(ప్రభ న్యూస్ బ్యూరో) శ్రీకాకుళం, జూన్ 2: ఈనెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ఆదివారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు.
ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్, ఈటిపిబిఎస్, పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపునకు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ గురించి చెప్పారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు.
ఈనెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం, మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని, సమూన్ హాజరయ్యారు. జిల్లా నుంచి కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను వివరించారు.