Tuesday, November 19, 2024

ఉత్సాహంగా వైద్యుల క్రికెట్ పోటీ – విజేతగా నార్త్ ఆంధ్ర జట్టు

ఒంగోలు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్) : ఆర్థోపెడిక్ వైద్యుల రాష్ట్ర స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ 2 పోటీలు ఉత్సాహంగా ఒంగోలులో రెండు రోజులు పాటు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజేతగా నార్త్ ఆంధ్ర జట్టు నిలిచింది. ఆర్థొపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఒస్సాప్) ఆధ్వర్యంలో ప్రకాశం ఆర్థోపెడిక్ అసొసియేషన్ సహకారంతో ఒస్సాప్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ -2 క్రికెట్ మ్యాచ్ రెండవ రోజు ఒంగోలు శర్మ కాలేజి క్రికెట్ మైదానంలో ఉత్సాహంగా ముగించారు. ఉదయం మొదటగా గుంటూరు, ప్రకాశం జట్ల మధ్య మ్యచ్ జరగగా ప్రకాశం జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, గుంటూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్ కు దిగిన ప్రకాశం ఎముకల వైద్యుల జట్టు 12 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లకు 118 పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. కాగా ప్రకాశం జట్టు కెప్టెన్ డా.జీవన్ ఆల్రౌండ్ ప్రతిభ చూపి 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నారు. సాయంత్రం ఫైనల్ మ్యాచ్ నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్, ప్రకాశం ఆర్థోపెడిక్ అసోసియేషన్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నార్త్ ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్ కు దిగిన ప్రకాశం జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. టోర్నమెంట్ విజేతగా నార్త్ ఆంధ్ర ఆర్థోపెడిక్ అసోసియేషన్ జట్టు నిలవగా రన్నరప్ గా ప్రకాశం జట్టు నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, బెస్ట్ బ్యాట్స్ మెన్ అవార్డు డా.జీవన్ గెలుచుకోగా, బెస్ట్ బౌలర్ అవార్డ్ డా.ఆదర్శ్ గెలుచుకున్నారు. ఒస్సాప్ క్రికెట్ లీగ్ సీజన్ 2 అధ్యక్షులైన డా.మాల్యాద్రి నాయుడు , సెక్రెటరీ డా.రావిపాటి జయ శేఖర్ పర్యవేక్షణలో ఈ క్రికెట్ పోటీని నిర్వహించారు. ఈ మ్యాచ్ లలో ప్రకాశం, నార్త్ ఆంధ్ర (విశాఖపట్నం), గుంటూరు జిల్లాల ఆర్థోపెడిక్ వైద్యుల జట్లు ఉత్సాహంగా పాల్గొని క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఎముకల వైద్యులు డాక్టర్ చాపల వంశీ కృష్ణ, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రవీంద్ర, డాక్టర్ శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement