దగాపడ్డ ఏపీని కొత్త దారుల్లో నడిపిద్దామని ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చంద్రబాబు తాపత్రయపడుతుంటే.. మరోవైపు కూటమిలో కుంపట్లు పెట్టే యోచనలో బీజేపీ నేతలున్నారు. వైసీపీ అధినేత జగన్‌ని ఢీకొట్టాలంటే పార్టీలన్నీ ఏకం కావాలని, అప్పుడే అధికారం చేజిక్కించుకొవచ్చన్న రాజకీయ తంత్రాన్ని కొంతమంది బీజేపీ నేతలు నీరుగార్చే పనిలోపడ్డారు. తమకు సీటు దక్కలేదన్న ఆక్రోశంతో సొంత పార్టీనే బొందపెట్టే పనిలో యమ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకని అసంతృప్తులు, అలకలతో పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. అంతేకాకుండా ఇతర పార్టీల్లో సీట్ల వెంపర్లాటకు సై అంటున్నారు. ఈ క్రమంలో కొందరు సైకిల్‌పై సవారీకి రెడీ అవుతుంటే.. ఇంకొందరేమో ఫ్యాను గాలికి సేదతీరాలని చూస్తున్నారు. ఇలాంటి లీడర్ల తీరు చూసి జనం చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది.
= ఆంధ్రప్రభ స్మార్ట్ ప్రతినిధి, బెజవాడ
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావటం గ్యారెంటీ అని ప్రచారం ఊపందుకుంది. ఏపీలో కనీసం ఉనికిలో లేని బీజేపీ నేతలు మాత్రం కాషాయం కండువాలను గాలిలో గిరగిరా తిప్పుతూ మేఘాలలో తేలిపోతున్నారు. ఇక.. అప్పుడే తాము రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ పదవులు కొట్టేసనట్టు ఫీలవుతున్నారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరహాలో తాము కూడా రాజకీయాలను శాసిస్తామని తెగ సంబరపడిపోతున్నారు. కానీ, పార్టీ ఎదుగుదలను మాత్రం వీరు పట్టించుకోవడం లేదు. ఏపీలో బీజేపీకి 2014లో 13 సీట్లు ఇస్తే… పోటీ చేయటానికి 11 మందే దొరికారు. వీరిలో నలుగురే గెలిచారు. నాలుగు స్థానాల్లో ఇద్దరు గెలిచారు. కానీ, ఇలా గెలిచిన ఆరుగురూ.. బీజేపీ వల్లే గెలిచారనుకుంటే.. వీరికి అసలు విషయం తెలీనట్టే. కంభపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు బీజేపీ గుర్తుపై గెలిచారు.. కానీ, కమలం గుర్తును చూసి కాదని, ఇక్కడ వ్యక్తుల పరపతి, వారి వ్యక్తిగత అంశాలను చూసి ఓటేసినట్టు స్పష్టమవుతోంది.
ఏపీలో ఉనికే అంతంత!
ఈ ఎన్నికల్లో పొత్తు కుదరటమే ఓ గొప్ప. అదీ టీడీపీ, జనసేన తలవంచి సీట్లు ఇవ్వటం మరో గొప్ప. ఏకంగా ఆరు ఎంపీ సీట్లు.. 10 అసెంబ్లీ సీట్లు కేటాయించటం మరో విశేషం. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు 39. 17 శాతం, జనసేన బలం 5,53 శాతం. ఇక సీట్ల కోసం అలుగుతున్న బీజేపీ సొంత ఓటు బ్యాంకు ఎంతంటే.. కేవలం 0.84 శాతమే. ఇదే ఎన్నికల్లో నోటాకు పడిన ఓట్ల శాతం 1.28 శాతం. అసలు ఏపీలో ఉనికే లేదు. మరి ఈ రాద్దాంతమేంటీ? పోనీ గెలిచే అభ్యర్థులున్నారా? ఆ ఒక్కటీ అడక్కూడదు. పోటీ చేయడానికి అభ్యర్థులను కావలెను అని బోర్డు పెట్టుకునే పరిస్థితి. పార్టీలో ఉందే నలుగురైదుగురు. వీరిలో ఎవరు గెలుపు గుర్రమో.. వాళ్లకే తెలీదు. పైగా అలకలు, అసంతృప్తులు.. అసమ్మతులు.. ఇది ఏపీ బీజేపీ పరిస్థితి.. దాదాపు ఏపీలో కనుమరుగవుతుందనుకున్న సమయంలో.. రాష్ట్రంలో మరోసారి నిలబడేందుకు వచ్చిన అవకాశాన్ని సీనియర్లే కాళ్లదన్నుతున్నారనే అపవాదు వస్తోంది.
ఆ పీడకలను మర్చిపోతే ఎలా?
2019 ఎన్నికల ఫలితాలు ఏపీ బీజేపీకి ఓ పీడకలగా చెప్పుకోవచ్చు.. ఈ పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం., నోటా కంటే తక్కువ. నిజానికైతే ఏ పార్టీ అయినా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తుంది. మళ్లీ ఎన్నికల వరకు బలపడేందుకు యత్నిస్తుంది. కేంద్రంలో అధికార బల ఉంది. కానీ, ఏపీలో బీజేపీ బలపడింది ఎంత? పార్టీ సమావేశం పెడితే.. ఉన్న పదిమంది సీనియర్ నేతల్లో సగం మంది రారు.. ఉదాహరణకు బెజవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కీలక నేత సోము వీర్రాజు రాలేదు.. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు డుమ్మా కొట్టారు. మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆచూకీ లేదు. వీరంతా ఎందుకు రాలేదు?.. ఎందుకంటే కోరుకున్న సీటు దక్కలేదన్న కోపం, ఆక్రోశంతో పార్టీని ధిక్కరించే స్థాయికి చేరారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీటు రాకపోతే… పార్టీకి పాడి కట్టేస్తారా?
కేంద్రంలో అధికారం ఖాయం. అందుకు దక్షిణాదిలో సీట్లు పెరగాలి. ఇదీ బీజేపీ అధిష్ణానం వ్యూహం, కేంద్రంలో అధికారంలోకి ఎలాగు వస్తాం. ఇక ఏపీలో తమను మించిన నాయకుడు తెరమీదకు వస్తే.. ఇప్పటి యోగం దక్కదనే భయంతోనే ఏపీలో బీజేపీకి సీనియర్లు పాడి కట్టేస్తున్నారని పొలిటికల్ ఎనలిస్టులు విమర్శిస్తున్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కదిరి సీటుపై ఆశపెట్టున్నారు. కానీ, టీడీపీ తరపున యశోధా దేవిని అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. విశాఖ ఎంపీ టికెట్‌ను జీవీఎల్ నర్సింహారావు కావాలన్నారు. అది కూడా టీడీపీనే దక్కించుకుంది. భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక సోమువీర్రాజు రాజమండ్రి ఎంపీ సీటును కోరుకున్నారు. కానీ వాళ్ల పార్టీ అధిష్టానం ఆ టికెట్‌ను.. పురందేశ్వరికి కట్టబెట్టింది. దీంతో చాలామంది అలకపానుపు ఎక్కారు.. మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. ఈ చర్యలతో పార్టీకి ఉన్న కొద్దిపాటి కార్యకర్తలకు. పార్టీ కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని సరికొత్త సంకేతం తప్పలేదు.
ఆ గట్టులో కొందరు.. ఈ గట్టున మరికొందరు
ఇదే కాదు ఏపీ బీజేపీని మరో పంచాయితీ తెగ కంగారు పెడుతోంది. కొందరు టీడీపీ గట్టు మీద, మరి కొందరు వైసీపీ గట్టు మీద పొర్లుతున్నారనే ప్రచారం బీజేపీని ఇరుకున పెడుతోంది. ఏ పార్టీ గెలిచినా కేంద్రంలో తమ పార్టీకి మద్దతు లభిస్తుందనే బీజేపీ అగ్ర నాయకత్వం ఈ గ్రూపుల్ని పోషిస్తున్నాయనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి, ఇప్పుడు చెరో గట్టున చేదదీరిన ఈ రెండు వర్గాలు ఒకరిపై మరొక వర్గం చాడీల యాగం షురూ చేశాయి. సరీగా ఇలాంటి స్థితిలోనే ఇప్పటికే పది సీట్లు ధారాదత్తం చేశామని టీడీపీ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే.. ఇక జనసైనికుల్లోనూ కోపం రగిలింది. మోదీ, అమిత్ షా దర్బారులో తమకు తగిన స్థానం లభిస్తుందనే ఆలోచనతో పొత్తులో తమకు 24 సీట్లు కేటాయిస్తే.. బీజేపీ కోరిక మేరకు మరో మూడు సీట్లు జనసేన త్యాగం చేసింది. మళ్లీ ఒక నాయకుడి కోసం జన సేన సీటును త్యాగం చేయాలని బీజేపీ పెద్దలు వెంటపడటంతో… జనసైన్యంలో ఆగ్రహం తారాస్థాయికి చేరుతోంది. ఇంతకీ ఏపీలో సీనియర్లు బీజేపీని బతికిస్తారా? లేక బొందలో పెడతారా? అనే ప్రశ్నలు ఉమ్మడి అభ్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
పొత్తును లైట్ తీసుకుంటున్న కమలనాథులు
ఇదే కాదు ఏపీ బీజేపీని మరో పంచాయితీ తెగ కంగారు పెడుతోంది. పేరుకు బీజేపీలోనే ఉన్నా.. ఓ బ్యాచ్ టీడీపీకి.. మరో బ్యాచ్ వైసీపీకి ఫేవర్‌గా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇలా ఓ బ్యాచ్ మరో బ్యాచ్ నేతలపై విమర్శలు చేస్తున్నారు. వారి వల్ల..వీరికి.. వీరి వల్ల వారికి టికెట్లు దక్కడం లేదంటూ తెగ ఫీలైపోతున్నారు. సరే నిజంగానే వీళ్లకు టికెట్లు దక్కాయనుకోండి. జస్ట్ అనుకోండి. వీళ్లకు పడే ఓట్లు ఎన్ని? వీళ్ల చరిష్మా ఎంత? పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడేంటి? ఇది కదా ఆలోచించాల్సింది. కానీ ఈ ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో పొత్తులతో పోటీకి వెళితే.. 7.22 శాతం ఓట్లు వచ్చాయి.. 2019 ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తే.. ఒకశాతం ఓట్లు కూడా రాలేదు.. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 0.98 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు 1.24 శాతం. ఇది బీజేపీ ఘనత.. ఈసారి పొత్తులో ఉన్నారు కాబట్టి కాస్త ఓట్లు పెరగడం.. దాంతో పాటు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి పొత్తు అనేది ఓ గోల్డెన్ చాయిస్.. కానీ ఆ చాయిస్‌ను చాలా లైట్‌గా తీసుకుంటున్నారు ఏపీ కమలనాథులు.
లోకల్ లీడర్ల ఓవరాక్షన్..
నిజానికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడమే గొప్ప విషయం.. ఎందుకంటే.. చంద్రబాబు ప్రధాని మోదీపై ఎన్ని విమర్శలు చేశారు గతంలో.. అంతేందుకు పొత్తుకు కుదిర్చేందుకు రాయబారం నడిపిందే తానని.. చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మోడీపై ఎన్ని విమర్శలు చేయలేదు. ఇవన్నీ మోడీ, అమిత్ షాలకు తెలియదా? మర్చిపోయారా? నో.. అలాంటిది జరిగే చాన్సే లేదు. కానీ, అయినా పదిమెట్లు దిగొచ్చి ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఎలాంటి ఈగో చూపించలేదు. ఎలాంటి హెచ్చులకు పోలేదు. తక్కువ సీట్లైనా రాష్ట్రంలో పార్టీని బతికించాలనుకున్నారు. కానీ, లోకల్ లీడర్స్ ఓవరాక్షన్ మాత్రం తగ్గడం లేదు. అర్థంలేని పంతాలకు పోయి అలకపాన్పు ఎక్కితే.. చివరికి అడ్రస్ లేకుండా పోయేది వారు మాత్రమే కాదు. వారిని బతికిస్తున్న బీజేపీ అని తెలుసుకోవడం లేదు. ఇదే కంటిన్యూ అయితే.. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.