Monday, November 18, 2024

Exclusive – క‌డ‌ప యోధులు – ఆ ముగ్గురే ఇక్క‌డ కీల‌కం

40 ఏళ్లుగా మైదుకూరు మారాజులు
ఎవరికి వారే ధీరులు
ప్రత్యక్ష ఎన్నికల్లో రఘురామిరెడ్డి
డీఎల్ నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి
మూడోసారి బరిలోకి పుట్టా

(కడప, ప్రభ న్యూస్ బ్యూరో) – కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరం.. ఎంతో ప్రత్యేకం. ఇక్కడ పార్టీలతో పాటు వ్యక్తిగత ప్రతిష్ట కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. గత రెండు ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఇరువురి నేతల మధ్యే ఆధిపత్య సాగింది. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిలే మైదుకూరును పాలించారు. వంతుల వారీ అన్నట్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 నుంచి టిడిపి నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెరపై కొచ్చారు. దీంతో మైదుకూరు రాజకీయా ముఖచిత్రం మారిపోయింది. సామాజిక వర్గాల మధ్య పోటీగా తయారయింది. 2009 వరకు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం వైసీపీ ఆక్రమించింది. టీడీపీ కూడా క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కాస్త తడబడుతోంది. అయితే ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నువ్వా? నేనా? అంటూ వచ్చే ఎన్నికలకు సై అంటున్నాయి. ఈ సందర్భంగా మైదుకూరు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారి ప‌రిశీలిద్దాం..

1978లోనే రాజ‌కీయ రంగంలోకి డీఎల్‌

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ లో చేరి మరోసారి మైదుకూరు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు మైదుకూరు రాజకీయాలపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1985 లో శెట్టిపల్లి రఘురామిరెడ్డి రంగంలోకి దిగారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామిరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి పై 3695 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తిరిగి 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా డీఎల్, టీడీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ల మధ్య పోటీ సాగింది. ఆ ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డి 33,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 ఎన్నికల్లోను వీరిద్దరూ తలపడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఈ ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి కేవలం 28 ఓట్ల స్వల్ప ఆదిత్యతో విజయం సాధించారు. అప్పట్లో ఈ ఫలితం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ర‌ఘురామిరెడ్డితో పోటీ..

1999 ఎన్నికల్లో మరోసారి టిడిపి అభ్యర్థిగా రఘురామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా డీఎల్ రవీంద్రారెడ్డి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో రఘురామిరెడ్డి 5520 ఓట్ల ఆదిక్యతతో గెలుపొంది టీడీపీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు. ఇక 2004 ఎన్నికల్లో పుంజుకున్న డీఎల్ రవీంద్రారెడ్డి (కాంగ్రెస్) 7881 ఓట్ల ఆదిత్యతో టీడీపీ అభ్యర్థి ఎస్ రఘురామిరెడ్డి పై విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో వీరిరూరే తలపడ్డారు. టిడిపి అభ్యర్థిగా రఘురామిరెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసి వరుస విజయాలను అందుకున్నారు.

- Advertisement -

స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా

ఆ ఎన్నికల్లో 4361 ఓట్ల ఆదిత్యతో డిఎల్ గెలుపొందారు. ఇలా 1983 నుంచి డీఎల్- ఎస్ రఘురామిరెడ్డి ల మధ్య రాజకీయ పోరు సాగుతోంది. అప్పటివరకు జిల్లా రాజకీయాలపై తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకొని చక్రం తిప్పుతూ వచ్చిన డీఎల్ రవీంద్రారెడ్డి రాష్ట్ర విభజన, రాజకీయ సమీకరణల నేపథ్యంలో తటస్థంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. ఆ స్థానాన్ని వైయస్ జగన్ ఏర్పాటు చేసిన వైకాపా ఆక్రమించింది. ఫలితంగా 2014లో మైదుకూరు రాజకీయ ముఖచిత్ర స్వరూపం మారిపోయింది. అప్పటివరకు టీడీపీలో కొనసాగిన ఎస్. రఘురామిరెడ్డి వైసీపీ లో చేరిపోయారు. పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి మైదుకూరు రాజకీయ తెరపై కొచ్చారు. దీంతో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పుట్ట సుధాకర్ యాదవ్, వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో 11,522 ఓట్ల ఆదిత్యతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఓడిపోయిన పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ చైర్మన్ స్థానం దక్కింది. కాగా 2019 ఎన్నికల్లో తిరిగి వీరు ఇరువురే పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి 29,344 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ వీరే అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. ఆ మేరకు టిడిపి అధిష్టానం పుట్టా అభ్యర్థిత్వన్ని ఖరారు చేసింది. వైకాపా మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పోరాట యోధుడు రఘురామిరెడ్డి..

మైదుకూరు శాసనసభ అభ్యర్థిత్వానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి ఇప్పటి వరకు వరకు ఎనిమిది పర్యాయాలు పోటీ చేసి నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో మొదటిసారి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన రఘురామిరెడ్డి 1989, 94 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 09 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ విజయం సాధించారు. తిరిగి 2014,19 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి వరుస విజయాలు సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే 9వ సారి ఎన్నికల బరిలో నిలిచినట్లు అవుతుంది. ఇలా 40 ఏళ్లుగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడుతూనే ఉన్నారు.

అంతు చిక్కని డీఎల్ వైఖరి…

ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైఖరి అంతుచిక్కడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ డీలా పడటంతో ఆయన నెమ్మదించారు. అయితే మైదుకూరు నియోజకవర్గంలో పోటీ చేసే రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల సమయంలో ఆయన మద్దతు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆయన మద్దతు కారణంగా రాజకీయ సమీకరణలు నియోజకవర్గంలో వేగంగా మారుతుంటాయి. గెలుపు ఓటములపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రెడ్డి కడప పర్యటనలో భాగంగా డీఎల్ రవీంద్రారెడ్డి తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేందుకు షర్మిల డిఎల్ మద్దతు కోరారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలని విన్నవించారు. దీనిపై డియల్ తన వైఖరి ఏమిటో స్పష్టం చేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో డిఎల్ ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటిస్తారా?.. లేదా ఎన్నికల బరిలో నిలుస్తారా?.. ఏ పార్టీలో చేరతారు?.. వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎటువంటి అడుగులేస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మైదుకూరు రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది.

స‌త్తాచాటేందుకు రెండు పార్టీలు రెడీ

అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోకుండా మరింత బలోపేతమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మండల స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా దూకుడు పెంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైకాపా అసంతృప్త నేతలను, కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరువురు నేతలు దూకుడుగా వెళ్తూ మైదుకూరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement