Friday, November 22, 2024

Exclusive – జెండా వ్యూహం – అన్నిటికీ సిద్ధం

ఏపీలో లీడర్ల నయా దండయాత్ర
పులివెందులపై చంద్రగ్రహం
కుప్పంలో జగన్మోహనం
ప్రత్యర్థి పార్టీలు వ్యూహం.. ప్రతివ్యూహం
జగనన్నకు షర్మిల, సునీత అస్త్రాలు
చంద్రబాబు కోటపై అభివృద్ధి మిసైల్స్
తెరమీదకు ప్రధాన యుద్ధాలు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల కంచు కోటల్ని ధ్వంసం చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నిన్న మొన్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ వేయటానికి అధికార పార్టీ పకడ్బందీ పథకాన్ని రచించింది. అభివృద్ధి, సంక్షేమమే అస్ర్తంగా ప్రయోగించి… ప్రతిపక్ష నేత పీఠం కూసాలు కూల్చబోతోంటుంటే… 46 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబం కంచుకోటలో పాగా వేయటానికి తెలుగుదేశం దండయాత్రకు సిద్ధమైంది. మళ్లీ అటు కుప్పం, ఇటు పులి వెందుల రాజ్యాలపై ఈ రెండు వైరి పార్టీలు ఘోరీ దండయాత్ర మరోసారి సిద్దం కాగా.. ప్రత్యర్థిని ఓడించటమే లక్ష్యంగా ఈ సారి తంత్రాలు, మంత్రాలు, ఎత్తులు, జిత్తులు తెరమీదకు వస్తున్నాయి.

అభివృద్ది, సంక్షేమమేతో జగన్ దండయాత్ర ..

చంద్రగిరి నుంచి తరలి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు కుప్పం సామ్రాట్టుగా మారిపోయారు. ఇక్కడ ఆయనపై విజయం అసాధ్యం. ఇదీ ఇప్పటి వరకూ చరిత్ర. యువ నేత జగన్ మోహన్ రెడ్డి… తన ప్రత్యర్థి చంద్రబాబు ఇలాఖాపై దృష్టి సారించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు మిసైల్స్ తో దాడికి దిగారు. నవరత్నాలు షూట్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల నుంచి రైతులకు భరోసా వరకూ.. రెవెన్యూ డివిజన్, కేసీ కెనాల్ కు నీళ్ల వరకూ… అభివృద్ధిని పరుగులు తీయించారు. అన్నిటి కంటే బడుగులకే రాజ్యాధికారం నినాదంతో పెద్ద మైన్ పేల్చారు. నకిలీ ఓట్లను గాలికి ఊది పారేశారు. 2019 వచ్చిన 30 వేల మెజారిటీకి గండి కొట్టారు.ఇక భంగపాటు తప్పదనే రీతిలో రాజకీయ పరిశీలకుల్ని సైతం కదిలించారు.

అది కడప పులిగడ్డ..

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన కంచుకోటపై ఎన్ని ఏళ్లు దండయాత్రలు చేసినా.. వైఎస్ సామ్రాట్ దే విజయం. ఇక్కడ పులివెందుల కుటుంబాలన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి పరివారమే. ప్రత్యర్థులకు కనీసం ఊపిరి సలపదు. 1978 నుంచి ప్రారంభమైన వైఎస్ ఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కుటుంబం అప్రతిహాతంగా జైత్రయాత్ర జరుపుతూనే ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవివర్భావంతో అన్న ఎన్టీఆర్ సుడిగాలిలో కొట్టుకు పోయింది. 2019 నాటికి ఈ విజయపరంపరలో మెజారిటీ దూసుకు పోతోంది. గత పాతికేళ్లుగా పసుపుసైన్యం సేనానిగా సంగిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి అలుపెరగని మహ్మద్ ఘోరీ తరహాలో దండ యాత్ర చేస్తున్నారు… ఓడిపోతున్నారు. తొలి మూడు ఎన్నికల్లోనూ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డికి 35 వేల ఓట్లు మించలేదు. 2014, 2019లో మాత్రం 45 వేల ఓట్లుపైగా వచ్చాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే 2011లో కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిపై విజయం సాధించారు. జిల్లాలో ఆ తరువాత వైరుధ్యం అనివార్యం కాగ టీడీపీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా పులివెందులలో వైఎస్ కుటుంబంపై అలుపెరగక పోరాడిన తెలుగుదేశం యోధుడు ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి అంటే తలూపాల్సిందే.

