Tuesday, November 12, 2024

Exclusive – విప‌త్తులో రెస్క్యూ ….. బెజ‌వాడ‌కు ఊపిరి

జోరు వాన, కరెంటు పోయింది. చిమ్మచీకటి, పైగా చలి. ఇంట్లో కొవ్వొత్తి ఆరిపోయింది. వంట చేసే వీలు లేదు. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆ ఇంటి ఇల్లాలి ఆందోళన అంతాయింతా కాదు. ఇంటోకి వస్తున్న నీళ్లను తోడి తోడి భర్త అలసి పోయాడు. భార్యాభర్తలు నడుములోతు నీళ్లల్లో మునిగారు. ఇద్దరి పిల్లల్ని భుజానికి ఎత్తుకుని .. ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక 48 గంటలు నరకయాతన అనుభవించారు. ఇంటిలోనే చచ్చిపోతామని ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ మరణ వేదనలో ఆర్తనాదాలు చేశారు. కాపాడండి అని కేకలు వేశారు. కానీ.. క్షణ క్షణం తమ గుండెలో అలజడి పెరుగుతున్న తరుణంలో ఒక్కాసారిగా మోటారు బోటు దడ దడ శబ్ధం వినిపించింది. హమ్మయ్య బతుకు జీవుడా? అని ఆ కుటుంబం ఇంటి గుమ్మంలో ఎదురు చూస్తోంది. ఊహించినట్టే విపత్తుల ప్రతిస్పందన దళం ప్రత్యక్షమైంది. బోటులో ఎక్కించుకుని పునరావాస కేంద్రానికి తరలించింది. ఈ హృద్య సన్నివేశం ఎక్కడదో కాదు.. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది. అంతే కాదు ఆకాశంలో హెలీకాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. కాలనీల్లో కాలువల్లా మారిన రోడ్లపై బోట్లు తిరుగుతున్నాయి. డాబాలపైకి చేరిన వరద బాధితులకు భోజనాల డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. బాధితులను వెన్నుదన్నుగా నిలిచాయి. నొప్పులొచ్చిన గర్భిణీలకు వైద్యసాయం అందించారు. పొత్తిళ్లల్లోని పసికందులను.. నడవలేని ముసలోళ్లను వరద దాటించారు. కేవలం కొన్ని గంటల్లోనే ఆపద్భాంధవుల్లా ప్రత్యక్షమైన విపత్తుల నివారణ దళాల మానవీయ స్పందన తెలుసుకుందాం. అభినందిద్దాం.

విజ‌య‌వాడ‌ను ముంచెత్తిన బుడమేరు
వ‌ర‌ద నీటి ముంపులో 20 కాల‌నీలు
కేంద్ర సాయం కోరిన సీఎం చంద్ర‌బాబు
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు
ఆపన్నుల రక్షణే ధ్యేయంగా ముందుకు
బాధితుల‌ను ఒడ్డుకు చేర్చటమే లక్ష్యం
హెలికాప్టర్లతో గాలింపు చ‌ర్య‌లు
బాధితుల ఇళ్ల ముంగిట్లోకి బోట్ల సాయం
అన్నం ప్యాకెట్ల‌తో డ్రోన్ల పత్యక్షం
బెజ‌వాడ సిటీలో అడుగ‌డుగునా గాలింపు
వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు వేగ‌వంతం
ఆప‌ద‌లో సాయం వ‌చ్చారు.. బాధితుల సంతోషం

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​:
అవును 50 ఏళ్ల చరిత్రలోనే కనివినీ ఎరుగని విపత్తు బెజవాడ నగరాన్ని కుదిపేసింది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన వాన.. సోమవారం వరకూ కురుస్తూనే ఉంది. అకస్మాత్తుగా బుడమేరు పొంగింది. వరద‌నీరు ఉప్పొంగింది. . కండ్రిక, సింగ్ నగర్, అయోధ్యనగర్, దేవీనగర్‌లో బుడమేరు విలయం సృష్టించింది. 2008నాటి వరద ప్రవాహాన్ని మించిపోయింది. కనీసం 20 కాలనీలు నీటి ముంపులో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ సముద్రాన్ని తలపించాయి. నడుములోతు నీటిలో.. ఇళ్లల్లో జనం బందీలుగా మారారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. కనీసం కబురు తెల‌ప‌డానికి కూడా వీలులేని స్థితి. రక్షించమని గొంతు చించుకున్నా.. దరిదాపుల్లో కాపాడే నాథుడే లేడు. ఈ వరద పరిస్థితిని అంచనా వేసిన సీఎం చంద్రబాబు.. తన బెజవాడ ప్రజలే కాదు, కృష్ణానది వరద ప్రాంతాల్లో లక్షలాది మంది చిక్కుకున్నారని.. వారిని కాపాడాలని అభ్యర్థించారు. చలించిన కేంద్రం సహాయక చర్యల్లోకి దిగింది. సోమవారం ఉదయానికే కేంద్ర విపత్తుల ప్రతిస్పందన దళాలను రంగంలోకి దిగాయి. రాష్ట్ర‌ విపత్తుల నివారణ దళాలు అప్పటికే బాధితులకు సాయం అందించాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు త‌మ ప‌నిలో అంకితభావం ప్రదర్శించాయి. బాధితులంద‌రికీ సాయం అందించాయి.

- Advertisement -

చక చక రెస్క్యూ ఆపరేషన్

విజయవాడలోని వరద ప్రాంతాల్లోని బాధితులను కాపాడటానికి ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. భారత వైమానిక దళం, నేవీకి చెందిన అయిదు హెలికాప్టర్లు, 188 పడవలు (152 మోటరైజ్డ్, 36 నాన్- మోటరైజ్డ్) విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని ఇతర ప్రాంతాలు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి మోహరించాయి. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఎన్టీఆర్, కృష్ణా తదితర జిల్లాల్లో 19 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు, 17 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి. మూడు వైమానిక హెలికాప్టర్లు, రెండు నావికాదళం హెలికాప్టర్లు ఆహార పదార్థాలను ఎయిర్‌ డ్రాప్ చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను ఎయిర్‌ లిఫ్టింగ్ కోసం గాలిస్తున్నాయి. విజయవాడలోని అత్యంత వరద ప్రభావిత ప్రాంతాలలో సింగ్ నగర్‌లో ఆహార ప్యాకెట్లను వదలడానికి కూడా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. గుంటూరు, కృష్ణా, ఏలూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో విపత్తుల ప్రతిస్పందన దళాలు పని చేస్తున్నాయి.

రిలీఫ్ కేంద్రాల్లో 42 వేల మందికి ఆశ్రయం

భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 4.50 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఒక్క విజయవాడలోనే రెండు లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకోగా సుమారు 42,000 మందిని 176 సహాయ శిబిరాలకు తరలించారు. వీరి కోసం 171 వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్‌లను విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకూ ప్రకాశం బ్యారేజీ 70 గేట్ల నుంచి 11.25 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 8.41 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పుడిప్పుడే బతికి బయట పడ్డ జనం వ్యథ కథలు వెలుగు చూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement