( మచిలీపట్నం ప్రతినిధి , ప్రభ న్యూస్ ) : పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మహా జోరుగా పసందుగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప్పాల రాము, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ లు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పెడన నగరపాలక సంస్థలో కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారాల్లో ఉప్పాల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ ఎక్కడ వ్యక్తిగత దూషణలకు దిగకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏవిధంగా అభివృద్ధి చేస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. వారిద్దరి ప్రచారం ఎలా ఉందంటే – రెండు, మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందా? అన్న తీరులో భారీ ఎత్తున ప్రచారం ఉంటోంది. ఎవరి ప్రచారం వారిదే.. వివాదాలు లేవు. ఘర్షణలు లేవు. ఒకరిపై ఒకరు విమర్శలు లేవు. ఇది శుభ పరిణామం.
ఉప్పాల దూకుడే దూకుడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పాల రాము, ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హారిక తమ ప్రచారంలో ఇప్పటివరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, వారి పిల్లల భవిష్యత్తుకు విద్య, ప్రతి కుటుంబానికి అందిస్తున్న వైద్యం, కుటుంబ పోషణకు అందిస్తున్న నగదు…. ఇలా జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో చేస్తున్నారని, మరోసారి ముఖ్యమంత్రి అవ్వగానే ఇంతకంటే ఎక్కువ ప్రజలకు మరెన్నో సంక్షేమాలు అందిస్తారని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఆ దంపతులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. పూలదండలు, హారతులతో తమ ఆనందాన్ని దీవెనలను అందిస్తున్నారు.
కృష్ణ ప్రసాద్ జోరే జోరు
ఇక కాగిత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అక్రమాలను గురించి ఏకరవు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల మందికి ఉద్యోగాలు, రూ.3వేలు నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేలు, ప్రతి రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500లు, మహిళకు ఉచితంగా బస్సు ప్రయాణం,తదితర సూపర్ సిక్స్ హామీలపై కృష్ణ ప్రసాద్ ప్రచారం చేస్తున్నారు. కాగిత కృష్ణ ప్రసాద్ ఇప్పటికీ నియోజకవర్గమంతా కలియతిరిగి ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ఆయన వెళ్లిన ప్రతిచోట మహిళలు స్వాగతం పలుకుతూ పూలదండలు, హారతులతో ఆశీర్వదిస్తున్నారు. నియోజకవర్గం లో తెలుగుదేశం, జనసేన పార్టీల పక్షాన అభ్యర్థి ఎవరైనది నిర్ణయం కాకపోయినా కృష్ణ ప్రసాద్ చాలా కాలం నుంచి నియోజకవర్గం అంతా తిరుగుతూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ వస్తున్నారు.
స్వతంత్ర బాటలో బూరగడ్డ
రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వేదవ్యాస్ ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా తనకు పోటీ చేయడానికి అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డారు. చంద్రబాబు నాయుడు, పెడన నుంచి పోటీ చేయడానికి తనకు అవకాశం ఇస్తానని వాగ్దానం చేసి చివరకు అన్యాయం చేశారని వేదవ్యాస్ వాపోయారు. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అన్ని కులాల కంటే ఎక్కువగా ఉన్న దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. అందువల్ల ఆయన ప్రస్తుతం పెడన నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ అందరి అభిప్రాయాన్ని తెలుసుకుని, వారి మాట ప్రకారం స్వతంత్ర అభ్యర్థిగానైన పోటీ చేయడానికి సిద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతానికి వేదవ్యాస్ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ప్రజాభిప్రాయ సేకరణలో ఉన్నారు. నామినేషన్ చివరికైనా పార్టీ నేతలు అన్ని ఆలోచించి తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారు అన్న ఆశతో వేదవ్యాస్ ఉన్నారు. నాయకులపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలలో ఆయన ఉన్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
కాంగ్రెస్ సైతం బిజీబిజీ…
పెడన అసెంబ్లీకి నేనే పోటీ చేస్తాను అంటూ కాంగ్రెస్ నాయకుడు శాంతి రాజు ముందుకు వచ్చారు ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటూ ఉంటారు. అయితే పెడన నియోజకవర్గంలో గతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి, విశాఖ ప్రైవేటీకరణ అంశాలతో పీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల జనాన్ని ఆకట్టుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయటానికి అభ్యర్థుల్లో పోటీ పెరిగిన నేపథ్యంలో… పెడన నుంచీ అభ్యర్థులు క్యూకడుతున్నారు.
కాపు సామాజిక వర్గమే కీలకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పల రాము (గౌడ) తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాగిత కృష్ణ ప్రసాద్ (గౌడ) ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కావటంతో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30 వేల వరకు ఉండవచ్చునని అంచనా. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 40 వేలకు పైగా ఉంటారని అంచనా. ఐతే, టీడీపీ , జనసేన కలవటంతో ఈ సామాజిక వర్గం ఓట్లు ఏపార్టీకి ఎక్కువ శాతం బదిలీ అవుతాయనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల ప్రశ్న. కాపు సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు ఎటు మొగ్గు చూపిస్తే ఆ పార్టీకే విజయం అని ప్రచారం జరుగుతోంది.