- Advertisement -

దాయాదుల పోరుతోనే…

మహా రాజ శేఖరుడి కోటలోనూ దాయాదుల పోరు తప్పలేదు. రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం వైఎస్ వివేకానంద రెడ్డి లక్ష్మణుడి పాత్ర పోషించారు. వైఎస్ఆర్ మరణానంతరం పరిణామాల నేపథ్యంలో… కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుంబ పొరపొచ్చాలు రాజకున్నట్టు తెలుగుదేశం శ్రేణుల ప్రచారం. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో వివేకానంద రెడ్డిని టీడీపీ ఓడించినట్టు ప్రచారం జరిగింది. ఈ సంగతి పక్కన పెడితే.. జగన్ చుట్టూ ప్రత్యర్థులు ఈ సారి భారీ వల సిద్ధం చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యోదంతమే ప్రధాన కారణం. వివేకనంద రెడ్డి తనయ సునీత రెడ్డి న్యాయస్థానాల్లో పోరాటం ఈ కుటుంబాన్ని కకావికలం చేస్తోంది. ఇక సొంత సోదరి షర్మిల కాంగ్రెస్ బాటలో …తిరుబాటు జెండా ఎగుర వేసింది. పులివెందుల పురిటిగడ్డలో తన ప్రభావం ఎంతవరకూ చూపిస్తుందో గానీ, వివేకానంద రెడ్డి సహజంగా స్నేహశీలి, శాంత స్వభావి, ఆయన హత్యోదంతంతో పులివెందులలో కొన్ని వర్గాల్లో అసంతృప్తి రగిన విషయం యథార్థమే. కానీ ఈ అంశం ఎంత వరకూ దారి తీస్తుందో ఎవరికీ అర్థం కాని అంశం.

జగనా…మజాకా…

సీఎం జగన్ అంటే పులివెందులలో తిరుగులేని సామ్రాట్టే. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ప్రజాబలం అంతులేనిదే. 2014లో 1,24,506 ఓట్లు వస్తే తెలుగుదేశం అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డికి 49,333 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి 75,243 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2019లో 1,32,357 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలో కంటే 8 వేల ఓట్లు అధికంగా పెరిగాయి. 90.110 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సతీష్ కుమార్ రెడ్డికి 42,246 ఓట్లు వచ్చాయి. అంటే గతం కంటే తగ్గాయని అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో ఇంత మెజారిటీని తగ్గించి.. జగన్ ను ఓడించటం సాధ్యమా? అనేది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. ఐతే, ఈ సారి ప్రత్యర్థి మారారు.. బీ టెక్ రవి ప్రత్యర్థిగా పోటీ పడనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఎస్వీ సతీష్ రెడ్డి తన సహకారాన్ని నిరాకరించారు. వైసీపీలో చేరుతారని మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. ఎంత చేసినా.. తెలుగుదేశం సాంప్రదాయ ఓటింగ్ బలం 50 వేలకు మించదు. అందుకే తెలుగుదేశం, జనసేనపార్టీలు వివేకానంద రెడ్డి హత్య, షర్మిల వివాదానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ రెండు కారణాలతో వైఎస్ ఇలాఖాలో చరిత్రను తిరగరాయాలని దండయాత్ర జరుపుతున్నాయి. ఈ స్థితిలో అటు కుప్పం, ఇటు పులివెందులలో ప్రత్యర్థులు గెలుస్తారా? నిరాశ పడుతారా? ఏపీ ప్రజలు ఎదురు చూడాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement