Monday, November 25, 2024

Exclusive – ఓటింగ్ క్రాసింగ్! అన్నిపార్టీల వ్యూహం ఇదే

ఒకటి మనకు.. మరొక‌టి మీ ఇష్టం
ఆత్మీయ సభల్లోనూ పెద్ద ఎత్తున‌ తీర్మానాలు
కుల సంఘాల్లో ఒట్లు, గ‌ట్టిగా నిర్ణయాలు
ఆందోళనలో అభ్య‌ర్థులు
ఎవరిని నమ్మాలో తెలియని అయోమ‌యం
ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌లే కూట‌మికి సానుకూలాంశం
ఊరూరా తిరుగుతుంటే అన్నీ స‌మ‌స్య‌లే
గెలిస్తే కార్పొరేష‌న్ ప‌ద‌వులిస్తామంటూ హామీలు
కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్టుల భ‌యం
లీడ‌ర్ల ఆశ‌ల‌న్నీ ఓట్ల చీలిక‌పైనే
క‌డ‌ప‌లో వైఎస్ కుటుంబం ఆధిప‌త్య పోరాటం
ష‌ర్మిల గ‌ట్టెక్కేనా అన్న‌దానిపై బెట్టింగులు

ఏపీ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం రోజు రోజుకూ ర‌స‌భ‌రితంగా మారుతోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌స‌భ రెండూ ఒకేసారి జ‌ర‌గ‌డం ఇక్క‌డ స‌మ‌స్య‌గా మారింది. అభ్య‌ర్థులకు ఇదో త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. అయితే.. అసెంబ్లీ అభ్య‌ర్థులు కొన్నిచోట్ల త‌మ‌కు ఓటేస్తే చాలు.. లోక్‌స‌భ ఓటు ఎవ‌రికేసినా ప‌ర్వాలేద‌న్న ప్ర‌చారం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా లోక్‌స‌భ అభ్య‌ర్థులు కూడా ఒక ఓటు మాకు.. ఇంకోటి ఎట‌న్నా వేయండి అన్న‌ట్టు ఒట్టు వేయించుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇక‌.. ఆత్మీస‌భ‌లు, కుల సంఘాల భేటీల్లో ఇదే తీరు క‌నిపిస్తోంది. దీంతో ఎవ‌రిని న‌మ్మాలో, ఎక్క‌డ ఎన్ని ఓట్లు ప‌డ‌తాయో అనే అంచనాకు లీడ‌ర్ల రావ‌డం లేదు. కాగా, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌పైనే కూట‌మి ఫోక‌స్ పెట్టిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. అదే సానుకూలాంశంగా త్రికూట‌మి లీడ‌ర్లు ఉన్నారు. అధికార వైసీపీ మాత్రం గెలిస్తే కార్పొరేష‌న్ ప‌ద‌వులిస్తాం అనే ఊర‌డింపులు చేస్తున్న‌ట్టు ప్ర‌చారంలో జ‌రుగుతోంది. అంతేకాకుండా క‌డ‌ప‌లో మాత్రం ష‌ర్మిల గెలుపు, ఓట‌ముల‌పై అప్పుడే బెట్టింగులు స్టార్ట్ అయ్యాయి. ఐపీఎల్ కంటే ఈ బెట్టింగులు జోరుగా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. వైఎస్ ఫ్యామిలీ ఇక్క‌డ ఆధిప‌త్య పోరాటం చేస్తుండ‌డమే దీనికి కార‌ణం.. మొత్తానికి అన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్‌పైనే ఫోక‌స్ పెట్టినట్టు ప్ర‌చార‌శైలి తీరు తెలియ‌జేస్తోంది.

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీలో రెండు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి పంపించాయి. ఇక అభ్యర్థుల అసలు ఆట ప్రారంభమైంది. సిట్టింగ్‌లు, నాన్ సిట్టింగ్‌లు, లోకల్స్, నాన్ లోకల్స్.. సీనియర్స్.. జూనియర్స్… వీరితోపాటు వారసత్వ బిడ్డలు ..ఇలా వివిధ ముద్దు పేర్లతో అభ్యర్థులు ఓటర్ల గడప గడపను తట్టారు. నమస్కారాలు.. దండాలతో ప్రణమిల్లుతున్నారు. ఇక పనిలో పనిగా ఆత్మీయ సమావేశాలతో అలకపాన్పు మారాజులను బుజ్జగిస్తున్నారు. ఇక్కడే అసలు సిసలు రాజకీయ పాచికలు తెరమీదకు వస్తున్నాయి. అదే క్రాస్ ఓటింగ్ ప్రణాళిక. ఇందులో అందులేదనే సందేహంతో పని లేదు. పోటీ చేసే ఎంపీ మనోడు.. ఎమ్మెల్యే పరాయి కులపోడు. గమనించి..ఒక ఓటు మనకే.. ఇంకో ఓటు మీ ఇష్టం అంటూ.. క్రాస్ పోలింగ్ కథనూ ముందస్తుగా ఏపీలో నేతలు వినిపించటం విశేషం.

ఊరూర తిరుతుంటే… అన్నీ సమస్యలే

- Advertisement -

అధికార పార్టీ గెలుపే ధ్యేయంతో… ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో జన సునామీ సృష్టిస్తోంది. పార్టీ కార్యకర్తలను, నాయకులను సిద్ధం చేసిన వైసీపీ అధినేత .. ప్రస్తుతం ప్రజలతో మమేకం అవుతున్నారు. తన పాలనలో లోటు పాట్లనూ అడిగి తెలుసుకుంటున్నారు. అభ్యర్థులు కూడా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనల్లో మునిగి తేలుతున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఏ ఓటరునూ వదలటం లేదు. 13వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో.. ఇప్పటికే ప్రత్యర్థి బలాన్ని , బలగాన్నీ బేరీజు వేసుకుని … ప్రత్యర్థి శిబిరంలోని అసంతృప్తి బలగానికి వల వేస్తున్నారు.

గెలిస్తే కార్పొరేష‌న్ ప‌ద‌వులు..

తాము గెలిస్తే తగిన ప్రాతినిధ్యం ఇస్తామని, స్థానిక సంస్థల్లో పదవులు, కార్పరేషన్లలో పదవుల్ని ఊరిస్తుంటే.. గ్రామ స్థాయి నాయకులకు అన్ని సమకూర్చుతున్నారు. ఓటర్ల నాడి ప్రకారం… కులం, మద్యం, నోటు అన్నీ సిద్ధమని చెబుతున్నారు. అసెంబ్లీ అభ్యర్థి ఇంటింట ప్రచారం పూర్తి చేస్తే… ఇక ద్వితీయ శ్రేణి రంగంలోకి దిగింది. ఇక్కడే కొత్త నేతలు కంగారెత్తుతున్నారు. సీట్లు రాని పరివారం అభ్యర్థి వెంట వెళ్తూనే… చిరునవ్వులతో కోవర్టు ఆపరేషన్ ప్రారంభించారు. సిట్టింగ్ అభ్యర్థులకు గ్రామ స్థాయి సమస్యలు ఇరుకున పెడుతున్నాయి. నవరత్నాలతో ఆదుకున్నాం కదా.. అని చెబుతుంటే.. ఇది సరే తాగటానికి మంచినీళ్లేవి. బియ్యం తినగలమా? కూరగాయలు కొనగలమా? ఊళ్లోకి బస్సు వస్తోందా? మీ వ్యాపారాలు మీవి, మా బతుకులు మావి అని గ్రామీణ జనం నిలదీస్తున్నారు.

ప్రభుత్వంపై వ్య‌తిరేక‌తే సానుకూలాంశం

టీడీపీ, జనసేన, బీజేపీ బలం లెక్కలతో…ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుపై ఆశతో.. ఇక అధికారం తమదేనని కూటమి ముందస్తుగానే విజయోత్సవంతో ఊరేగుతోంది. కానీ ఇక్కడే పైకి కానరాని తిరకాసే.. అడ్డంకిగా మారుతోంది. వైసీపీ సిట్టింగులకు ఏమాత్రం ఆలోచించకుండా టీడీపీ సీట్లు ఇచ్చేసింది. ఇక అసెంబ్లీలో అడుగుపెడితే చాలు అనే నినాదంతో జనసేన త్యాగశీలి అవతారం ఎత్తింది. ఓటు బ్యాంకులో కనీస జాడ కూడా లేదని బీజేపీ సీట్ల కోసం వెంపర్లాడింది. ఎట్టకేలకూ అధికారం రావాలంటే ఈ కూటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ … ఒకటి కాదు ఐదారు మెట్లు కిందకు దిగారు. బీజేపీకి దక్కిన ఆరు ఎంపీ సీట్లల్లో వైసీపీకే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటేనే బీజేపీకి ఎంపీ సీట్లు దక్కుతాయి. కానీ ఇక్కడే బీజేపీ అభ్యర్థుల ఎంపీపైనే అసలు సిసలు తగువులాట పీట ముడి వీడటం లేదు. విశాఖపట్నం, నరసాపురం ఎంపీ స్థానాలపై బీజేపీ పట్టువీడటం లేదు. దీనికి తోడు ఈ రెండు సీట్లు తమకు ఇస్తే గెలుస్తామని టీడీపీ చెబుతోంది. పార్టీ మారిన నాయకులకు ఇట్టే సీటు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి.. రఘురామ కృష్ణం రాజే పెద్ద సమస్యగా మారారు. ఆయనకు అసెంబ్లీ సీటు ఇస్తే ఉండిలో టీడీపీ గల్లంతే. నరసాపురం అడిగితే బీజేపీకి కోపం. ఏం చేయాలో తెలియని స్థితిలో చంద్రబాబునాయుడు కొట్టి మిట్టాడుతున్నారు. ఇక ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటమే ధ్యేయంగా పావులు కదుపుతుంటే.. అటు ఎంపీ అభ్యర్థుల బలగాలు మాత్రం … క్రాస్ ఓటింగ్ పైనే అత్యంత శ్రద్ధ పెడుతున్న మాట వాస్తవం.

కాంగ్రెస్ లోనూ గోలే..

ఏపీలోనూ ఆపరేషన్ కర్నాటక, ఆపరేషన్ తెలంగాణ వ్యూహంతో తమ ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ తెగ ఉబలాట పడుతోంది. కానీ ఇక్కడ ఒకే ఒక కడప స్థానంపైనే జనం దృష్టి పడింది. కాంగ్రెస్ కూడా ఓట్లు చీల్చుతుందా? లేదా? అనేది ఇంకా రాజకీయ పరిశీలకులను వేధిస్తున్న ప్రశ్నే. అసెంబ్లీ టిక్కెట్లు రాని అభ్యర్థులు అప్పుడే కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభించటం, వాళ్లందరినీ ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరించటం ఇత్యాధి ఘటనలకు తెర లేచింది. కోస్తాలో, ఉత్తరాంధ్రలోఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కాంగ్రెస్ శిబిరానికి చేరుతున్నారు. వీరందరికీ సీటు లభించినా.. గెలిచే అవకాశాలపైనే అనుమానాలు తప్పటం లేదు. ఏతావాత కడపలో వైఎస్ తనయ షర్మిల రాజకీయ భవిష్యత్తుపైనా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గెలుపు, ఓట‌ముల‌పై బెట్టింగులు మొద‌ల‌య్యాయి. ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జాడ్యం తెరమీదకు వచ్చింది. ఎంపీ ఓటు షర్మిలకు, అసెంబ్లీ ఓటు స్థానిక అభ్యర్థికే వేయాలనే ప్రచారం కూడా అప్పుడే మొదలైంది. ఇక్కడ వైఎస్ కుటుంబం మధ్య ఆధిపత్య పోరాటంతో క్రాస్ ఓటింగ్ ఫలితం తప్పదని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనా… ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగటంతో.. క్రాస్ ఓటింగ్ జరిగి తీరుతుందని పొలిటికల్ అనలిస్టుల అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement