Monday, November 18, 2024

Exclusive – శ్రీవారి చెంత మరో అపచారం – సరుకుల్లోనూ కల్తీ బాగోతమే..


నాణ్యతలేని సరుకులు
యాలకులు, కిస్​మిస్​లను వదల్లేదు
అమ్యామ్యాల కోసం అడ్డదారులు
కొనుగోళ్లల్లో అతిపెద్ద గోల్​మాల్​
బిస్కెట్​ గ్యాంగ్‌కే కాంట్రాక్టులన్నీ
సత్రాల్లో పాగా .. స్టాల్స్​ని వదలని దగా
టీటీడీ పాలకమండలి గుటకాయస్వాహ కథ
విజి‘లెన్స్’ నివేదిక రెడీ..
వారంలో సర్కారుకు అందజేత

ఆంధ్రప్ర‌భ స్మార్ట్, సెంట్ర‌ల్ డెస్క్‌:
తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాల‌కు వినియోగించే ప‌లు ప‌దార్థాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. నిబంధనల ప్రకారం ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలోని యాలకుల్ని సరఫరా చేయాలి. కానీ, కాంట్రాక్టరుకు ఆ రూల్‌తో పని లేదు. నాలుగు మిల్లీమీటర్ల సైజు యాలకుల్లో కొసరంత అసలు యాలకులు కలిపి సరఫరా చేసినా.. గ‌త టీటీడీ పాలకమండలి, కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్‌ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ప‌సిగ‌ట్టింది. బస్తాల్లో అడుగున భారీ మొత్తంలో నాసిరకం నింపి.. పై భాగంలో మాత్రం నాణ్యమైన సరకులు చూపించేవార‌ని తెలుస్తోంది. ఇంకేముందీ నాణ్యమైన సరకు నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించి, అంతా బాగున్నట్టు ధ్రువీకరించేవారని విజిలెన్స్‌ అధికారులు త‌మ నివేదిక‌ల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ విభాగం వారం రోజుల్లో ప్రభుత్వానికి త‌మ నివేదిక సమర్పించనున్న‌ట్టు స‌మాచారం.

జీడిపప్పులో పురుగులున్నా…

- Advertisement -

జీడిపప్పు కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పును కాంట్రాక్ట‌ర్లు సరఫరా చేశారని విజిలెన్స్‌ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. పాలక మండలి పెద్దలకు గిట్టని సరకుల సరఫరా కాంట్రాక్టర్లకు చుక్కలు చూపించి బయటకు పంపేసినట్టు దర్యాప్తులో తేలింది. అత్యవసరం పేరుతో తమ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు సరకులు కొన్నట్లు గుర్తించింది. సిండికేట్ లో లేని కాంట్రాక్టర్ నుంచి సింగిల్‌ బిడ్‌ దాఖలైతే ఆ టెండర్‌ను రద్దు చేసేవారని, అదే సొంత బిస్కెట్ గ్యాంగ్ కాంట్రాక్ట‌ర్ ద్వారా సింగిల్‌ బిడ్‌ దాఖలు చేసినా కాంట్రాక్ట్‌ కట్టబెట్టేవారని విజిలెన్స్‌ దర్యాప్తులో తేలిందని సమాచారం.

నెయ్యి శాంపిళ్లకు ఉత్తుత్తి తనిఖీలు..

తిరుమల కొండపై ఉన్నది వాటర్‌ సేఫ్టీ ల్యాబ్‌ మాత్రమే. అక్కడ నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరీక్షలకు కావల్సిన పరికరాలు, నిపుణులైన సిబ్బంది లేరు. నెయ్యి ట్యాంకర్లలో మూడు అరలు ఉంటాయి. నాణ్యతను పరీక్షించేందుకు మూడు అరల నుంచి వంద గ్రాముల చొప్పున సేకరించి, ఆ మొత్తాన్ని కలిపి, దానిలోంచి నమూనాను తీసుకోవాలి. మూడు అరల్లో ఒక దాంట్లోనే నాణ్యమైన నెయ్యి సరఫరా చేసి, మిగతా రెండు అరల్లో కల్తీ నెయ్యితో నింపేవారా? బాగున్న నెయ్యి శాంపిళ్లనే పరీక్షకు తీసుకునేవారా అన్న కోణంలోనూ విజిలెన్స్‌ దర్యాప్తు సాగినట్టు తెలిసింది.

శ్రీవాణి ట్రస్ట్ షరా మామూలే..

శ్రీవాణి ట్రస్టు పేరుతో ఆలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణకు పాత టీటీడీ పాలక మండలి ఇష్టానుసారం నిధులు విడుదల చేసినట్లు విజిలెన్స్‌ విచారణలో తేలింది. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నాయకులకు ఇష్టానుసారం నిధుల పందేరం చేశారని గుర్తించారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా వర్క్‌ ఆర్డర్లు ఇచ్చినట్టు తేలిందని సమాచారం. ఇతర ఆలయాలకు గరిష్ఠంగా ₹25 లక్షల వరకు ఇచ్చేందుకే నిబంధనలు అనుమతిస్తుండగా, 63 ఆలయాలకు ₹35 లక్షల వరకు కేటాయించినట్టు తెలిసింది. కొన్ని నిర్మాణం పూర్తి అయిన ఆలయాలకూ నిధులు విడుదల చేసినట్టు గుర్తించారని తెలిసింది.

ఆఫీసర్ల కళ్లకూ నోట్ల గంతలు

తిరుమలలో నిర్దిష్ట గడువు ముగిసిన పదమూడు ప్రైవేటు వసతి గృహాల్ని తీసేసి కొత్తవి కట్టేందుకు కాటేజ్‌ డొనేషన్‌ స్కీం కింద పలువురికి కేటాయించారు. ఎన్నికలకు ముందు మరో నాలుగు అతిథిగృహాలు కేటాయించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటిలో కొన్ని కాటేజీల్ని గతంలో వాటికి కేటాయించిన స్థలానికి మించి, మరికొంత ఆక్రమించి కట్టేసినా పాలకమండలి కళ్లుమూసుకుంది. గతంలో ఒక అతిథి గృహం 299 చ.మీ. విస్తీర్ణంలో ఉంటే, ప్రస్తుతం మరో 100 చ.మీ. మేరకు ఆక్రమించి కట్టేశారని విజిలెన్స్‌ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ఇవన్నీ టీటీడీ ఉన్నతాధికారులకు తెలిసే జరిగాయని, కానీ వారంతా కళ్లకు నోట్ల గంతలతో వ్యవహరించారని నిగ్గుతేల్చింది.

సత్రాలూ.. స్టాల్సూ.. వదల్లేదు

తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల్ని భూమన కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఉండగా ఆగమేఘాలపై కూల్చేసి ₹600 కోట్లతో టెండర్లు పిలవడంపైనా విజిలెన్స్‌ విభాగం దృష్టి పెట్టింది. పటిష్ఠంగా ఉన్న ఆ సత్రాలకు మరమ్మతులు చేస్తే సరిపోయేదని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. స్విమ్స్‌లో భవనాల పునర్నిర్మాణం, అభివృద్ధి పేరుతో ₹197 కోట్లు కేటాయించేందుకు 2023 నవంబరులో తీర్మానం చేశారని, ఇక్కడ అవసరం లేకున్నా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తిరుమలలో దుకాణాలను ఇష్టానుసారంగా కేటాయించారని విజిలెన్స్‌ విచారణలో తేల్చారు. తట్టల పేరుతో అనధికార దుకాణాల్ని ఏర్పాటు చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారని నివేదికలో పొందుపర్చారు. లైసెన్సు ఒకరి పేరుతో ఉంటే లీజు పేరుతో అనేక మంది చేతులు మారినట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement