Thursday, October 17, 2024

Exclusive – ఖుల్జా.. సిమ్ సిమ్ : నల్లమలలో రహస్యాల కోట

ఆంధ్రప్రభ స్మార్ట్, కొత్తపల్లి (కర్నూలు జిల్లా) : నీటి స‌వ్వ‌డ‌లు.. జ‌ల ప‌ర‌వ‌ళ్ల‌తో కృష్ణ‌వేణి బిర బిరా శ్రీశైలం వైపు దూసుకుపోతుంటే.. ఓ పెద్ద లోయ.. ఆ పక్కనే ఓ పర్వతం అంచున కృష్ణమ్మకు బీటు వేసే ఈ అంకాలమ్మ కోటను చూస్తే.. వావ్ అనాల్సిందే. నంద్యాల జిల్లా ఆత్మకూర్ డివిజన్ అటవీ ప్రాంతంలో.. నల్లమల్ల గుండెల్లో పెద్దగుమ్మ డాపురం చుక్కానితో చేరుకునే ఈ పురాతన కోట అద్భుతం.. అమోగం. అరుదైన సన్నివేశం.

ఈ కోట కథే.. ధన రాశుల కథ కూడా నిక్షిప్తం కాలేదు. అదే గత చరిత్ర ప్రకారం.. ఈ ప్రాంతంలో బందిపోటు దొంగల ముఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ బందిపోట్లే.. దివిటీ దొంగలు. అడవుల్లో రహస్య స్థావరాల్లో సేద తీరి.. ఆ తరువాత సంపన్న పల్లెల్లో చోరీల స్వైర విహారం వీరి నిత్య కృత్యం. ఇలాంటి రహస్యస్థావరాల్లోనే అంకాలమ్మ కోట మేటి అని ఎన్నో కథలుగా ప్ర‌చారంలో ఉన్నాయి. అక్క‌డికి చేరుకోవాలంటే క‌ష్ట‌మే..తమను వెంటాడే సైనికులకు జాడా తెలిసినా.. కనీసం ఆ స్థావరానికి చేరుకునే అవకాశమే ఉండేది కాదు. ఇందుకు కారణం.. ఒకటే ఆకాశాన్ని తాకే నల్లమల్ల కొండలు ఒకవైపు.. లోతైన లోయ మరోవైపు.. కృష్ణమ్మ భీకర పరవళ్లు మ‌రోవైపు.. ఇలా మూడు దిక్కుల్లో దట్టమైన అడవి. పెద్ద పులులు, చిరుతల సంచారం.. నల్లటి తాచులు పహారాలో ఈ అంకాలమ్మ కోట‌ తిరుగులేని దుర్భేద్యంగా ఉంటుంది. అత్యంత పటిష్ట, భద్రతకు ఆనవాలుగా చెప్పుకోవ‌చ్చు.

అందుకే దివిటి దొంగలు తాము కొల్లగొట్టిన ధన రాశులను దాచుకునేందుకు ఈ కోటను తమ స్థావరంగా మలచుకున్నారని క‌థ‌నాలున్నాయి. ఈ కోటకు అంకాల పరమేశ్వరి దేవే సంరక్షణ మాత. ఈ ఆలయం కారణంగా అంకాలమ్మ పేరు మీదనే ఈ కోటను నిర్మించిన‌ట్టు తెలుస్తోంది. జాలర్లకు ఆవాసం.. చీమల తిప్ప శ్రీశైలం ప్రాజెక్టులో వీరభద్ర దుర్గం ముంపునకు గురి కావడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతాల ప్రజలు పునరావాసం కోసం వేరే గ్రామాలకు వలస వెళ్లిపోయారు. ఇదే తరుణంలో వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి జాలర్ల కుటుంబాలు ఇక్కడకు చేరుకున్నాయి. దాదాపుగా 42 ఏళ్లుగా ఇక్కడే గుడారాల్లో జీవనం సాగిస్తున్నారు. చేపల వేటకు అనువైన ప్రాంతంగా జాలర్లు ఎన్నుకున్నారు. దీన్ని ఇప్పుడు చీమ‌ల తిప్ప‌గా పిలుస్తున్నారు.

అద్భుత అందచందాల సీమ..

నల్లమల లోయలో పారే కృష్ణమ్మను.. అంకాలమ్మ కోటను దర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. విశాల లోయలో.. కృష్ణమ్మ సవ్వడి అనుభూతిలో అంకాలమ్మ కోటను కళ్లార వీక్షించేందుకు పర్యాటకులు ఉత్సాహంతో పరుగులు పెడుతుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఈ నది లోయలో సారవంతమైన భూమి అపారం.. ఈ భూమి ఆధారంగా నల్లమల అటవీ ప్రాంతం అంచుల్లో మారుతి జానాల బలపాల తిప్ప, సిద్దేశ్వరం అనేక గ్రామాలు ముంపునకు గురైనప్పటికీ.. కొన్ని గ్రామాలు కనుమరుగైనప్పటికీ.. నదీతీరం ఒడ్డున కొన్ని గ్రామాల్లో జన సంచారం కనిపిస్తుంది.

- Advertisement -

గుప్త చోరుల విధ్వంసం

దివిటి దొంగల స్థావరంగా పేరొందిన చారిత్రాత్మక అంకాలమ్మ కోటపై గుప్త నిధుల దొంగల కళ్లు పడ్డాయి. ఇదొక నిక్షిప్త గుప్త నిధుల క్షేత్రంగా గుప్త చోరులు నమ్ముతున్నారు . అంతే కాదు.. గుప్త నిధుల వేటలో అహోరాత్రులు .. కోటను తవ్వేశారు. అంతే అంకాలమ్మ కోట మొత్తం గుంతల మయంగా మారిపోయింది. కానీ. విశాలమైన కోట ప్రాకారంతో విశిష్టత కలిగిన ఆలయం ఆనవాళ్ల‌తో ఈ కోట ఇప్పటికీ గత చరిత్రను గుర్తుచేస్తోంది. అంకాలమ్మ ఆలయాన్నీగుప్త నిధుల దొంగలు వదలలేదు. ఈ వేటగాళ్ల తవ్వకాల్లో అంకాలమ్మ ఆలయం శిథిలావస్థలో చేరుకుంది.

అంకాలమ్మపై ప్రేమతో..

అంకాలమ్మపై ప్రేమతో.. భక్తితో.. ఇక్కడే బతుకు ఈడుస్తున్న విశాఖ జాలర్లు ఆలయ పరిరక్షణకు నడుము కట్టారు. ఎంతో శ్రమకోర్చి తమ స్వశక్తితో దాతల సహకారంతో ఆలయ జీర్ణోద్ధరణ క్రతువు నిర్వహించారు. ఇక అటవీశాఖ అధికారులు కూడా దృష్టి సారించారు. గుప్తనిధి తవ్వకాల వేటగాళ్లకు అడ్డుకట్ట వేశారు. దొరికిన గుప్త నిధి చోరుల నుంచి స్కానర్లను, ఆలయంలో బలికి తీసుకు వచ్చిన మేకలను, గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానాల్లో శిక్ష వేయించారు.

కోటకు చేరటం ఎలా?

తెలంగాణ నుంచి అంకాలమ్మ కోటకు చేరాలంటే.. సోమశిల నుంచి టూరిజం బోట్‌లో ఆరు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే చీమల తిప్ప కనిపిస్తుంది. అక్కడికి చేరుకొని ట్రెక్కింగ్ ద్వారా కొండ ఎక్కి అంకాలమ్మ కోట చేరుకోవచ్చు. తెలంగాణ వైపు నుంచి మరో దారిలో కూడా అంకాలమ్మ కోటకు చేరుకోవచ్చు. అమరగిరి నుంచి బోటులో 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి అంకాలమ్మ కోటకు చేరవచ్చు. కర్నూలు నుంచి వచ్చే పర్యాటకులు రోడ్డు మార్గంలో కొత్తపల్లి మండలంలోని గుమ్మడాపురం చేరుకొని.. అక్కడి నుంచి బైక్‌లో సులువుగా చేరుకోవచ్చు. కాలినడకన కూడా అంకాలమ్మ కోటకు చేరుకోవచ్చు. అయితే అంకాలమ్మ కోటకు వెళ్లాలనుకునే పర్యాటకులు తప్పనిసరిగా.. అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనుమతి తీసుకోవాలి. లేని పక్షంలో అంకాలమ్మ కోట చేరుకునే అవకాశమే ఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement