. పెట్టుబడి పెట్టిన కేరళ వ్యక్తికి బకాయి పెరిగింది. ఇలా ఎందుకు జరిగిందో? ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అయితే.. వరప్రసాద్, చంద్రశేఖర్ ఆర్థిక లావాదేవీల్లో నాగేంద్ర అనే వ్యక్తి కీలకమయ్యాడని, అతడే సొమ్ము చెల్లించకుండా తమకు ద్రోహం చేశాడని వీరిద్దరూ తమ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ నాగేంద్ర ఎవరని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భీమవరం షిప్ట్ కంపెనీ ప్రతినిధిగా ఈ లేఖలో పేర్కొనటంతో.. అక్కడకు వెళ్లి ఆరా తీస్తే.. నిజంగానే నాగేంద్ర ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ నాగేంద్రకు ఈ టెకీ ద్వయానికి సంబంధం లేదని షిప్ట్ కంపెనీ తేల్చింది. అంటే నాగేంద్ర అనే బినామీ వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందెవరు?

ఆత్మ‘హత్య’లో అనుమానాలెన్నో..

వరప్రసాద్, చంద్రశేఖర్ ఆత్మహత్య ఎపిసోడ్‌లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మచిలీపట్నం బస్టాండ్ ఎదుటి అప్సర లాడ్జీలో రెండు రోజుల పాటు టెకీలిద్దరూ మకాం వేశారు. నాగేంద్ర కోసం ఎదురు చూశారు. ఎంతకీ జాడ లేదు. ఇప్పటికే రూ.9కోట్ల మేరకు కంపెనీల నుంచి బకాయిలు రికవరీ కాలేదు. మరో వైపు రుణదాతల ఒత్తిళ్లతో చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుని గడ్డి మందు తాగినట్టు వరప్రసాద్ బంధువులకు ఫోన్ చేశారు. ఈ కబురుతో కంగారు పడిన బంధువులు ఆంధ్రా హాస్పిటల్ కు తరలించారు. వరప్రసాద్ పరిస్థితి విషమం కాగా, చంద్రశేఖర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్ట‌ర్లు తెలిపారు. అక్కడి నుంచి విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్ట‌ర్లు నిర్వహించిన పరీక్షల్లో దిమ్మతిరిగే నిజం బయటపడింది. వరప్రసాద్ యూరిన్ టెస్ట్ లో 90 శాతం విషం కనిపించగా.. చంద్రశేఖర్ యూరిన్ జీరో పర్సంట్ విషం తేలింది. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయం తీసుకుని తాగిన మందులోనే.. తేడా కనిపిస్తోందని తెలుస్తోంది. అంటే పక్కా ప్లాన్ ప్రకారం వరప్రసాద్‌కు గడ్డి మందు అత్యధిక మోతాదులో పట్టించార‌నే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రశేఖ‌ర్‌ అదృశ్యం ఓ మిస్టరీ

ఈ అప్పులు కట్టలేం, చచ్చిపోదాం, అని సలహా ఇచ్చిన చంద్రశేఖరే.. బతికి బయటపడి పారిపోవటం అనుమానాలకు తావిస్తోంది. నాగేంద్ర ఎవరో? తెలీదు. ఆ పేరిట లావాదేవీలు జరగాయో లేదో తెలీదు. తమను మోసగించి నాగేంద్ర మాయమయ్యాడనే కొత్త కథను చంద్రశేఖరే సృష్టించాడా? ప్రాణంతో సమానంగా గడిపిన తన స్నేహితుడు చనిపోతుంటే.. తాను మాత్రం ఎలా అదృశ్యమయ్యాడు. అసలు అతడి చిరునామా కోసం పోలీసులు ప్రయత్నించారా? ఇందులో ఇంకో ట్విస్ట్ కనిపిస్తోంది. అప్సర హోటల్ లో మకాం చేసింది వీరిద్దరేనా? ఇంకా ఎవరితోనైనా భేటీ అయ్యారా? అనే విషయాలు తెలియాలి. హోటల్ ఫుటేజీ ఆధారంగా మరింత సమాచారం వస్తుంది.

పోలీసుల అలసత్వం ?

రాజకీయ నాయకులతో తత్సంబంధాలున్న వరప్రసాద్ , చంద్రశేఖర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు వ్యవహరించిన శైలి అలసత్వాన్ని ప్రశ్నిస్తోంది. బందరు ఆంధ్ర హాస్పిటల్ కు వీరిద్దరినీ తీసుకువెళ్తే.. మెడికో లీగ‌ల్ కేసుగా పరిగణించి ఆసుపత్రి నిర్వాహకులు సమాచారం ఇస్తారు. ఈ సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తారు? వీరిద్దరి నుంచి వాంగ్మూలం సేకరిస్తారు? వీరిని మరో ఆసుపత్రికి తరలించాల్సి వస్తే .. ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తారు. ఇక కామినేని ఆసుపత్రి నుంచి చంద్రశేఖర్ ను ఎలా డిచ్చార్జి చేశారు. పోలీసులకు సమాచారం లేకుండా డిచ్చార్జి చేయవచ్చా? ఒకవేళ ఆసుపత్రి నిర్వాహకుల అనుమతి లేకుండా చంద్రశేఖర్ వెళ్తే అది అదృశ్యమే అవుతుంది. లేదా పోలీసులకు ఈ సమాచారం తెలిసుంటే.. పూర్తి చిరునామా, వ్యక్తిగత పూచీకత్తు లేకుండా పంపించవచ్చా? ఎనీ హౌ… ₹49 కోట్ల డీల్​తో సంబంధం ఉన్న ఈ ఆత్మహత్య కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement