జగన్ సర్కారు పాపమే జనానికి శాపం
అప్పటి నిర్లక్ష్యంతోనే బుడమేరు ముంపు
విస్తరణ పనుల పేరుతో ₹కోట్లు బుక్కిన నేతలు
పనులు చేయకుండానే ఫండ్స్ కాజేశారు
భూ సేకరణకు ఖర్చు ఎక్కువని పట్టించుకోని సర్కారు
క్లాజ్ 60 సీ పేరుతో మరింత దోచుకున్న కాంట్రాక్టర్లు
నాలుగో ప్యాకేజీ పనులన్నీ అసంపూర్తిగా ముగింపు
చక్రం తిప్పి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన గన్నవరం లీడర్
పనుల్లో వచ్చిన మట్టినీ విచ్చలవిడిగా అమ్ముకున్నారు
తవ్వినకొద్దీ బయటపడుతున్న జగన్ సర్కారు బాగోతాలు
బెజవాడలో వరదలకు కారణాలు అన్వేషిస్తున్న కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:
విజయవాడను వరద ముంచెత్తింది.. బుడమేరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. సాఫీగా సాగే బుడమేరు వరద వెనక్కి తన్నడం.. మూడు చోట్ల భారీ గండ్లు పడటంతో వరద నీరు కాలనీలను ముంచెత్తింది. ఈ వరదలకు గల ప్రధాన కారణాలేంటి అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. బుడమేరు పోటెత్తడానికి గల కారణాలను అన్వేషిస్తే.. తవ్వినకొద్దీ టన్నులకు టన్నుల లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఇదంతా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. అప్పట్లో ఆ పార్టీ లీడర్లు చేసిన పాపాలు.. విజయవాడ ప్రజలకు శాపంగా మారాయి.
ప్యాకేజీల వారీగా పనులు..
డ్రైనేజీ డివిజన్‌లో 2011లో 5 ప్యాకేజీలుగా విభజించి రూ.72.50 కోట్లతో టెండర్లు పిలిచారు. 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.16.15 కోట్లు, 12 నుంచి 25.60 కిలోమీటర్ల వరకు రూ.17 కోట్లు, 25 నుంచి 34 కిలోమీటర్ల వరకు రూ.12 కోట్లు, 34 నుంచి 43.50 కిలోమీటర్ల వరకు రూ.13 కోట్లు, 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు రూ.14 కోట్లతో టెండర్లు పిలిచారు. 1,4,5 ప్యాకేజీలు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ, 2,3 ప్యాకేజీలు ఆర్ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి.
పట్టించుకోని జగన్ ప్రభుత్వం
టెండర్లు దక్కించుకున్న సంస్థలు భూసేకరణ చేపడితేనే పనలు చేస్తామంటూ జాప్యం చేశాయి. మొదటి ప్యాకేజీ విజయవాడ సమీపంలో ఉంది. జాతీయ రహదారి పక్కేనే ఉన్న దీని భూసేకరణకు ₹200 కోట్లు అవుతుందని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలుత 29.175 కిలోమీటర్ల వరకు 62 మీటర్ల బెడ్ విడ్త్‌తో వెడల్పు చేసి కట్టలు పటిష్ఠ పరచాలి. 29.825 కిలోమీటర్ల నుంచి 110 మీటర్ల వెడల్పు, తర్వాత 180 మీటర్ల వెడల్పు చేయాలి. ఈ డ్రెయిన్‌ని 417 క్యూమెక్కులు అంటే 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.
క్లాజ్ 60 సీ పేరుతో దోపిడీ..
కాగా, విస్తరణ పనులను జగన్ సర్కారు అటకెక్కించింది. క్లాజ్ 60సీ పేరుతోనూ, అదనపు పనుల పేరుతో నాన్ ఈపీసీ కింద మొత్తం ₹28.91 కోట్లను గుత్తేదారులకు దోచిపెట్టింది. అసలు పనులను ముందస్తు ముగింపు పేరుతో అర్ధాంతరంగా ఆపేసి, గుత్తేదారు సంస్థలకు బిల్లులు చేసింది. 2,3,5వ ప్యాకేజీల్లో పనులు మొత్తం పూర్తి చేశారు. ఎనికేపాడు నుంచి ఉన్న మొదటి ప్యాకేజీలో గుత్తేదారు సంస్థ కేవలం 30శాతం పనులే పూర్తి చేసింది.
అసంపూర్తిగా నాలుగో ప్యాకేజీ పనులు..
నాలుగో ప్యాకేజీ పనులను 2020లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ముగించింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు ఆ ప్యాకేజీల్లో కొంత పని దక్కించుకున్న నాస్‌బాబు సంస్థ చేపట్టిన 34 నుంచి 42.50 కిలోమీటర్ల వరకు 42.50 నుంచి 50.60 కిలోమీటర్ల వరకు ఉన్న పనులను ప్రీక్లోజర్ చేసేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు చేయకపోయినా గడువు పొడిగిస్తూ వచ్చారు. నిబంధనల ప్రకారం టెండర్లు ఒక సంస్థకు ఇచ్చినా క్లాజ్ 60సీ ద్వారా పనులు వేరే కాంట్రాక్టరకు అప్పగించొచ్చు.
పనులు చేయకుండానే బిల్లులు..
2019లో వైఎస్సార్సీపీ పెద్దలు ఈ క్లాజ్‌ని బయటకు తీశారు. దీంతో ఇంజినీర్లు 1, 4, 5 ప్యాకేజీ పనులను వేరే గుత్తేదారులకు అప్పగించారు. ఈ గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేసినా తవ్విన మట్టిని విక్రయించేసుకున్నా మొత్తం బిల్లులు చెల్లించేశారు. నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటరు పూర్తి చేస్తేనే బిల్లులు ఇవ్వాలి. కానీ వైఎస్సార్సీపీ పెద్దల సూచనతో వంద మీటర్ల మట్టి తవ్వినా బిల్లులు చేశారు. డ్రెయిన్ రెండు వైపులా తవ్వితేనే ఇవ్వాలి. కానీ ఒకవైపు తవ్వినా ఇచ్చేశారు. 2వ ప్యాకేజీలో వంకరటింకరగా ఉందని 5 కిలోమీటర్ల దూరం, 3 వ ప్యాకేజీలో 2 కిలోమీటర్ల దూరం వ్యత్యాసం ఉందని అదనపు టెండర్లు పిలిచారు.
చక్రం తిప్పిన గన్నవరం లీడర్..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి గన్నవరం ప్రజాప్రతినిధి చక్రం తిప్పి నాన్ ఈసీసీ కింద గుత్తేదారులను సిండికేట్ చేయించి తమవారికి దక్కేలా చేసినట్టు తెలుస్తోంది. 12 నుంచి 17.6 కిలోమీటర్ల దూరం వరకు మెలికలుగా ఉందని, ₹8 కోట్లు అదనంగా కేటాయించి, ఓ గుత్తేదారుకు అప్పగించారు. గన్నవరం సమీపంలో ఈ పనుల్లో వచ్చిన మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నట్టు సమాచారం. ఇటు ఈ ₹8 కోట్లు, అటు ఆ మట్టి విక్రయాలతో గుత్తేదారు అందినకాడికి దోచేశారు. 25 నుంచి 26.8 కిలోమీటర్ల వరకు పనులను ₹1.20 కోట్లకు అప్పగించారు.
బుడమేరు పరిధిలో ఆక్రమణలు..
మరోవైపు 5వ ప్యాకేజీలో రెండు పాయలుగా ఉండే బుడమేరు మధ్యలో నేతల అండతో పట్టా భూములను ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరులో కలవాల్సిన ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడి పంట పొలాలు మునిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.