Sunday, November 3, 2024

Exclusive – హాట్​ సీట్​ కుప్పం! వైసీపీలో ఆశల జడి .. టీడీపీ ఉక్కిరి బిక్కిరి

(ప్రభన్యూస్ బ్యూరో, చిత్తూరు ) . – కుప్పం..కుప్పం … సీఎం జగన్ నోటిలోనూ… ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రాజకీయ చర్యల్లోనూ కుప్పం నియోజకవర్గ రాజకీయంపై ప్రత్యేక దృష్టి సారిస్తే.. మరో వైపు 40 ఏళ్లుగా కుప్పం చక్రవర్తిగా చెలామణి అవుతున్న చంద్రబాబు సైతం అంతర్గత మధనంలో తర్జనభర్జన పడుతున్నారంటే… అతిశయోక్తి కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు వైసీపీ, టీడీపీలో కుప్పం నియోజకవర్గమే మార్మోగిపోతోంది. నియోజకవర్గంలో చంద్రబాబు గెలుపు ఓటములపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కావటమే కాదు… బెట్టింగ్ బుకీలకు పెద్ద ఆయుధమే దొరికింది. కోట్లకు కోట్ల బెట్టింగులు తెరమీదకు వస్తున్నాయి. ఎక్కడ నలుగురు గుమి కూడినా కుప్పంలో రాజకీయ పరిస్థితులపైనే వాడి వేడిగా చర్చ జరుగుతోంది. కుప్పం ప్రజలు ఎప్పటిలాగే రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఆదరిస్తారా అనే అంశంపైనే చర్చ తారా స్థాయికి చేరింది. ఈ విషయంపై చిత్తూరు జిల్లాలోనే కాదు అటు తెలంగాణ… ఇటు ఆంధ్కప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కుప్పంలో పరిస్థితులు చంద్రబాబుకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయని, అభివృద్ధి సంక్షేమంతో ఈసారి తామే గెలుస్తామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఎలాంటి ప్రచారం లేకుండా ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని టీడీపీ నాయకులు తొడలు చరచటం ఆసక్తికరంగా మారింది.

కుప్పంలో గతమెంతో…

కుప్పంలో రాజకీయ పరిస్థితులు గతం కన్నా.. భిన్నంగా మారుతున్నాయని దాని ఫలితంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు తారుమారు కావచ్చనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కుప్పం నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కంటిన్యూ అవుతున్న సుమారు 20 వేలకు పైగా పక్క రాష్ట్రానికి చెందిన దొంగోట్లను గుర్తించి వాటిని అధికార పార్టీ తొలగించడం ఒక ఎత్తయితే, ఒకప్పుడు 60 వేల పైచిలుకు చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో 30 వేలకు పడిపోవడం చూస్తుంటే పరిస్థితులు పూర్తిగా మారాయని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కుప్పంలో తమకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కుప్పంనే నమ్ముకుంటే నట్టేట మునిగిపోతామనే ఆలోచనతో ప్రత్యామ్నాయంగా భీమిలిలో కూడా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తీసుకొనే ప్రత్యామ్నాయ నిర్ణయాన్ని కుప్పం ప్రజలు ఆమోదిస్తారా.. మౌనంగా తిరుగుబాటు తీర్పిస్తారా.. అనే విషయాలపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

రెండు సీట్లపైనే అనుమానాలు

ప్రత్యామ్నాయంగా మరో సీటులో పోటీ చేస్తే కుప్పం ప్రజల్లో అనుమానం ఏర్పడి ప్రతికూలంగా తీర్పుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇంతకాలం పాటు గెలిపిస్తూ వచ్చిన మమ్మల్ని అనుమానిస్తావా అనే భావన కుప్పం ఓటర్లలో కలిగితే ఆ తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏందనే వాదన కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.ఇక వైసీపీ చిత్తూరు జిల్లాపార్టీ అధ్యక్షుడు, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ భరత్ ను రానున్న ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపితే తాను అతడిని మంత్రిగా చేసి మీకు గిఫ్ట్ ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదివరకే పలుమార్లు కుప్పం ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డిని వీలైనంతవరకు ఎక్కువ సమయం కుప్పం పైనే దృష్టి సాధించే విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నారు. వీటి పర్యవసానంగా రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. వీటి ఫలితంగా కుప్పం నియోజకవర్గంలో అధికార పార్టీ ఊహించని విధంగా బలపడుతూ వస్తోందని చెప్పడానికి పలు ఆధారాలు కనిపిస్తున్నాయి. వీటిని అంచనా వేసుకున్న చంద్రబాబుకునేడు సందిగ్ధ పరిస్థితులు తప్పడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

20 వేలకు పైగా దొంగ ఓట్లు రద్దు ..

కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే రెండు పర్యాయాలుగా దొంగ ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 12 వేలకు పైగా దొంగ ఓట్లను అధికార యంత్రాంగం తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ పక్కనున్న తమిళనాడు కు చెందిన దొంగ ఓట్లుగా అధికారులు గుర్తించి వాటిని తొలగించారు. తాజాగా గత నెలలో 8,778 ఓట్లను జిల్లా అధికారులు తొలగించారు. మొత్తం కలిపి 20,778 దొంగ ఓట్లను గుర్తించి రద్దు చేశారు. ప్రస్తుతం దొంగ ఓట్లుగా గుర్తించి రద్దు చేసిన ఓట్లన్నీ గతంలో చంద్రబాబుకు పోలవుతోందిన ఓట్లని వైసీపీ నాయకుల ఆరోపణ.
.

స్థానిక సంస్థల్లో వైసీపీకి తిరుగులేని బలం …

కుప్పం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ బలపడిందని గత ఎన్నికల్లో పోలైన ఓట్ల గణాంకాలే చెబుతున్నాయి. గతంలో కుప్పంలో ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశం అభ్యర్థులే గెలిచారు. అయితే ఆ చరిత్రను తిరగరాస్తు రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకొని కుప్పంలో టీడీపీని చావు దెబ్బ కొట్టింది. 89 గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 74 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా 82 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 76 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. స్థానిక సంస్థల్లో కీలక పాత్రను పోషించే మండల పరిషత్తు అధ్యక్షులు, జిల్లా పరిషత్తు సభ్యుల ఎన్నికల్లో కూడా నాలుగు ఎంపీపీ స్థానాలు, నాలుగు జడ్పిటిసి స్థానాలను వైసిపి గెలుచుకొని టీడీపీని మట్టి కరిపించింది. . అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసి అందులో నిర్వహించిన ఎన్నికల్లో 25 కౌన్సిలర్ స్థానాలకు గాను 19 కౌన్సిలర్లను వైసీపీ గెలుచుకొని విజయదుందుభి మోగించడంతో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అనుకోనంత బలపడింది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా తమ పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తే తప్పక విజయం సాధిస్తామని ధీమాతో పార్టీ అధిష్టానం అంచనాలు వేస్తోంది. ఐతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీకే బలం చేకూరుతుంది, స్థానిక నాయకత్వం కోసం ఆధిపత్య ఆరాటంతో అధికార పార్టీకే జనం మొగ్గు చూపుతారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో .. ఊరూర కులం, ధనం ప్రభావం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థితి మారుతుంది. చంద్రబాబును కుప్పం ప్రజలు దూరం చేసుకుంటారా? లేక ఆదుకుంటారా? రానున్న ఎన్నికలే చంద్రబాబు తలరాతను ఏ రీతిలో ఉంటుందో? అంచనాలకు అందని ప్రశ్నలే.

Advertisement

తాజా వార్తలు

Advertisement