Tuesday, October 1, 2024

Exclusive – ఇంద్రకీలాద్రిపై దసరా సందడి..

ఎల్లుండి నుంచి మ‌హోత్సవాలు
స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైన ఇంద్ర‌కీలాద్రి
మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ
ప‌ది రోజులపాటు ప్రత్యేక అలంకారాలు
ఆరు వేల‌ మంది పోలీసుల‌తో బందోబ‌స్తు
అన్ని శాఖ‌లతో స‌మ‌న్వ‌యం.. ప‌క్కా ఏర్పాట్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ బ్యూరో: అమ్మల‌గ‌న్నఅమ్మ.. క‌న‌క‌దుర్గమ్మ ద‌స‌రా మ‌హోత్సవాల‌కు ఇంద్రకీలాద్రి స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. ప‌విత్ర కృష్ణా తీరాన స్వయంభువుగా దుర్గమ్మ వెలిసిన క్షేత్రం కావ‌డంతో నిత్యం భ‌క్త జ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఏటా ద‌స‌రా మ‌హోత్సవాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. రోజుకో దివ్య అలంకారంతో జ‌గ‌న్మాత భ‌క్తుల‌ను అనుగ్రహిస్తోంది. ఈ ఏడాది అక్టోబ‌రు 3వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు దేవీ శ‌ర‌న్నవ‌రాత్రి ఉత్సవాలు నిర్వహ‌ణ‌కు అధికార యంత్రాంగం స‌ర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆలయాన్ని మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ చేశారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికలను సైతం రూపొందించారు.

- Advertisement -

ప‌లు రూపాల్లో ద‌ర్శ‌నం..

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌ర్వాత రెండో స్థానంలోని దుర్గమ్మ ఆల‌యానికి నిత్యం వేలాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ద‌స‌రా ఉత్సవాల‌కు దేశంలోని ప‌లు ప్రాంతాల‌నుంచి ల‌క్షలాది త‌ర‌లివ‌చ్చి జ‌గ‌న్మాత‌ను శ‌ర‌ణువేడుకుంటారు. అమ్మవారి దివ్య అలంకారాల‌ను తిల‌కించి అలౌకిక ఆధ్యాత్మికానుభూతికి లోన‌వుతారు. ముఖ్యంగా అమ్మవారి జ‌న్మన‌క్షత్రం మూలా న‌క్షత్రం పర్వదినాన న సరస్వతిదేవి అలంకరణలో దుర్గమ్మను ద‌ర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ల‌క్షలాదిగా త‌ర‌లిరావ‌డం విశేషం. అమ్మను ద‌ర్శించినంత‌నే త‌మ కోరిక‌లు నెర‌వేర‌తాయ‌ని భ‌క్తుల విశ్వాసం. మ‌హాకాళి, మ‌హాల‌క్ష్మి, మ‌హా స‌ర‌స్వతి ముగ్గుర‌మ్మల స్వరూప‌మైన దుర్గమ్మ ద‌ర్శనం స‌క‌ల పాపాల‌ను హ‌రిస్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

దివ్య అలంకారాలివే

క‌న‌దుర్గమ్మ ఉత్సవాల్లో రోజుకో అలంకారంతో భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఈనెల‌3న శ్రీ బాలా త్రిపుర సుంద‌రీ దేవిగా, 4న శ్రీ గాయ‌త్రీదేవిగా, 5న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 6న శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా, 7న శ్రీ మ‌హాచండీ దేవిగా, 8న శ్రీ మ‌హాల‌క్ష్మీదేవిగా, 9న అమ్మవారి జ‌న్మన‌క్షత్రమైన మూలా న‌క్షత్రం రోజు శ్రీ స‌ర‌స్వతి దేవిగా, 10న దుర్గాష్టమి ప‌ర్వదినాన శ్రీ దుర్గాదేవిగా, 11న మ‌హార్నవ‌మి రోజు శ్రీ మ‌హిషాసుర మ‌ర్దనీ దేవిగా, 12న విజ‌య‌ద‌శ‌మి రోజు శ్రీ రాజ‌రాజేశ్వరి దేవి అలంకారంలో అనుగ్రహించ‌నున్నారు. వివిధ రూపాలలో అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.

అంత‌రాల‌య ద‌ర్శ‌నాలు ర‌ద్దు
ఉత్స‌వాల్లో స‌మ‌యంలో భ‌క్తుల ర‌ద్దీ నేప‌థ్యంలో అంత‌రాల‌య ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసింది. భ‌క్తులంతా బంగారువాకిలి నుంచే ద‌ర్శ‌నం చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత ద‌ర్శ‌నం, టికెట్ల ద‌ర్శ‌నాల కోసం ఐదు మార్గాల‌ను ఏర్పాటు చేసింది. వీఐపీల ర‌ద్దీని నియంత్రించేందుకు వారికి ప్ర‌త్యేక స‌మ‌యాల‌ను కేటాయించింది. 6 వేల మందితో బందోబ‌స్తు ఉత్స‌వాల్లో ల‌క్ష‌లాదిగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో 6 వేల మంది పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసుల ర‌క్ష‌ణ వ‌ల‌యంలో ఇంద్ర‌కీలాద్రి ఉంటుంది. 500 సీసీ కెమెరాల‌తో నిత్యం ప‌ర్య‌వేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. డ్రోన్ సేవ‌ల‌ను వినియోగించ‌నున్నారు. ఇత‌ర దేవాల‌యాల నుంచి అద‌నంగా సిబ్బందిని డిప్యూటేష‌న్‌పై దుర్గ‌గుడికి వ‌చ్చి సేవ‌లందించ‌నున్నారు.

ప్ర‌త్యేకం.. కుంకుమార్చ‌న‌
ఉత్స‌వాల్లో అమ్మ‌వారికి ప్రీతిపాత్ర‌మైన కుంకుమార్చ‌న‌లు చేయ‌డం ప్ర‌తీతి. ప‌ది రోజుల పాటు అమ్మ స‌న్నిధిలో భ‌క్తులు కుంకుమ పూజ‌లు చేసేందుకు దేవ‌స్థానం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. నిత్యం రెండు బ్యాచులుగా పూజ‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది. ఆదిశంక‌రాచార్య‌లు ప్ర‌తిష్ఠించిన శ్రీ‌చ‌క్రం ఈ క్షేత్రంలో ఉండ‌డంతో నిత్యం ఇక్క‌డ కుంకుమ‌పూజ‌లు ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తారు. వీటితోపాటు ప్ర‌త్యేక ఖ‌డ్గ‌మాలార్చ‌న‌కు కూడా దేవ‌స్థానం ఏర్పాట్లు చేసింది. వీటితో పాటు శ్రీ చ‌క్ర‌న‌వావ‌ర‌ణార్చ‌న‌, ప్ర‌త్యేక చండీ హోమాల‌ను ఉత్స‌వాల స‌మ‌యంలో విశేషంగా నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement