Friday, September 20, 2024

Exclusive – చిమ్మ‌చీక‌ట్లో.. సెల్ టార్చ్ వెలుగులో…. చంద్ర‌బాబు సాహసం!

బయట కుంభ వృష్టి. ఇంటిలోని బయటకు రాలేని స్థితి. ఒక సీఎం తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కానీ తాను సీఎంవోలో దర్జాగా కూర్చోవచ్చు. టీవీల్లో వార్తలు చూడొచ్చు. మధ్యలో టీ తాగి టెలీ కాన్ఫరెన్స్ జరపొచ్చు. అక్కడకు వెళ్లండి. ఇక్కడ చూడండి అని అధికారులను.. మంత్రులను , ఎమ్మెల్యేలను ఆదేశించవచ్చు. వర్షం తగ్గిన త‌ర్వాత‌ హెలీకాప్టర్ లో ఏరియల్ వ్యూ పరిశీలించవచ్చు. ఇప్పటి దాకా జనానికి అసలు సిసలు అనుభవం ఇది… కానీ, ఏపీ సీఎం చంద్రబాబు అలా చేయ‌లేదు. వయసు మీద ప‌డినా.. 74 ఏళ్ల వ‌య‌స్సుల్లోనూ న‌వ య‌వ్వ‌నం తొణికిస‌లాడే యువ‌కుడిలా ముందుకు క‌దిలారు. గత అనుభవాలను సమీక్షించుకున్నారు. ఇది 50 ఏళ్ల కిందటి ఉపద్రవం. ఇటు కృష్ణా కట్టెలు తెంచుకుంది. అటు గోదావరి పొంగి పొర్లుతోంది. నగరాలపై వరద పడగ పడింది. జనం అల్లాడిపోతున్నారు. కరెంటు లేదు. ఇంట్లోకి న‌డుముల‌పైకి దాటి నీళ్లు చేరాయి. వంట లేదు. పిల్లా జెల్లా ఆకలితో అలమటించి పోతున్నారు. ఇక కూలీ నాలీ జనం వానలో తడిచి ముద్దయ్యారు. వీరందరినీ తక్షణమే ఆదుకోవాలి. అసలు రాష్ట్రంలో ఈ విపత్తు పరిస్థితి ఏంటీ? స్వయంగా చూడాటమే కాదు.. ఆపన్నులను ఆదుకోవాలనే తపనతో ..ఈ సీనియర్ మోస్ట్ సిటీజన్.. సీబీఎన్… అదే ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం 4.00 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 4.00 గంటల వరకూ..జనం వ్యథలను, బాధలను పంచుకుని కనీసం తాత్కాలిక ఉపశమనం కోసం అల్లాడిపోయారు. తల్లడిల్లిపోయారు, చలించిపోయారు. బోట్లల్లో వరద ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకరకంగా ఏపీ సీఎం చంద్రబాబు జీవిత చరిత్రలోనే.. ఇదొక అద్యాయం. వరద బాధితుల‌కు క‌న్నీటిని తుడిచిన మ‌రో చరిత్ర..


క‌న్నీరు తుడుచేందుకు కాల‌నీల్లో ప‌ర్య‌ట‌న‌
24 గంటలూ వరద ప్రాంతాలపైనే సీఎం ఫోకస్
బోటులో ప్ర‌యాణించి క‌ష్టాలు తెలుసుకుంటూ
ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌.. బోటులో ప్రజల చెంతకు
స్వయంగా బాధలు తెలుసుకున్న చంద్ర‌బాబు
అన్నపానాదుల పంపిణీలోనూ భాగస్వామిగా
అధికారులను, మంత్రులను అనుక్ష‌ణ‌ అలెర్ట్
బాధ‌ల్లో అండ‌గా.. క‌న్నీరు తుడిచే భ‌రోసాగా

ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్


ఆదివారం.. మద్యాహ్నం 11.00 గంటలకే సీఎం చంద్రబాబు తన క్యాంప్ ఆపీసులోకి వచ్చారు. ఏపీలో వానలు, వరదలపై సమీక్ష జరిపారు. 50 ఏళ్లనాటి వాన చరిత్ర మ‌ళ్లీ క‌నిపించింది. కృష్ణనది ఉగ్రరూపంతో విజయవాడకు వస్తోంది.. 121 ఏళ్ల చరిత్రను కృష్ఱానది తిరగతోడుతోంది. అప్పటి జీవన స్థితికి.. ఇప్పటి పరిస్థితికి బేరీజు వేసుకున్న చంద్రబాబు స్థిమితంగా కూర్చోలేక పోయారు. వచ్చే వరదల‌ను అంచనా వేశారు. 12 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణాజిల్లాను ముంచబోతోంది. ఏం చేయాలి? ఇక్కడి జనాన్ని ఎలా కాపాడాలి? పంట నష్టం సంగతి సరేసరి. ప్రాణనష్టం నివారించాలి. ఆకలి దప్పులతో అల్లాడే జనాన్ని ఆదుకోవాలి. ఊరట కల్పించాలి. ఆగలేక పోయారు. సరీగా నాలుగు గంటలకు కనకదుర్గమ్మ వారధి పైకి చేరుకున్నారు. అక్కడి నుంచే ఆయనలో తపన ఆరంభమైంది.

వరద ప్రాంతాలపైనే ఫోకస్

విజయవాడ సింగ్‌నగర్‌ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ లోపలికి వెళ్లారు. దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటిని సీఎం పరిశీలించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా? లేదా? అని చంద్రబాబు ఆరా తీశారు. ఆహారం, రక్షిత మంచి నీరు అందాయని బాధితులు ఆయనకు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మకాం వేశారు. ఒకరకంగా ఈ కార్యాలయం సీఎంవోగా మారిపోయింది. వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేవలం రెండు గంటలు విశ్రాంతి తీసుకుని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని భావించిన చివరకు సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగేశారు. అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వేర్వేరు ప్రాంతాల్లో బోట్లలో టార్చిలైట్లు వేసుకుని తిరుగుతూ స్థానికులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు . కనకదుర్గమ్మ ఆలయం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. విజయవాడలోని ప్రైవేటు హోటళ్ల యజమానులతో మాట్లాడి లక్షమందికి ఆహారం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

అర్థరాత్రి.. అపరాత్రి లేదు..

గత అర్థరాత్రి రెండో సారి సింగ్ నగర్ లో బుడమేరు బాధితుల వద్దకు వెళ్లారు. చీకటిలో టార్చ్ లైట్ వెలుగులో ముంపు ప్రాంతాల్లో రాత్రి 12 గంటల సమయంలో బోట్ లో వెళ్లి ముంపు ప్రాంతంలోని బాధితులకు స్వయంగా ఆహారం అందజేసారు. రాత్రంతా మెలకువగా ఉండి సింగ్ నగర్ లోనే పర్యటించారు. కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. బోటులో అర్ధరాత్రివేళ ప్రయాణం ప్రమాదమని భద్రతా సిబ్బంది వారించినా చంద్రబాబు వినిపించుకోలేదు. తెల్లవారుజామున 4 గంటల వకు సుడిగాలి పర్యటన చేశారు. సెల్‌ఫోన్ కెమెరా లైట్ల వెలుతురులో అరగంట పాటు పర్యటించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఆహార ప్యాకెట్లు అందజేశారు.

బోటులో .. జనం చెంతకు

ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ సీఎం చంద్రబాబు. పర్యటించారు. అర్ధరాత్రి 1.10 గంట‌ల‌కు కృష్ణలంక‌లోని 16వ డివిజ‌న్ పోలీసు కాల‌నీలో ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా రక్షణ గోడ వ‌ద్ద వ‌ర‌ద నీటిని ప‌రిశీలించారు. ఆదివారమంతా కలెక్టర్ కార్యాలయం నుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రి, ఆహారం తయారు చేయించడానికి ఎక్కడ అనువుగా ఉందో తెలుసుకున్నారు. అన్నిచోట్ల నుంచి వరద బాధితులకు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి ఆహారాన్ని హెలికాప్టర్ ద్వారా అందజేశారు. బుడమేరు సమీపంలో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు . మంత్రి నిమ్మల రామానాయుడు. అర్ధరాత్రి ఒంటి గంటకు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.

ఆఫీసర్లపై ఫైర్

బుడమేరు వరద ప్రాంతాల్లో పరిస్థితిని వివరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు తాను విశ్రమించేదిలేదన్నారు. అప్పటివరకు తాను ఈ కలెక్టరేట్ లోనే ఉంటానన్నారు. వరద బాధితుల కోసం పాలు, ఆహారం, తాగునీరు, కొవ్వొత్తులు, టార్చ్ లు వెంటనే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. లక్ష మందికి సరిపోయేంతగా ఆహారం తెప్పించి బాధితులకు సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లను, ట్రాక్టర్లను, సహాయం చేసేందుకు అవసరమైన వస్తువులను తెప్పించాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ప్రస్తుతమైతే వెంటనే అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ ను బాధితులకు అందించాలన్నారు. వరద ప్రాంతాల నుంచి వృద్ధులు, చిన్నారులను వెంటనే తరలించాలన్నారు. విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలని అధికారులను ఆదేశించారు.

గుండె తరుక్కుపోతోంది : చంద్రబాబు ఆవేదన

‘బుడమేరులో ఊహించని స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీళ్లని చూస్తుంటే గుండె తరుక్కపోతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలి. సాయంలో ప్రతి రెండు గంటలకు నాకు మార్పు కనిపించాలి. సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించి బాధితులకు అందజేయాలి. అదేవిధంగా నగరంలో ఉన్న అన్ని దుకాణాల నుంచి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు తెప్పించి బాధితులకు ఇవ్వండి. ఖర్చు గురించి మీరు అసలే ఆలోచన చేయకండి’ అంటూ మంత్రులు, అధికారులకు చంద్రబాబు బాధ్యతలు అప్పజెప్పారు, నిముషాల లెక్క అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలంటూ ఆదేశించారు. విజయవాడలో సాధారణస్థితి వచ్చేంతవరకు తాను కలెక్టరేట్ నుంచి బయటకు అడుగు బయటకు పెట్టబోనన్నారు.

క్షణ క్షణం పునరావాస చర్యలపై రివ్యూ

వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో వరద ప్రవాహం గురించి అడిగి తెలుసుకున్నారు . అక్కడ జరుగుతున్నపనులేంటి? ఆ ప్రాంతాల్లో ఎవరెవరు చూస్తున్నారు? బాధితులకు అందించిన సాయం గురించి ఆరా తీశారు. అధికారులు చెప్పినదంతా విన్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, సోమవారం ఉదయం మరోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడలో సహాయక చర్యలు వేగవంతమ య్యాయి. కేంద్రంతో మాట్లాడిన తర్వాత పవర్ బోట్స్ విజయవాడకు చేరుకున్నాయి. ఒకవైపు ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. బాధితులను బోట్లపై ఇళ్ల నుంచి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బందిపడకుండా హోటళ్లలో ఉంచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అధికారులంతా బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సహాయచర్యలను పరిశీలిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేవారికి దుస్తులు కూడా ఇవ్వాలని ఆదేశించారు సీఎం. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిళ్లను బాధితులకు అందజేస్తోంది ప్రభుత్వం. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా రెడీ చేసిన ఆహారాన్ని అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement