సూర్యుడు అస్తమించని బ్రిటీషు పాలనలో భరతమాత తల్లడిల్లింది. ఎన్నో పోరాటాలతో తెల్లదొరలు తోకముడిచారు. దీంతో పరాయి పీడ విరగడయ్యింది. భారతవనిలో ప్రజాస్వామ్యం అవతరించిన వేళ.. సుమారు డబ్భై రెండేళ్ల కిందట వామపక్షం, లౌకికవాదం మధ్య అధికార యుద్ధం సాగింది. ఆ సమయంలోనే మనుధర్మ వేదం పరదాలో ఓ జనసంఘ్ బిడ్డ పురుడు పోసుకుంది. దాదాపు 28 ఏండ్లు అనాథగా మిగిలింది. హిందూత్వం, దేశభక్తి ఆయుధంతో కొత్త అవతారం ఎత్తింది. భారతీయ జనతా పార్టీకి నలబై నాలుగేళ్ల కిందట అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ఱ అద్వానీ నాయకత్వం వహించారు. 1980, ఏప్రిల్ 6న ఆపార్టీకి యవ్వన దశ ఆరంభమైంది.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరే ఇద్దరు బీజేపీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 543 మంది ఎంపీల నడుమ బిక్కు బిక్కుమంటూ పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అందులో తెలంగాణ బిడ్డ చందుపట్ల జంగారెడ్డి, గుజరాత్ నుంచి ఏకే పటేల్ ఉన్నారు. ఇలా తప్పటడుగులతో ఆరంభమైన బీజేపీ దశ.. ఇప్పుడు దేశాన్ని పాలించే స్థితికి చేరింది. ఉత్తర భారతాన్ని కమలదండు వశం చేసుకోగా, పశ్చిమాన పరిఢవిల్లుతోంది. ఈశాన్యాన్ని విలీనం చేసుకుంటోంది. ఇక.. తూర్పు, దక్షిణాదిన జైత్రయాత్రకు బయలుదేరిన వేళ.. బీజేపీ ఆవిర్భావం నుంచి పునాది వేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాషాయ దండు ఎందుకు చతికిలపడింది. మరీ ముఖ్యంగా ఏపీలో టీడీపీ పోత్తిళ్లలోని బిడ్డగానే ఎందుకు ఉండిపోయిందనే విషయాలను చదివి తెలుసుకుందాం.
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: సాదా సీదా జాతీయవాద పార్టీగా 1980లో ఆవర్భవించిన బీజేపీ.. ఉమ్మడి ఏపీలో తొలి అడుగు వేసింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ వేసిన తెలుగుదేశం బీజం అంకురమే కాదు.. ఓ మొక్కగా అవతరించిన తరుణంలో బీజేపీ 81 స్థానాల్లో పోటీ చేసింది. ఏపీలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ముప్పవరపు వెంకయ్యనాయుడు విజయం సాధించారు. తెలంగాణలోని శాయంపేట్ నియోజకవర్గంలో చందుపట్ల జంగారెడ్డి, ముస్లింల ఇలాఖా మలక్‌పేట్‌లో నల్లు ఇంద్రసేనా రెడ్డి బీజేపీ పతాకాన్ని ఎగరవేశారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు ఏకంగా తన సమీప పత్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 20,500 మెజారిటీతో గెలిచారు. అక్కడి నుంచే ఏపీ, తెలంగాణలో బీజేపీ ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. 1985లో 10 స్థానాల్లో పోటీ చేయగా.. 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ, ఏపీలో డిపాజిట్లు దక్కలేదు. తెలంగాణలోని ఆలంపూర్ స్థానంలో రవీంద్రనాథ్ రెడ్డి, హిమాయత్‌నగర్‌లో ఆలే నరేంద్ర, మలక్‌పేట్ నియోజకవర్గంలో ఇంద్రసేనా రెడ్డి, కార్వాన్లో బద్దం బాల్‌రెడ్డి , రామాయంపేట్‌లో రామన్నగారి శ్రీనివాసరెడ్డి, మెట్పల్లిలో చెన్నమనేని విద్యాసాగర్ రావు, వర్థన్నపేటలో వన్నాల శ్రీరాములు, పరకాలలో వి.జయపాల్ విజయం సాధించారు. మొత్తమ్మీద 3,72,978 (1.62 శాతం) ఓట్లు లభించాయి.
కష్టాలతోనే పయనం షురూ.
1989లో ఒంటరిగానే బీజేపీ పోటీ చేసింది. 5 స్థానాల్లో విజయం సాధింది. అదీ తెలంగాణాలోనే తన ఉనికిని కాపాడుకుంది. ఆలంపూర్ నియోజకవర్గంలో రావుల రవీంద్రనాథ్ రెడ్డి, కార్వాన్లో బద్దం బాల్‌రెడ్డి , మెట్పల్లిలో చెన్నమనేని విద్యాసాగర్ రావు, వర్థన్నపేట్లో తక్కెళ్ల పల్లి రాజేశ్వరరావు, పరకాలలో జయపాల్ విజయం సాధించారు. 1994లో ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ 280 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఏపీలో బీజేపీకి ఒక్క సీటూ దక్కలేదు. తెలంగాణలో మాత్రం కార్వాన్, మెట్పల్లి, మహారాజ్ గంజ్‌లో బీజేపీ అభ్యర్థులు నెగ్గారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, వామపక్ష కూటమి సహా.. అన్నిపార్టీలూ ఊడ్చుకుపోయాయి.
చంద్రబాబుతో లక్కీ బంధం
కేంద్రంలోనూ, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం రాజకీయ వ్యూహాల్లో.. డిపాజిట్లు రాని పార్టీగా కుమిలిపోతున్న బీజేపీకి 1998లో లక్కీ చాన్స్ వరించింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు.. బీజేపీతో జత కలిశారు. ఈ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకట స్వామి నాయుడు, సికింద్రబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు విజయం సాధించారు. కేంద్ర కూటమిలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో 1999లో ఏపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 24 అసెంబ్లీ సీట్లల్లో పోటీ చేస్తే 12 స్థానాల్లో.. విశాఖపట్నం వన్ టౌన్ నియోజకవర్గం నుంచి కంభపాటి హరిబాబు, తూర్పుగోదావరి జిల్లా నగరం నియోజక వర్గం నుంచి అయ్యాజి వేమ మనేపల్లి, విజయవాడ ఈస్ట్ నుంచి కోట శ్రీనివాసరావు , కదిరి నుంచి ఎంఎస్ పార్థసారథి, అలంపూర్ నుంచి ఆర్. రవీంద్ర నాథ్ రెడ్డి, ముషిరాబాద్ నుంచి కె.లక్ష్మణ్, మలక్ పేటలో ఇంద్రసేన రెడ్డి, మహారాజ్ గంజ్ నియోజకవర్గంలో ప్రేమ్ సింగ్ రాథోడ్, సంగారెడ్డి నుంచి కె.సత్యనారాయణ , పెద్దపల్లి నుంచి గాజుల రామకృష్ణారెడ్డి, మెట్పల్లి నుంచి తుమ్మల వెంకట రమణ రెడ్డి , హనుమకొండలో ఎం.ధర్మారావు విజయం సాధించారు. ఇక ఏడు ఎంపీ స్థానాలనూ బీజేపీ కైవశం చేసుకుంది. అనకాపల్లిలో గంటా శ్రీనివాసరావు, రాజమండ్రిలో ఎస్పీబీపీకే సత్యనారాయణ, నర్సాపురం నుంచి ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు, తిరుపతిలో ఎన్. వెంకటేశం, కరీంనగర్లో సీహెచ్. విద్యాసాగర్‌రావు, మెదక్‌లో ఆలే నరేంద్ర, మహబూబ్‌నగర్‌లో ఏపీ జితేందర్‌రెడ్డి, సికింద్రబాద్‌లో బండారు దత్తాత్రేయ గెలిచారు. ఏడుగురు ఎంపీలు గెలిచినా కేంద్రంలో మాత్రం చంద్రబాబే చక్రం తిప్పారు.
ప్చ్.. పదేళ్లు శిక్ష
ఆరేళ్లు కేంద్రంలో ఒక వెలుగు వెలిగిన కమలనాథులు.. ఆ తర్వాత పదేళ్ల పాటు జనానికి దూరం అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో నీరసించిపోయారు. 2004లో ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా గెలవలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని 27 స్థానాల్లో పోటీ చేస్తే.. 10 సిట్టింగ్ స్థానాల్లో ఓటమిచెందారు. కేవలం రెండు స్థానాల్లోనే గెలిచారు. హిమాయత్‌నగర్ నుంచి జె.కృష్ణారెడ్డి 31,811, పిఠాపురంలో పి.దొరబాబు 17,899 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 9,42,008 (2.63 శాతం) ఓట్లు వచ్చాయి. 2009లో టీడీపీ పొత్తు లభించలేదు. సింగిల్ గానే 271 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే రెండు స్థానాల్లో అదీ తెలంగాణలోనే మళ్లీ ఉనికి నిలబడింది. ఒక్క ఎంపీ స్థానం దక్కలేదు. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఎండల లక్ష్మీనారాయణ, అంబర్ పేట్ నుంచి పరీదుద్దీన్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 11,92,814 (2.84శాతం) ఓట్లు లభించాయి.
పసుపు కానుకతో.. మంత్రి కుర్చీలు
రాష్ట్ర విభజనతో ఏపీలో మళ్లీ టీడీపీతో బీజేపీ జత కలిసింది. రాష్ట్ర రాజధాని, వెనుకపడిన ప్రాంతాల అభివృద్ధి ఎజెండాతో టీడీపీ 237 స్థానాలు, బీజేపీ 58 స్థానాల్లో పోటీ చేస్తే ఏపీలో టీడీపీ 102స్థానాల్లో .. బీజేపీ నాలుగు స్థానాల్లో, తెలంగాణలో 15 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఏపీలో కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నుంచి పైడికొండల మాణిక్యాలరావు, విశాఖపట్నం నార్తు నుంచి పెనుమత్స విష్ణు కుమార్ రాజు, రాజమండ్రి సిటీ నుంచి ఆకుల సత్యనారాయణ విజయం సాధించగా.. నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రి పదవులు లభించాయి.
విభజనతో ఏపీలో ఆగ్రహ జ్వాలలు
2019 ఎన్నికల్లో ఇటు టీడీపీ, అటు బీజేపీపై ఏపీ జనానికి చిర్రెత్తింది. ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను సమాధి చేశారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట దెబ్బతీశారు. పోలవరం నిర్మాణం జరగలేదు. అన్నిటి కంటే వెనుకపడిన ఏడు జిల్లాలకు నిధులు నిలిపివేయటంతో ఏపీ జనం కుతకుతలాడిపోయారు. తనను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విసిరిన సమ్మోహనాస్త్రానికి తలవంచారు. అంతే.. 173 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి చుక్కలు చూపించారు. ఒక్క స్థానంలోనూ గెలుపు లేదు. కేవలం 2,63,849 (0.84 శాతం) ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికల్లో సంగతేంటీ?
ఏపీలో బీజేపీకి ఉనికే అంతంతమాత్రంగానే ఉంది. అసలు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో అర్థం కాని స్థితి. రాజధాని లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, అన్నిటి కంటే అభివృద్ధి శూన్యం. ఈ స్థితిలో బీజేపీని ఎలా నమ్మాలో జనం అయోమయంలో ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఈసారి మళ్లీ తెలుగుదేశంతో పొత్తు కుదిరింది. నిజానికి ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు బద్ధ విరోధులు. వీరి మధ్య సఖ్యత కుదరటమే జనానికి ఇంకా నమ్మకం కుదరడం లేదు. పది అసెంబ్లీ స్థానాలు, ఆరు ఎంపీ స్థానాలను బీజేపీ నాయకులకు ఇచ్చారు. కానీ, వీటిలో ఎన్ని స్థానాల్లో నిరూపించుకుంటారో తెలియని స్థితి. అరకులో గిడ్డి ఈశ్వరీ, రాజమండ్రిలో బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, నర్సాపురంలో భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజంపేటలో, నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డి, అనకాపల్లిలో సీఎం రమేశ్, తిరుపతిలో వరప్రసాదరావును అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
తెలగు నేలలో బీజేపీ రథసారథులు
సంఖ్య పేరు అధ్యక్ష కాలం
1 పీవీ చలపతిరావు 1980 ..86
2 బంగారు లక్ష్మణ్ 1986..88
3 ఎం.వెంకయ్యనాయుడు 1988…93
4 వీ రామారావు 1993..97
5 బండారు దత్తాత్రేయ 1997..98
6 సీహెచ్. విద్యాసాగర్ రావు 1998..99
7 వీ. రామారావు 1999..2001
8 చిలకం రామచంద్రారెడ్డి 2001..2003
9 నల్లు ఇంద్రసేనా రెడ్డి 2003..2007
10 బండారు దత్తాత్రేయ 2007..2010
11 జి.కిషన్ రెడ్డి 2010… 2014
12 కంభంపాటి హరిబాబు 2014..2018
13 కన్నా లక్ష్మీ నారాయణ 2018..2020
14 సోము వీర్రాజు 2020..2023
15 దగ్గుబాటి పురందేశ్వరి 2023 జూలై 4 నుంచి